సంచారి 


ఇక వేసవి సెలవులు ముగిసిపోతూ ఉన్నాయి. ఈ వేసవి సెలవులకు ఇదే చివరి ఆదివారం. కొన్ని కారణాల వల్ల ఈ వేసవి సెలవులలో ఎక్కడా తిరిగిందే లేదు. తిరగలేక పోయాను అని బాధ పడుతుండగానే, అమెజాన్ ద్వారా "సంచారి" మా ఇంటికి వచ్చాడు. అదేనండీ పెద్దింటి అశోక్ కుమార్ రచించిన "సంచారి" నవల మా ఇంటికి చేరింది. సాయంత్రం నుంచి చదవడం మొదలెడదాము అనుకున్నాను. నిత్య సంచారి అయిన అతిథిని సంధ్య వేళ వరకు వేచి ఉండేలా చేయడం ధర్మం కాదనిపించి అనుష్టానం అయిన వెంటనే చదవడానికి ఉపక్రమించాను. 
మనది కాని జీవితం మనకు ఆసక్తిని కలుగజేస్తుంది. చిన్నప్పటి నుంచి నాకు సంచారాలు ఇష్టం. కానీ ఇష్టమైనవన్నీ నెరవేరవు. ఆశలు నెరవేరవు. ఆశయాలు మాత్రమే నెరవేరుతాయి. నా సంచార వ్యామోహం అనేక కారణాల వలన ఆశయంగా బలం పుంజుకోలేక పోయింది. నాలో అంతర్గతంగా ఉన్న చాలా భయాలు కూడా నన్ను ఇల్లు విడిచి చాలా దూరం ప్రయాణించకుండా ఆపాయి. ఈ సంచార జీవితం పట్ల నాకున్న మక్కువ మూలంగానే ట్రావెలాగులు ఎక్కువగా చదువుతుంటాను. ఈ పుస్తకం కూడా ఆ వ్యామోహం వల్లనే తెప్పించుకున్నాను. ఈ సంచారి లో నవలా నాయకుడు రాజలింగం. సంచార జీవితంలో ఉన్న అభద్రతను చూసిన తరువాత ఒక ఊర్లో స్థిరపడాలి అనే నిర్ణయానికి వస్తాడు. అలా స్థిరపడిన తరువాత జరిగిన సంఘటనల వల్ల ఏర్పడిన సంఘర్షణనే ఈ నవల యొక్క వస్తువు. 
నా బాల్యం లో ఇంటి వద్దకు గంగిరెద్దు ను ఆడించే వాళ్లు వచ్చేవారు. ఆ వృషభం ఏవో విన్యాసాలు చేసేది. దాని అలంకరణ చాలా ముచ్చట గొలిపేది. ఈ గంగిరెద్దును ఆడించే శాల్తీ సన్నాయి ( మా వైపు మేళం అంటారు లెండి) వాయిస్తూ ఉంటే, తదనుగుణంగా ఆ ఎద్దు ఏవో సర్కస్ ఫీట్స్ చేసేది. అవన్నీ చూసిన తరువాత నేను అ గంగిరెద్దు ఆడించిన వ్యక్తి  కక్షపాల (జోలె) లో ఒక పావు బియ్యం గింజలు వేసేవాడిని. ఒక్కోసారి అమ్మ ఇచ్చిన పాత చీరలు, ధోవతీలు కూడా ఇచ్చేవాడిని. సంక్రాంతి పండుగ సమయంలో మాత్రమే ఈ గంగిరెద్దు వాళ్లు ఎక్కువగా వచ్చేవాళ్లు. ఇవన్నీ 1971 దశకం నాటి ముచ్చట్లు. అప్పటి రోజులు వేరు. ఇలాగే కాశీ పట్నం చూడర బాబు, చూడర బాబు అంటూ కొద్ది మంది వచ్చేవారు. వారి చేతిలో పది పైసలు పెడితే, వాడు తెచ్చిన పెద్ద  డబ్బాలోకి తొంగిచూడడానికి అనుమతించేవాడు. ఆ డబ్బాలో కొన్ని నరక లోకపు చిత్రాలు ఉంటాయి. వాటిని తిప్పుతూ పాట కూడా పాడే వాడు. నరక లోకంలో ఏ ఏ శిక్షలు ఉంటాయో దానిలో ఉండేవి. అవి చూసినప్పుడు, మా లెక్కలయ్య వారుకు ఏ శిక్ష పడుతుందో కదా వీటిలో అనుకుని థ్రిల్ ఫీల్ అయ్యేవాడిని. ఏం  చేద్దాం మరి !!!! ఆయన నాకు క్లాస్ రూమ్ లో నరకం చూపించేవాడు. ఎలుగొ డ్లను తీసుకుని కూడా వచ్చేవారు. అది చాలా అలజడిగా ఉండేది. గొరవయ్యలు వచ్చేవారు. వాళ్లు జోస్యం కూడా చెప్పేవారు. సోది చెప్పేవాళ్ళు వచ్చేవారు. ఇవి కాక దొమ్మరి వాళ్లు ( దిమ్మెర పదం నుంచి దొమ్మర పదం వచ్చిందని తరువాత తెలిసింది) వచ్చి ఏవో ఆటలు ఆడే వారు. అన్నిటి కంటే ముఖ్యంగా కదిరిలో నేను ఉన్నప్పుడు కనికట్టు చేసే వాళ్లు వచ్చేవారు. ఆ మాయలు, మంత్రాలు భలే ఉండేవి. విఠలాచార్య సినిమా లాగా ఉండేవి ఆ మోళీ ఆటలు. వీళ్ళంతా సంచారులే. నా బాల్యం లో కనిపించిన వీరంతా ఎలా మాయమయ్యారు? ఇవి కాక మందులు, యంత్రాలు, పసర్లు ఇచ్చేవారు కూడా ఊర్లకి అప్పుడప్పుడు వచ్చేవారు. ఈ వృత్తుల వాళ్లు వారి వారి కుల వృత్తులను అనేక కారణాల వలన మానివేయడంతో , మరియు ఇతర ఉపాధులను ఎంచుకోవడంతో సంచార జీవితాన్ని వదిలేసుకున్నారు. సంచార జాతుల వారి కొన్ని విద్యలు కూడా అంతరించాయని తెలుస్తోంది. ఒకప్పుడు మన దేశంలో రోప్ ట్రిక్ అనే మ్యాజిక్ ఉండేదట. అది అంతరించి పోయింది. ఇలాంటి వన్నీ నా బాల్యం లో చూడడం వలన నాకు సంచార జీవితం పట్ల ఆసక్తి పెరిగింది. 
అందుకే ఈ "సంచారి" పుస్తకం ఎక్కడా ఆపకుండా చదివేసాను. రాజలింగం పాత్ర చెప్పే అనేక విషయాలు చదివిన తరువాత సంచార జీవితంలో ఉన్న ఇబ్బందులు నాకు తెలిసివచ్చాయి. బిచ్చం ఎత్తుకోవడానికి వెళ్లే ఊర్లను పంచుకోవడం, గంగిరెద్దు గా మారడానికి లేగ దూడకు గురువు ద్వారా శిక్షణ ఇప్పించడం, పూసలు అమ్మడం, చిన్నా చితకా వైద్యాలు నేర్చుకోవడం, సన్నాయి వాయించడం, ప్రాణాల మీదకు తెచ్చుకునే విన్యాసాలు చేయడం లాంటివి అన్నీ సంచారి జీవితంలో అంతర్భాగాలే. ఇంత నిజాయితీగా బతికినా కూడా అప్పుడప్పుడు చేయని దొంగతనాల నిందలు వీరి మీద పడుతుంటాయి. రాజలింగం ఇవన్నీ భరిస్తూనే అప్పుడప్పుడు బతుకుతెరువు కోసం ఇస్తారి తో కలిసి సారా కాచేవాడు. అప్పుడు బండ్ల రెడ్ల తో తను కూడా ఊరి మధ్యలో ఇల్లు కడతానని, పది మందికి భోజనం పెట్టే స్థాయికి చేరుకుంటానని సవాల్ విసురుతాడు. కొడుకు చెడిపోతున్నాడని భావించి, తను దూరంగా ఉంటే తన విలువ తెలిసి వస్తుందని భావించి దుబాయి కి వెళతాడు. 
రెండో సారి దుబాయి కి వెళ్లి తిరిగి వచ్చిన తరువాత తన ఇంటి పరిస్థితులను చూసి కలవరపడతాడు రాజలింగం. తనను సారా వ్యాపారంలో మోసం చేసిన ఇస్తారి తన ఇంటిని కొనేసాడని తెలుసుకుని నిర్వేదానికి గురవుతాడు. తన గొర్రెల మంద కనిపించదు. కొడుకు తాగుడుకు అలవాటు పడి ఉండడం మరింత కలిచివేస్తుంది. దుబాయి లో జైలు జీవితాన్ని గడిపి వచ్చిన రాజలింగంను ఈ పరిస్థితులన్నీ కలవరపాటును కలిగిస్తాయి. తన భార్య కమల మరియు నాగులు చెపుతూ ఉండే కులమే బలం అనే మాట నిజమేనేమో అనే ఆలోచనలో పడతాడు. వృత్తి ధర్మం వదిలి తప్పు చేశానేమో అనే సంఘర్షణకు గురి అవుతాడు. ఇంట్లో అన్నీ విలోమంగా జరుగుతుంటాయి. భార్య కమల మళ్లీ సంచార జీవితం చేపడదాము అంటుంది. తన కూతరు యశోద పుట్టింటికి ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఆ విషయం తెలిసిన తరువాత కూతరు కాపురం ఎలా చక్క దిద్దుతాడో అనేది కథలో ఆసక్తి కలిగించే అంశం. పెళ్ళైన ఆడ కూతురు పుట్టింట్లో ఉండడం అరిష్టం అని రాజలింగం భావన. అనుపురం వెళ్లి, తన కూతురు కాపురం చక్క దిద్దే సమయం లో రాజలింగం ప్రదర్శించిన జీవననైపుణ్యాలు అనితరసాధ్యం. రాజలింగం కు ఉన్న సాఫ్ట్ స్కిల్స్ ఈ నవల చదివితేనే మనకు అనుభవం లోకి వస్తాయి. ఎదుటి వ్యక్తిని ఎలా సంభాషణ లోకి దింపి సమాధానాలు రాబట్టాలి అనేది రాజలింగంను చూసి నేర్చుకోవాలి ఎవరైనా. తన మాట వినకుంటే మంత్రాల వరకు వెళ్లగలను అంటూ తన వియ్యపు వారితో రాజలింగం మంత్రాంగం నడిపిన తీరు పాఠకులను అబ్బురపరుస్తుంది. ఈ చాతుర్యం అంతా తన సంచార జీవితం గడిపేటప్పుడు కుల పంచాది ( పంచాయితీ) చేయడం వలన వచ్చింది అతనికి. 
పెళ్లికి ముందే అత్త గారింటికి ఉడుపుకు వెళతాడు. ఇలాంటి ఆచారం ఒకటి ఉందని నాకు ఈ పుస్తకం చదివేంత వరకు తెలియదు. Anthropology ఐచ్చికంగా  సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులందరూ ఈ నవల చదవండి. సంచార జీవితానికి కావలసిన బోలెడంత సమాచారం తెలుస్తుంది. ఈ ఉడుపు కోసం పోయిన సమయంలో గంగిరెద్దు తో అత్త కు నడ్డి మీద తన్నించడం, అత్త మీద మామ పడేలా చేయడం, బావ తన జేబులో తేళ్ళు వేస్తే అవి కుట్టినట్టు నటించడం లాంటి సన్నివేశాలు హాస్యాన్ని పండిస్తాయి. డబ్బు, మాట పనులను ఎలా నెరవేరుస్తాయో రాజలింగంకు బాగా తెలుసు. ఈ రెండూ పని చేయని చోట, రూపం, ఆకారం ( body language ) ద్వారా పనులు సాధించుకోవచ్చని కూడా తెలుసు రాజలింగంకు. 
కథలో భాగంగా తన గతాన్ని తలుచుకునేటప్పుడు తన సంచార జీవితం ఎలా సాగిందో మనకు తెలియజేస్తాడు రాజలింగం. తల్లి పాము కొరికి చనిపోవడం, మోళీలో భాగంగా గంగిరెద్దు ను తండ్రి మోసేటప్పుడు వ్యవసాయ బావిలో పేలిన తూటా శబ్దానికి అది బెదరడంతో తండ్రి బాలం ఛాతీ విరిగి రక్తం కక్కుకుంటూ మరణించడం లాంటి సంఘటనలు రాజలింగం కు సంచార జీవితం మీద విరక్తిని కలుగజేస్తాయి. ఇవన్నీ చూసి విసుగెత్తి అన్నం రెడ్ల పంచ జేరి, తరువాత దుబాయ్ కి వెళ్లి తిరిగివస్తే ,తన కుటుంబం పరిస్థితి తిరిగి మొదటికి వచ్చి ఉండడం ఒక anti climax. మరి ఈ పరిస్థితులతో రాజలింగం రాజీ పడ్డాడా అనేది పాఠకులు చదివి తెలుసుకోవాలి మరి. 
ఒక్కోచోట ఒక్కో అవతారం ఎత్తడంలో రాజలింగం సిద్దహస్తుడు. కానీ ఈ అవతారాలన్నీ కుటుంబం మేలు కోసమే. యశోదా కు బొంబాయి లో తను జోపుడాలో  ఉన్నప్పుడు చెక్క శీను చేసిన చారు, ట్యూబుల్లో నింపిన సారా తో ఎలా కలిసిపోయిందో చెప్పే సంఘటనలో హాస్యాన్ని ఎంతో బాగా పండిస్తాడు రాజలింగం. "తప్పయినా, ఒప్పయినా మాట గట్టిగా ఉండాలే. అప్పుడే జనం నమ్ముతారు" అని రాజలింగం కూతురితో అన్న మాటల్లో ఎన్నో జీవన సూత్రాలు దాగున్నాయి. డ్రెస్ కోడ్ గురించి కూడా రాజలింగంకు బాగా తెలుసు. బేరానికి వెళ్లినప్పుడు నల్ల బట్టల్లో పోతే ఒక రకంగా, తెల్ల బట్టలతో పోతే మరో రకంగా షాప్ ఓనర్లు స్పందిస్తారని రాజలింగంకు తెలుసు. కల్లు తాగినప్పుడు కూడా తన body language మీద రాజలింగం పట్టు కోల్పోడు. ఇవన్నీ వయోపరిపాకం వలన, అనుభవం వలన వచ్చిన నైపుణ్యాలు. 
కొడుకు కాపురం చక్కదిద్దడానికి వెళ్లినప్పుడు తార తండ్రి తో రాజలింగం మాట్లాడిన తీరు కృష్ణ రాయబారానికి ఏమీ తీసిపోదు. మూలికా వైద్యం లో కూడా సిద్దహస్తుడు రాజలింగం. మేక మేయని ఆకు గురించి ఎన్ని రహస్యాలు విప్పుతాడో కథలో. పొడపత్రి ఆకు పొడిని సాంబయ్య సేటు భార్యకు తినిపించే సన్నివేశం చదివితే ఎవరైనా విరగబడి నవ్వాల్సిందే!!!!!. అసలు జానపదులలో ఉండే విజ్ఞత, చతురత నాగరికులలో ఉండవని ఈ కథ చదివితే తెలుస్తుంది. 
డిగ్రీ విద్యార్థులు ఈ నవల చదివితే, ఒక ఇంటర్న్షిప్ కు సరితూగే అనుభవాన్ని మూట గట్టుకుంటారు. ఈ నవల లోని సమాచారం ఒక కమ్యూనిటి సర్విస్ ప్రాజెక్టు కు ఏ మాత్రం తీసిపోదు. కులాల గురించిన సమాచారం బోలెడంత ఉంది దీనిలో. కుల వృత్తులు ఒకప్పుడు సమాజంలో నిరుద్యోగమే లేకుండా ఎలా చేసాయో కూడా తెలుస్తుంది. అదే విధంగా ప్రపంచీకరణ తెచ్చిన మార్పులు కొన్ని కుల వృత్తులను ఎలా మింగేసాయో కూడా ఈ కథ చదివితే తెలుస్తుంది. చరవాణి ని చూస్తే రాజలింగంకు మంట. కుటుంబంలో సహజంగా జరగాల్సినవి అన్నీ విలోమంగా జరగడానికి కారణం సెల్ ఫోనేనని రాజలింగం కు తెలుసు. 
ఇస్తారిని దారికి తెచ్చుకోవాలనుకున్నప్పుడు యుద్దం లో గెలుపు ముఖ్యం కానీ ఎలా అన్నది కాదు అనే వ్యూహం అనుసరిస్తాడు. శత్రువును శత్రుత్వంతో కంటే మిత్రత్వం దెబ్బ తీయవచ్చన్నది రాజలింగంకు బాగా తెలుసు. విషముష్టి లాంటి వనమూలికల పని తీరు పట్ల అవగాహన ఉన్నవాడు ఇతను. శత్రువు మాటకు లొంగకుంటే, మందుకో, మాకుకో లొంగితీరతాడు అని తెలుసు అతనికి. 
అన్నిటికంటే మించి మానవ సంబంధాల పట్ల రాజలింగానికి తాత్విక దృక్పథం ఉంది. కుల వృత్తిని వదిలేసినా కూడా కులం బలం పట్ల గౌరవం ఉన్నవాడు. ఛాందస వాదాన్ని నిరసించినా కూడా, సాంప్రదాయం పట్ల గౌరవాన్ని పోగొట్టుకోలేదు అతను. అసలు ఈ రాజలింగం పాత్రను రచయిత మలచిన తీరే అమోఘం. ప్రతి ఇంట్లో, ప్రతి కులంలో, ప్రతి గ్రామంలో రాజలింగం లాంటి వారు ఉండితీరాల్సిందే. మరి ఇంత అరుదైన జీవన నైపుణ్యాలు కలిగిన రాజలింగం చివర్లో తన కూతురు, కొడుకు సంసారాలను చక్కదిద్దుతాడా అనేది పాఠకులు చదివి తెలుసుకోవాలి. 
ఈ కథలో, కథనంలో ఎంత పట్టు ఉందంటే, రాత్రి OTT లో వెబ్ సిరీస్ కూడా చూడడం మానేసి, ఈ సంచారి నవలను ఒక్క పూటలో ముగించాను. మీరు కూడా తెప్పించుకుని మరీ చదవండి. 
మరో సంచారంలో కలుద్దాం. 
ఈసారి మిమ్మల్ని కలుసుకోవడానికి చాలా రోజులు పట్టొచ్చు. ఎల్లుండి నుంచి కాలేజీ ఉంది మరి. 
G L N Prasad
Lecturer in Zoology. 

Comments

Popular posts from this blog