తేనెపూల మీద తుమ్మెద – కవితాంతరంగ పరామర్శ మీద స్పందన


తూముచెర్ల రాజారామ్ గారు తను రాసిన “తేనేపూల మీద తుమ్మెద – కవితాంతరంగ పరామర్శ"  అనే పుస్తకం మీద సమీక్ష చేయమన్నప్పుడు దానికి నేను అర్హుడినా అని ఆలోచించాను. “పుస్తకం చదివిన తరువాత మీకేమి అనిపించిందో చెప్పండి చాలు” అని రాజారామ్ గారు చెప్పిన తరువాత ‘హమ్మయ్య’ అనుకున్నాను. నేను కథల గురించి సమీక్షించిన సందర్భాలు ఉన్నాయి గానీ కవిత్వం మీద, అందునా కవిత్వం మీద వచ్చిన విమర్శనా గ్రంథాల మీద ఇంతవరకు సమీక్ష చేయలేదు. కానీ “తేనేపూల మీద తుమ్మెద – కవితాంతరంగ పరామర్శ" చదువుతుంటే విమర్శకుడు కవి యొక్క ఆత్మను ఆవిష్కరించే పనిముట్టు అని అర్థం అయ్యింది. విమర్శకుడు లేకుంటే, కవిత్వం చదువుతున్న పాఠకుడు కవిత్వం అనే పద్మ వ్యూహం లో దారీ తెన్ను కానకుండా పరిభ్రమిస్తాడు. కవి ఆవిష్కరించాలనుకున్న భావనామయ చిత్రాలు పాఠకుడి ముందు సరిగా రూపు కట్టవు. దీనికి కారణం కవి మరియు పాఠకులు భిన్న నేపథ్యాల నుంచి రావడమే.

కవిత్వాన్ని రాయడం కంటే, దానిని విమర్శించడం కష్టం. ఒక కవిత్వానికి సామాజిక, తాత్విక, చారిత్రక మరియు వైయక్తిక కోణాలు ఉంటాయి. వాటిని అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి విమర్శలో. కవి అనుభవాన్ని అనుభూతి లోకి దింపే నేర్పు విమర్శకుడికి ఉండాలి. కవి ఒక భావజాలం లో ఇరుక్కున్నా కూడా, విమర్శకుడు ఒక భావ జాలానికి మాత్రమే కట్టుబడి ఉండకూడదు. కవిత్వాన్ని వ్యష్టి నుంచి సమిష్టికి చేర్చే బాధ్యత విమర్శకుడిదే. కవిత్వానికి రీతి ప్రధానం, నాటకానికి రంగం ప్రధానం. కవిత్వంలో రసం, అలంకారం, రీతి, ధ్వని ఎలా ఉన్నాయో  బేరీజు వేసే తూకం రాళ్లు విమర్శకుడి వద్ద ఉండాలి. కవి అనుభవాన్ని పాఠకుడు అనుభవానికి తెచ్చుకోలేడేమో అని అనుమానం ఉన్న చోట మాత్రమే విమర్శకుడు కల్పించుకోవాలి. అప్పుడే అది సద్విమర్శ అవుతుంది. కవి ఉద్రేకాలకు ఛానెల్ గానే కాకుండా, ఒక్కోసారి ఫిల్టర్ గా కూడా పనిచేయాలి విమర్శకుడు. అంటే సమాజం పట్ల కవికి మించిన బాధ్యత విమర్శకుడికి ఉంది. ఇవన్నీ బాగా తెలిసిన విమర్శకులే మన రాజారామ్ గారు.

రాజారామ్ గారు తన విమర్శనా గ్రంథానికి పేరు పెట్టిన తీరు కూడా అద్బుతం. ఇక్కడ విమర్శకుడే తేనె పూల మీద వాలే తుమ్మెద. తుమ్మెద కు మధు విద్య తెలుసు. అంటే మకరందాన్ని తేనెగా మార్చే విద్య తెలుసు. కవిత్వం మకరందం అయితే దాని అంతరంగం తేనె లాంటిది. కవిత్వం నుంచి దాని పిండితార్థాన్ని గ్రహించాలి అంటే విమర్శకుడి సహాయం తీసుకోక తప్పదు. విమర్శ అనేది ఒక రస విద్య. దానికి రస హృదయం కావాలి. సహృదయత కావాలి. తుమ్మెద అన్ని పూల మీద వాలి, మకరంద పానం చేసినట్టుగానే, విమర్శకుడు కూడా అన్ని భావజాలాలకు చెందిన కవులను అధ్యయనం చేయాలి. పూల రంగులతో సంబంధం లేకుండా, తేనెటీగ మకరందం ఆస్వాదించినట్టు, విమర్శకుడు కూడా అన్ని భావజాలాలకు సంబంధించిన కవితా మాధుర్యాన్ని పాఠకుల చెంతకు తీసుకువెళ్లాలి. విమర్శకుడు లేకుంటే పాఠకుడికి కవిత్వంలో విపరీతార్థాలు, అపార్థాలు స్పురించవచ్చు. ఒక్కోసారి కవిత్వానికి అతి వ్యాప్తి దోషం ఆపాదించబడవచ్చు. విమర్శ చేయడం అనేది ఒక అసి ధారా వ్రతం. విమర్శ చేసేటప్పుడు విమర్శకుడు కవి లోకి పరకాయ ప్రవేశం చేయాలి. కవి కవిత్వం రాసిన సమయంలో ఉన్న ecosystem తన చుట్టూ సృష్టించుకోవాలి. కవి కాలమాన పరిస్థితులను అవగాహన చేసుకోకుండా విమర్శ చేయౠనడం నెల విడిచి సాము చేయడం లాంటిదే. విమర్శ రాసేటప్పుడు, ఇవన్నీ తూచా తప్పకుండా పాటించారు తూముచెర్ల రాజారామ్ గారు.

విమర్శకుడి కి కావలసినది ముందుగా సహృదయత. ఇక్కడ ఆ సహృదయత కలిగిన రాజారామ్ గారు పరామర్శకై 27 మంది కవులను ఎన్నుకొన్నారు. ఈ పుస్తకం నిర్వహించిన కార్యాన్ని విమర్శ అనకుండా పరామర్శ అనడంలోనే రాజారామ్ గారి సహృదయత ద్యోతకం అవుతుంది. ఈ పుస్తకం ముందు మాటలో వాసు గారు ఏమన్నారంటే రాజారామ్ గారు 27 మంది కవుల కవిత్వాన్ని పాఠకులకు అద్దం లో చందమామ లా చూపించారని అన్నారు. ఆ మాట ప్రత్యక్షర సత్యం. రాజారామ్ గారి ప్రతి పరామర్శ ఆ కవుల కవితాంతరంగానికి sign board లాగా పనిచేసి పాఠకుడికి కవితాత్మను దగ్గర చేయడానికి దోహదం చేసింది. ప్రతి పరామర్శ ఒక ప్రేమలేఖ లాగుంది. ఈయన తన పరామర్శకు యువ కవులనే ఎక్కువగా ఎన్నుకొన్నారు.

పరామర్శ కు ఆయన తీసుకున్న ఎత్తుగడే విచిత్రంగా ఉంది. మొదటగా ఆయన అరుణ్ సాగర్ రాసిన మ్యూజిక్ డైస్ లోని మరణ వాంగ్మూలం అనే కవితను ప్రస్తావించారు. మరణం తో పరామర్శకు ఎత్తుగడ వేయడం అమంగళం కాదా??? మరి దానిని మొదటే ఎందుకు పరామర్శించినట్టు అంటే మరణం లోనే  కవిత్వానికి కావలసిన తాత్వికత నిండి నిబిడీకృతమై కనిపిస్తుంది. ఈ మరణ వాంగ్మూలం పోలవరం ప్రాజెక్టు వలన నిర్వాసితులుగా మారిపోతున్న ఆదివాసులది. తాడిత, పీడిత వర్గాల వైపు వకాల్తా పుచ్చుకోవడమే కవి ఎజెండా కావాలి. అందుకే అరుణ్ సాగర్ రాసిన మరణ వాంగ్మూలం తో పరామర్శ మొదలెట్టారు రాజారామ్. గోదావరి ప్రవాహ సవ్వడిని అమ్మ గొంతు తో పోల్చడమే కవి చేసిన చమత్కారం. కవిత్వం లో ధ్వని ప్రవేశించి అది దృశ్యంగా రూపుకట్టడం ఇక్కడ జరిగింది. నదిలో అమ్మతనాన్ని చూసుకోవడం ఆదివాసీలకు మాత్రమే సాధ్యం. అలాగే అమ్మ లాంటి నది అలలలో నాన్న ముఖం కనిపించింది అనడం వలన పాఠకులు ఆదివాసీలు నదితో, నది నడకతో, నది లయతో ఎలా మమేకం అయిపోయారో పోల్చుకునేలా చేశారు కవి. ఆదివాసి సీదిరి సెంద్రయ్య ఇక రాడని తెలిస్తే గోదారమ్మ ఎంత ఏడుస్తుందో అనడం లోనే ఉంది కవిత్వ తీవ్రత అంతా కూడా. పాయం బొజ్జి గాడిని చివరి కోయగా  వర్ణిస్తూ మానవ పరిణామ చరిత్రలో ఒక ఆంత్రోపాయిడ్ దశ అయిన రామా పితికస్ లా అతను మిగిలిపోతాడేమో అనే ఆవేదనకు కవిత్వం ద్వారా దృశ్య రూపాన్ని ఇచ్చిన అరుణ్ సాగర్ కవిత్వాన్నే ముందుగా పరామర్శించడంలోనే ఉంది రాజారామ్ గారి సమయజ్ఞత అంతా. అరుణ్ సాగర్ గారు నదిని అమ్మ లాగా personification చేసిన తీరు అద్భుతం. ఈ మ్యూజిక్ డైస్ మీద రాజారామ్ గారు రాసిన పరామర్శ చదువుతుంటే కోట్ల క్యూసెక్కుల నిర్వాసితుల కన్నీళ్ళలో పాఠకులు తడవడం తథ్యం. ఈ అరుణ్ సాగర్ కవిత ఘంటా చక్రపాణి గారు చెప్పినట్టు ఒక నిర్వాసిత నిర్వేదమే.

మలి పరామర్శకు అరుణ నారద భట్ల గారి “ఇన్నాళ్ల మౌనం” ఎన్నుకున్నారు. ఇంటి ముందు కూచుని అదే పనిగా కూసే కోకిలకు జీవితం అంటే ఇంతే అని ముందే తెలుసేమో అనడంలోనే ఉంది టెక్నిక్ అంతా. ఈ కోకిల కూత లోనే అంతర్లీనంగా దళారీ వ్యవస్థకు బలై పైరునొదిలేసి దూరంగా వెళ్లిపోతున్న రైతు వ్యధ ధ్వనిస్తుంది. తెగిన నూలుపోగు లాగా గాలికి ఊగుతూ రైతు వెళ్లిపోతున్న దృశ్యం అరుణగారు ఆవిష్కరించిన తీరు అనితరసాధ్యం అని రాజారామ్ గారి పరామర్శ చదివితేనే తెలుస్తుంది. జరగాల్సినవన్నీ అసహజంగా, విలోమంగా జరుగుతున్నాయని అని వాపోతున్న అరుణగారి ధ్వనిని ఈ విమర్శలో చక్కగా ప్రతిధ్వనింపజేశారు. అందుకేనేమో కవిత్వం  ధ్వనైతే, విమర్శ ప్రతి ధ్వని అన్నారు పెద్దలు. ఈ ఇన్నాళ్ల మౌనం మీద రాజారామ్ గారి పరామర్శ చదువుతుంటే మన లోపలి నిశ్శబ్దాన్ని ఎవరో కదిపినట్టవుతుంది.

బొల్లోజు బాబా గారి ‘వెలుతురు తెర’ మీద చేసిన పరామర్శ నాకు చాలా నచ్చింది. బొల్లోజు గారు జువాలజీ లెక్చరర్ కావడం వలన నాకు చిరపరిచితులు. జ్ఞాపకాల శకలాల్ని నెమలీకలాంటి కవిత్వం చేయగల కళ ఒక బొల్లోజు బాబా గారిలోనే ఉంది అంటారు రాజారామ్ గారు. తన కాలేజీ లో తన క్లాస్మెట్ ఒక చక్కని సాయంత్రం బాచీ మఠం వేసుకుని పాడిన పాటను తన కవిత్వం లోకి వొంపేశారు బాబా గారు. ఆ జ్ఞాపకం ఒక మట్టిని మోసుకుని తిరిగే కందిరీగలా తన చుట్టూ పరిభ్రమిస్తుంది అని అనడం ఒక బొల్లోజు గారికే చెల్లు. క్లాస్మెట్ పాడిన పాట జ్ఞాపకాన్ని కందిరీగ చేసి, ఆ గాత్ర మాధుర్యాన్ని కందిరీగ ఝుంకారంగా మార్చడం కవిత్వం లోని డైనమిక్స్ ను ఒక స్థాయిలోకి తీసుకువెళ్ళి నిలుపుతాయి. బాబా గారు తన కవిత్వంలో సంగీతం మూడ్ కి దృశ్యరూపం కల్పించడంలో పూర్తిగా కృత్యకృత్యులు అయ్యారని రాజారామ్ గారి పరామర్శ తెలుపుతుంది. అన్ని కలయికలు ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో తన క్లాస్మెట్ గా ఒకప్పుడు ఉన్న అమ్మాయిని కలిసిన తరువాత “మేము కలుసుకోకుండా ఉంటే ఎంత బాగుణ్ణు అనిపిస్తోంది ఈ మధ్య పదే పదే” అనడం లో ఆ అమ్మాయిలో కాలం తీసుకువచ్చిన మార్పుల పట్ల కవికి ఉన్న నిరసన ధ్వనిస్తుంది. వెలుతురును వెతుక్కుంటూ వెళ్ళిన యువకుడు చెద పురుగులకు బలయ్యాడు అని 'చరిత్ర కవిత' లో బొల్లోజు చెప్పిన తీరు వెలుతురును స్వప్నించిన ఒక సాహసికుడి విగ్రహాన్ని మన ముందు ప్రతిష్టిస్తుంది. వైద్య పరిశోధనలో స్త్రీ దేహం ఎప్పుడూ ఒక గినియా పందేనని బొల్లోజు చెప్పిన తీరు మనల్ని ఆలోచింపజేస్తుంది. హిస్టీరెక్టమి గురించి చెపుతూ, కారణాలేవైనా కానీ నెలకో రక్త పుష్పాన్ని రాల్చే ఒక వృక్షాన్ని సమూలంగా పెకలించడమే అంటారు తన కవితలో బాబా గారు. గర్భ కోశాన్ని ఒక ఆలయంగా చూడడం మనకు అనాదిగా తెలుసు. కానీ దానిని ఒక వృక్షంగా చూడడం అనేది ఒక విభిన్నమైన దృశ్య రూపాన్ని మన ముందు నిలబెడుతుంది. స్త్రీకి మాత్రమే పరిమితమైన creativity కి ఇది ప్రతీకగా నిలుస్తుంది. 

ఇక ఆర్తనాద తంత్రులను మీటి తన అవ్యక్త దుఃఖాన్ని పలికించిన వెంకట రమణ గారి కవిత్వాన్ని పరామర్శిస్తూ కలలు కనలేని వారు కవిత్వం రాయలేరు అంటారు రాజారామ్. చమురు బావుల కోసం పెల్లుబుకుతున్న అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని నిరసిస్తూ “నీ దంతా అసంబద్దమే” అని అమెరికా పట్ల తన ధిక్కార ధోరణిని, ఛీత్కార స్వరం తో వెంకటరమణ వినిపించారు. వైరా లో చదవాల్సిన వాళ్ళంతా వాషింగ్టన్ కు వలస పోతుంటే, అలా క్రౌంచ ద్వీపం వైపు డాలర్ల కోసం వెళుతున్న యువతను విమానం రెక్కల మీద దృశ్యమానం చేసిన తీరు ప్రపంచీకరణ డొల్ల తనాన్ని ఆవిష్కరించింది. పురుషాధిక్యతను నిలువెల్లా పులుముకున్న మగవాడిని ‘ మగ మద గజం’ అని కొత్తగా సంబోధించడం పురుషాహంకార వికృత ధోరణిని సూచిస్తుంది అంటారు రాజారామ్. ఇదే రమణ గారు అమ్మకు తన కవిత్వంలో చిత్తరువు కడుతూ “నిశ్చల సముద్రమంత సహన శీలి, నన్ను మంచి గంధపు చెట్టు చేసింది” అనడంలో అమ్మదనంలో ఉన్న మాధుర్యం రూపుకట్టింది.

ఇక మనం సత్య శ్రీనివాస్ గారి కవిత్వ పరామర్శకు వద్దాము. బావిని నేల కన్ను గా చిత్రీకరించడం ఈ కవికి మాత్రమే సాధ్యమయ్యే టెక్నిక్. అసలు ఆ ఊహే విన్నూతనం. అభయారణ్యాల పేరిట ఊరికి, అడవికి మధ్య సరిహద్దులు గీయడం, అడవితో మమేకమైపోయిన ఆదివాసీలపై ఆంక్షలు విధించడం మీద సత్య శ్రీనివాస్ కవిత్వం లో తన నిరసన గళాన్ని వినిపిస్తారు. Man-animal conflict ఈ కవితల్లో చక్కగా వర్ణించబడింది. నక్షత్రాన్ని అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు దాటే కప్ప అనడం లోనే కవితా చమత్కృతి అంతా ఇమిడి ఉంది. వాహనుషులు అనే కొత్త పద బంధాన్ని సృష్టించిన తీరు ఆ కవితాత్మ సౌందర్యాన్ని మరింత పెంచింది.

మోహన్ రుషి రాసిన స్క్వేర్ వన్ కవిత్వ సంపుటి పై పరామర్శ లో తాత్వికత , మన మీద పడుతున్న కొండ చరియ లాగా స్పష్టంగా కనిపిస్తుంది. జీవితం అనేది ఎక్కడ మొదలయ్యిందో అక్కడే ముగియడాన్ని కవి దృశ్యమానం చేసిన తీరు ఒళ్లు జలదరింప జేస్తుంది. ఎవరి యాత్ర అయినా నలుగురు భుజాల మీద అంతమవ్వాల్సిందే అని మృత్యువును కవిత్వీకరించిన వైనం జీవితపు డొల్లతనాన్ని నగ్నంగా పాఠకుడి ముందు నిలబెడుతుంది. అందుకేనేమో రుషి కవిత్వం లో మృత్యు శీతల స్పర్శ ఉంది అంటారు రాజారామ్ గారు తన పరామర్శలో. మృత్యు భయాన్ని వదిలేసి day tight compartments లో బతకడం మంచిది అని కవిత్వంలో సిద్దాంతీకరించారు రుషి. “లేని దాన్ని వదిలేసి, ఉన్నదేదో అనుభవించరాదా అనే తత్కాల సిద్దాంతాలు కన్ను గీటి కవ్విస్తూ ఉంటాయి “ అనడం ఆ విషయాన్నే సూచిస్తుంది. ఈ జీవిత వాస్తవాన్ని, మరణం యొక్క అనివార్యతను చెప్పడానికి ఒక ఇమేజ్ ను సృష్టించి, మన ముందు నిలబెడతాడు రుషి. మనిషి అస్తిత్వ వేదనను జనన మరణాలనే రెండు గోల్ పోస్ట్ ల మధ్య బంతి తో పోలుస్తారు కవి. బతకడానికి నానా చావులు చస్తున్న వాళ్లం అనడం లో చావు తెగింపు తొంగి చూస్తుంది. నిత్యం మన జీవితాల్లో వచ్చే చావుకు భయపడే అవసరం లేదు కదా మరి!!! పుత్ర శోకాన్ని అనుభవించే తల్లి ఆవేదన చెపుతూ ఆరని మంటల ఆలింగనం అంటారు కవి. పుత్ర శోకం నిరంతరం అనే సత్యాన్ని ఇది సూచిస్తుంది. ప్రాణం అక్షరాల బొంగులే, బతుకు చిల్లర కన్నా అన్యాయం అయిపోయింది అని చెప్పడంలో మరణానంతర కర్మ కాండలో ఎంత తాత్వికత ఉందో తెలిసి వస్తుంది. రాజారామ్ గారు చేసిన ఈ స్క్వేర్ వన్ కవితా పరామర్శ చదువుతున్నప్పుడు నేనైతే చచ్చి బతికాను. ‘చల్ అకేలా’ అన్నప్పుడు, ఏకాకీ చర!!!ఏకాకి చర!!!!! ఏకాకీ చరరే!!!!! అన్న సంస్కృత వాక్యం స్మృతి పథంలో మెదిలింది. బతికి ఉండగానే మృత్యువును అనుభవంలోకి తెచ్చుకున్నవాడికి మృత్యు భయం పోతుంది. జీవితంలో ఏదీ మన ఆధీనంలో ఉండదు అని చెపుతూ కవి “కప్పుకున్న దుప్పటే మన ఆధీనంలో ఉండదు” అన్నప్పుడు దీనిలో దైన్యం కంటే కూడా వాస్తవాన్ని అంగీకరించే ప్రాప్త కాలజ్ఞతనే ఎక్కువగా కనపడుతుంది. 

మహేందర్ కవిత్వం నిండా గాయపడ్డ జ్ఞాపకాలు పరుచుకుని గాయాలలా సలుపుతుంటాయి. పల్లె జీవితంలో కనుమరుగై పోతున్న అరుగును, బాల్యంలో ఎన్నో వస్తువులను దాచుకోవడానికి ఉపయోగపడ్డ దుగుడును కూడా కవితా వస్తువులుగా మలిచారు మహేందర్. మనిషి దేన్నైనా మార్కెట్ చేయగలడు అన్నప్పుడు ఒక నాస్టాల్జిక్ ఫీల్ మనల్ని అలా పలకరించి వెళ్లిపోతుంది .

తెలంగాణ జెండానే తన అజెండాగా మార్చుకున్న కవి బూర్ల వెంకటేశ్వరులు కవిత్వాన్ని పరామర్శించినప్పుడు కవిత్వోపాసకుడు పగటి నొసట సూర్యుడు, రాత్రి నొసట చంద్రుడు కాగలడు అని ఎలుగెత్తి చాటిన తీరును ప్రస్తావిస్తారు రాజారామ్. “మార్కెట్ అంతా అంబానీల గోల, సెజ్ ల వల, చిన్న చేపల విల విల” అనే కవితా వాక్యాలు ప్రపంచీకరణ వికృత రూపాన్ని బహిర్గతం చేస్తాయి. రాజారామ్ గారు ఈ  బూర్ల వెంకటేశ్వరులను ‘దేహమంతా కవిత్వ దాహంతో పిడచకట్టిన కవి లా’ డిక్లేర్ చేస్తారు. ఈ కవి తపనంతా తోటి మనిషి కోసమే అని ముక్తాయించిన తీరు బాగుంది.

అలాగే తన పరామర్శలో భాగంగా “ద్వేషించడానికి కారణాలు వెతుక్కోకు!!!! ప్రేమించడానికి హృదయాన్ని సిద్దం చేసుకో” అన్న పెద్దన్న కవిత్వాన్ని పెద్ద మనసుతో తలుచుకుంటారు రాజారామ్. కొడుకు జీవ నదిలా ప్రవహించినప్పుడు, అమ్మ ఎంతగా పరిమళిస్తుంది అనే విషయం ఎంతో చక్కగా చెప్పారు పెద్దన్న. ఒక స్త్రీ “కొట్టినా, తిట్టినా, హింసించినా రాని బంధువులు మరణానంతరం తన పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చారని” వాపోయిన కవిత నిండా కరుణ రసం చిప్పిలుతుంది. “ఆడుకోనివ్వండి , ఆ ఆటల్లోనే పాటలు నేర్చుకుంటాం!!!! పాడుకోనివ్వండి, ఆ పాటల్లోనే ప్రపంచాన్ని తెలుసుకుంటాం!!!” అనే బాల్యపు బాధామయ గీతం ఇప్పటి ఆల్ఫా తరం కోల్పోతున్న బాల్యం పట్ల కవికి ఉన్న concern ను  తెలియజేస్తుందని రాజారామ్ గారి అభిప్రాయం. “నాన్నా !!!నన్ను కాస్తా ప్రేమిస్తావా!!!” అని తాగి ఆగమాగం చేస్తున్న తండ్రిని కూతురు వేడుకుంటున్న సందర్భం కంట తడి పెట్టిస్తుంది. కరుణ రసం చిప్పిల్లే ఇలాంటి కవి సమయాలనే పరామర్శకు ఎంచుకున్న రాజారామ్ గారికి జోహార్..... జోహార్. 

పాయల మురళీ కృష్ణ “అస్తిత్వం వైపు” కవిత్వం పరామర్శ మొత్తం పర్యావరణ స్పృహ తో  నిండిపోయి కనిపిస్తుంది. పోలికల్ని సమర్థవంతంగా వాడుకునే ఒడుపు మురళీ కృష్ణ సొంతం అంటారు రాజారామ్. పాలిథీన్ సంచుల సమస్తాన్ని ఉండ చేసి విసిరేసినట్టుగా ఉంది పొగమంచు అంటారు పాయల మురళీ కృష్ణ. పొలాలన్నీ ఫ్యాక్టరీ పునాదులుగా మారుతుంటే యేరు మాత్రం అనాథలా, నేల తల్లి కారుస్తున్న కన్నీరులా మిగిలిపోయింది అని చెప్పడం ఎంత గొప్ప పోలిక.

“నీ లాగే ఒక్కడుండే వాడు” అన్న నంద కిశోర్ కవిత్వ పరామర్శ మానవ ధు:ఖాన్ని ఆత్మగా పరిచయం చేస్తుంది మనకు. రాఖీ అనే కవిత లో అక్క మీద ప్రేమను మనోహరంగా కవిత్వీకరిస్తాడు. ప్రతిబింబించడం నీ గుణం అయినప్పుడు, ఎవరో రాయి విసిరినారని కోపం ఎందుకు అనడం లో బోలెడంత వ్యవహార జ్ఞానం పోత పోసుకుని ఉంది.

దమ్మున్న కవిత్వం రాసిన దేశిరాజు కవిత “రాజ్యమా.. ఉలికిపడు’ ను చక్కగా ప్రస్తుతించారు రాజారామ్ గారు. ఎవరెవరు ఏమేం తినాలో, ఏమేమి కట్టాలో చెపుతున్న రాజ్యం మీద తన ధిక్కార స్వరాన్నివినిపించారు దేశిరాజు. దళిత, బహుజన, మైనారిటీ లందరూ ఒకే చూపుడు వేలుగా ఉండాలి అనడంలో అంబేద్కర్ శిల్పం పాఠకుడి ముందు రూపు కడుతుంది. పక్క మతం వాడిని ద్వేషించడమే దేశ భక్తి అయితే, అటువంటి దేశ భక్తి నాకొద్దు అంటారు నిరంజన్. మార్కెట్ విస్తరిస్తుంటే మనిషి అంతర్థానమై పోతున్నాడన్న నిరంజన్ గారి ఆవేదన ఆయన ప్రతి కవితలో కనిపిస్తుంది.  అనల పతాకాల్ని ఎగిరేసే కవిత్వాలే కాదు అలలలా తేలిపోయే కవిత్వాన్ని కూడా రాయమని నిరంజన్ గారిని చివరలో  అర్థించారు రాజారామ్ గారు. 

మెటాఫర్ మెరుపులని మితంగా వాడుకుంటూనే కవిత్వంలో దృశ్య చిత్రణ, వాతావరణ చిత్రణ చేయగలిగిన కవి రవీందర్ గారు. ప్రతి దశలో తెలిసిన, కలిసిన అందరూ “నీకేం తెలియదు!!!’ అంటూ ఉంటే జీవితం వేళ్ళ సందు నుంచి  చేజారి పోతుంటుంది అని  రవీందర్ అనడం లో తాత్వికతతో పాటు ఒక శిశువులో ఉండే అమాయకత్వం కనిపిస్తుంది.

ఏది ఏమైనప్పటికీ మనకు రాజారామ్ గారు సహృదయతతో 27 మంది కవుల కవితా సంపుటాలను పరామర్శ పేరుతో అందజేసారు. చదివి ఆనందిద్దాము. 

అతి వ్యాప్తి దోషం వస్తుందనే భయంతో ఇంతటితో విరమిస్తున్నాను.

స్వస్తి


G L N Prasad, 

Lecturer in Zoology 

Comments

  1. మిత్రమా GLN మీరు కవిగా, రచయితగా, మంచి వక్త గా అద్భుతమైన ప్రతిభ ను ప్రదర్శించారు. అందుకు నేను మీ విసనకర్ర ను. మరి విమర్శకుడిగా మీ కొత్తకోణం అద్భుతం అనన్య సామాన్యం.
    సుతిమెత్తని పదాలతో పలకరిస్తూనే, తెలియని రీతిలో విమర్శకుడిగా కూడా తగిన పాత్ర పోషించారు. సమీక్షించారు. ఇప్పుడు నేను మీకు పెద్ద AC నయ్యాను

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు మిత్రమా

      Delete

Post a Comment

Popular posts from this blog