భద్రా కళ్యాణం
కొన్ని రోజుల ముందు నన్ను రసాయన శాస్త్ర అధ్యాపకుడు రాజశేఖర్ రెడ్డి వారి ఊరు దిగువ చెర్లోపల్లి కి ఆహ్వానించాడు. దుర్గాష్టమి రోజు తమ ఊరి వద్ద ఉన్న E గంగిరెడ్డి పల్లి చెరువు కట్ట మీద ఉన్న ఆంజనేయ స్వామి గుడి లో ఆకుపూజ చేస్తున్నాము రండి అని చెప్పాడు. అలాగే అని ఒప్పుకున్నాను. ఎలాగూ సెలవులు కదా!!! ఆరోజు అనుకున్నట్టుగా నేను, మనోహర్ నాయక్, అహ్మద్ మరియు శ్యామూ కారులో కొత్త చెరువు వైపు బయలుదేరాము. ఉదయం 7 కు మనోహర్ కారులో బయలుదేరిన మేము, అల్పాహారం కోసం ధర్మవరం లో ఉన్న బృందావనం హోటల్ కు వెళ్లాము. అక్కడ ఇడ్లీ, వడ మరియు మసాలా దోసె తిన్నాము అందరం. చాలా సంవత్సరాల తరువాత మంచి మసాలా దోసె తిన్న ఫీల్ వచ్చింది నాకు. తరువాత అక్కడ నుంచి కొత్త చెరువు చేరి, అక్కడి నుంచి GPS సహాయంతో E గంగిరెడ్డి పల్లి చెరువు కట్ట మీద ఉన్న ఆంజనేయ స్వామి గుడికి చేరాము. అప్పటికే రాజశేఖర్ రెడ్డి, శిష్యుడు రాకేశ్ తో అక్కడ వేచి ఉన్నాడు.
ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రమాణాలకు ప్రసిద్ది అని తెలిసింది. చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి పరుచుకుని ఉంది. రాకేశ్ సహాయంతో గుడి వద్ద ఉన్న గుట్ట మీదకి కొద్దిగా ఎగబాకాము. ఆ గుట్ట మీద నుంచి గుడి పరిసరాలను వీడియో ఘాట్ చేసాను. గుడి పక్కన ఉన్న మర్రి చెట్టు మమ్మల్ని ఆత్మీయంగా ఆహ్వానించింది. ఆ మర్రి చెరువు గట్టున ఉంది. ఆ ప్రకృతి శోభ లో ఏదో పరవశత్వం ఉంది. లోపల ఆకుపూజకు అర్చకుడు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా నేను, మనోహర్ నాయక్ రెండు సార్లు విష్ణు సహస్ర నామ పారాయణం చేసేసాము. ఆంజనేయ స్వామికి ఆకుపూజలు మరియు వడమాలలు వేయడంలోని ఆంతర్యం ఏమై ఉంటుంది అని ఆలోచించాను. ఉత్తరాదిలో ఆంజనేయ స్వామికి జిలేబి మాల వేస్తారట!!!!!
పూజ అనంతరం రాజశేఖర్ ఇంటి నుంచి తెచ్చిన చక్కటి విందును ఆరగించాము. తరువాత తిరుగు ప్రయాణం లో గోపి దేవర పల్లి వద్ద తూటు రాయి ని చూడాలనే చిలిపి తలంపు మాకందరికీ వచ్చింది. మాకు గైడ్ గా ఉండడానికి రాకేశ్ ఒప్పేసుకుని కారెక్కేసాడు. ఒక అరగంట లో తూటు రాయి ప్రాంతాన్ని చేరుకున్నాము. ఆ ప్రాంతం అంతా తాంత్రిక తరంగాలతో నిండినట్టు అనిపించింది నాకు. ఈతి బాధలు, బాలారిష్టాలు ఉన్నవారు ఆదివారం అమావాస్య రోజు వస్తారట. మూడు సార్లు ఈ తూటు రాయి లో ఉన్న రంధ్రం ద్వారా అటు.. ఇటు దూరితే చాలట!!! ఆ బాధలు ఇట్టే మాయమైతాయట. అలా దూరిన వారు అక్కడే బట్టలు, చెప్పులు వదిలేసి వెళ్లడంతో అక్కడ అసంఖ్యాకంగా బట్టలు, చెప్పులు కనిపించాయి.
అక్కడి నుంచి బయలుదేరి పుట్టపర్తి చేరాము. నిలయంలోకి వెళ్లి షాపింగ్ చేయాలని, పిజ్జా తినాలని మా అందరి కోరిక. మూడు గంటలకు కానీ షాప్స్ తెరవరట. కాలక్షేపం కోసం బుక్ స్టాల్ వద్ద ఉన్న ఉద్యానవనం లో కూచున్నాము. నేను, మనోహర్ మాట్లాడుతూ కూచుంటే, అహ్మద్, శ్యామూ విశ్రాంతి తీసుకున్నారు. మూడు గంటలకు అన్ని షాప్స్ తెరిచారు. ముందుగా వెళ్లి కేకులు, పిజ్జాలు తెచ్చుకున్నాము. ఒక పిజ్జా మొత్తం నేనే తినేసాను. తరువాత శ్యాము dress కోసం మరో షాప్ లోకి వెళ్లాడు. అహ్మద్, మనోహర్ మరో చోటికి వెళ్లి మిర్చీ బజ్జీ లు తెస్తే , అవి కూడా తిన్నాను. మిర్చీ బజ్జీ రుచి నన్ను స్వర్గానికి ఒక మెట్టు క్రిందుగా వదిలేసింది. అవి ఆరగించిన తరువాత నేనూ, మనోహర్ బుక్ స్టాల్ లోకి వెళ్ళాము. చెరో మూడు పుస్తకాలు కొన్నాము. అదిగో అలా నేను కొన్న ఒక పుస్తకం ధూర్జటి సర్వమంగళ గారు రాసింది. ఆ పుస్తకం పేరు "నా స్వీయ అనుభవాలు.. దైవంతో.."మరుసటి రోజే ఆ పుస్తకం చదివేసాను. అదిగో ఆ పుస్తకం లోనే మొదటిసారి భద్రా కళ్యాణం గురించి తెలుసుకున్నాను. ఈరోజు వరకు నేను రుక్మిణీ కళ్యాణం గురించి విన్నాను. మొదటిసారి భద్రా కళ్యాణం గురించి ఈ పుస్తకం చదవడం ద్వారా తెలుసుకున్నాను. సత్యసాయి గారు సశరీరంగా సంచరించిన రోజుల్లో భక్తులతో భద్రా కళ్యాణం జరిపించేవారట. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి ఈ భద్రా కళ్యాణ పారాయణ వారి ఈప్సితాన్ని ఇట్టే తీర్చేదట. ఇంత విన్న తరువాత ఊరికే ఉండే రకం కాదు కదా నేను!!!!! గూగుల్ లో భద్రా కళ్యాణం కోసం వెదకడం మొదలెట్టాను. ఈ భద్రా కళ్యాణం రచించినది సత్య సాయి భక్తురాలైన Dr K V కృష్ణ కుమారి. పుస్తకం pdf ప్రతి లభించలేదు కానీ, Internet Archive లో ప్రొఫెసర్ విశ్వనాథం గారు పఠించిన ఆడియో క్లిప్ కనపడింది. ఆలస్యం ఎందుకని వినడం మొదలెట్టాను. సుమారు 3 గంటలు ఉన్న ఆడియో క్లిప్ ఇది. ఆసాంతం విని, అందులో ఉన్న కొన్ని అంశాలను ఇక్కడ ఉటంకిస్తున్నాను.
శ్రీ కృష్ణుడు షోడశ కళా పరిపూర్ణుడు. బృందావనం లో ఉన్న పూర్ణ పురుషుడు. భగవానుడుకి ఎనిమిది మంది భార్యలు. అందులో ఏడవ భార్య భద్ర. భద్ర సాక్షాత్తు లక్ష్మీ కళ. శ్రీ కృష్ణుడి మేనత్త శ్రుతకీర్తి కూతురే భద్రా దేవి. అంటే వసుదేవుడి చెల్లి కూతురు. భద్రా దేవి తండ్రి పేరు దృష్టకేతువు. తండ్రి తన వివాహం కోసం స్వయవరం ప్రకటించిన తరువాత, తనను చేపట్టడానికి ఆ స్వయంవరానికి రమ్మని శృతి రంజని ద్వారా రాయబారం పంపుతుంది భద్రా దేవి. శృతి రంజని ఏ విధంగా రాయబారం నెరపి కృష్ణుడిని, భద్రా దేవితో కలిపింది అనేది ఈ భద్రా కళ్యాణం సారాంశం. మనం ఇంత వరకు రాధా కృష్ణుల ప్రేమ గురించి విని ఉంటాము. అలాంటి ప్రేమ తత్వమే ఈ భద్రా కళ్యాణం కావ్యం నిండా పరుచుకుని కనపడుతుంది. కృష్ణ కుమారి గారి రచన ప్రబంధ శైలిని గుర్తుకు తెస్తుంది. విశ్వం గారి గొంతులో ధ్వనించే ఆర్తి శ్రోతలను ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడిస్తుంది.
పెళ్లి కావలసిన వారు దీనిని వింటే, చదివితే వివాహం నిశ్చయం అవుతుంది అని అంటారు. మరి ఆలస్యం ఎందుకు!!!! ఆలకించండి.
పద్మమ్మ గారు రాసిన 'త్వమేవ మాతా' అనే మరో పుస్తకం కొన్నాను. చదవడం మొదలెట్టాను. దాని గురించి వీలుని బట్టి తెలుసుకుందాము.
Comments
Post a Comment