నుడి - నానుడి సమీక్ష 

                             


మా కాలేజీ కి వెళ్లేటప్పుడు దానికి దగ్గరగా ఉన్న విశాలాంధ్ర లోకి తరచూ తొంగి చూస్తుంటాను. అలాగే ఒక రోజు తొంగి చూసిన నన్ను తిరుమల రామచంద్ర గారు రాసిన "నుడి- నానుడి" అనే పుస్తకం ఆకర్షించింది. ఇక ఏమీ ఆలోచించకుండా కొనేసాను. ఆయన రాసిన హంపీ నుంచి హరప్పా దాకా రెండు సార్లు చదివాను. నేను నిత్య పారాయణ గ్రంథాలు తప్ప ఏ పుస్తకం రెండు సార్లు చదివింది లేదు. కానీ హంపీ నుంచి హరప్పా దాక పుస్తకం లో ఉన్న శైలి ఆ పుస్తకం రెండో సారి చదివేలా ప్రేరేపించింది. అప్పుడే తెలిసింది తిరుమల రామచంద్ర గారు బహు భాషావేత్త అని. నేను డిగ్రీ చదివే రోజుల్లో ఆయన మా ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయన గొప్పతనం తెలియదు. తరువాత నేను సివిల్ సర్వీసెస్ కు సన్నద్ధం అవుతున్నప్పుడు తెలుగును ఒక ఐచ్చికంగా తీసుకోవడం వలన తెలుగు సాహిత్యానికి సంబంధించి చాలా పుస్తకాలే చదివాను. రచయిత తో ఈ మాత్రం పరిచయం ఉండడం వలన నేను ఈ నుడి- నానుడి పుస్తకం వెంటనే కొనేసాను. చదవడం మొదలెట్టాను. 

ప్రతి తెలుగు విద్యార్థి, ఆ మాటకు వస్తే అధ్యాపకుడు కూడా చదవాల్సిన పుస్తకం ఈ "నుడి- నానుడి". మనం నిత్యం వాడే పదాల పుట్టు, పూర్వోత్తరాలు తెలిస్తే, మనకు చరిత్ర తెలుస్తుంది. మొదట్లో అతి తక్కువ ధ్వనులతో, తరువాత పదాలతో మాట్లాడడం మొదలెట్టిన ఆది మానవుడు పరిణామ క్రమంలో అనేక కొత్త పదాలను కనిపెట్టి భాషను సుసంపన్నం చేసుకొన్నాడు. ఇక్కడ మాయా బజార్ సినిమాలోని ఘటోత్కచుని  " ఎవరూ కనిపెట్టకుంటే, పదాలు ఎలా పుడతాయి!!!! వెయ్యండ్రా వీర తాళ్లు" అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మనం తెలుగు భాషా పదాలుగా భావించే చాలా పదాలు అరువు పదాలే. ద్రావిడ భాష అయిన ఈ తెలుగులో సంస్కృతం మూలాలు ఉన్న తత్సమ, తద్భవ పదాలు చాలానే వచ్చి చేరిపోయాయి. ఈ పదాల సరిగమ పదనిసలు తెలిస్తే, చరిత్రను అవగాహన చేసుకునే తీరు మారుతుంది. ఈ రచయితకు ప్రాకృత భాష కూడా వచ్చి ఉండడం వలన చాలా శాస్త్రీయంగా పదాల కూపీ లాగ గలిగారు.  

మరో గమ్మత్తు ఏమంటే, చరిత్రను తెలుసుకోవడానికి గుళ్లూ , గోపురాలు, శాసనాలు, సాహిత్యం ఎంత ఉపయోగపడతాయో, వాడుకలో ఉన్న పదాలు, వాటి రూపాంతరాలు, వంటలూ , వార్పులూ కూడా అంతే ఉపయోగపడతాయని ఈ నుడి-నానుడి పుస్తకం చదివితే తెలుస్తుంది. వృత్తి మరియు కుల సంబంధ పదాలు తెలుసుకుంటే మానవ పరిణామ క్రమంలో వివిధ దశలు తెలుస్తాయి. ఎన్నో జాతుల వారు మన దేశానికి వచ్చినట్టే, మన దేశం నుంచి కూడా బయట ప్రాంతాలకు వలసలు జరిగాయి. తదనుగుణంగా భాషా పదాలు, సంస్కృతులు, పండుగలు, పబ్బాల లాంటి విషయాలలో కూడా ఆదాన, ప్రదానాలు జరిగిపోయాయి. సంకరం కానీ సంస్కృతే కనపడదు ప్రపంచం లో ఏ మూల వెదికినా. ఇప్పుడు మనవి అనుకుంటున్న సంస్కృతుల మూలాలు వేరే చోట కనిపించవచ్చు. అలానే మన తెలుగు భాష లో మనం వాడుతున్న పదాలు సంస్కృతం, ప్రాకృతం, అరబ్బీ, పార్సీ లాంటి భాషా పదాలు కూడా అయి ఉండవచ్చునని ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఆర్య, ద్రావిడ జాతులు కలిసిపోవడం వలన కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. హిందూ, బౌద్ధ మరియు జైన మతాలు ఎంత సమ్మిళితం అయిపోయాయి అంటే, ఇప్పుడు వాటిని విడదీసి చూడడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ రచయిత పుస్తకం లో పేర్కొన్నట్టు వాద బలం కోసం, కొన్ని సంస్కృతులను పనిగట్టుకుని అవజ్ఞ చేయడానికి వీటిని ఉపయోగించుకున్న సందర్భాలు కూడా ఉండొచ్చు.  ఈ పుస్తకం లో ముచ్చటించిన కొన్ని అంశాలు క్రింద తెలియజేస్తున్నాను. 

  • మనం వాడే చెంబు, కంచాలను బాగా తోమితే ఒక జాతి సంపూర్ణ చరిత్ర బయటపడుతుంది. చెంబు అనే పదాన్ని ఒకప్పుడు రాగితో చేసిన గుండ్రటి పాత్రకు మాత్రమే వాడేవారు. తరువాత చెంబు పదం అర్థ వ్యాకోచం పొందడమే కాదు, చెంబును వాడే సందర్భాలు కూడా మారిపోయాయి. మరీ అంతకన్నా ఎక్కువ ఈ చెంబులో మన తల ఇరికించకుండా, కంచెం సంగతి కొంచెం చూద్దాము. కంచు తో చేసిందాన్నే ఒకప్పుడు కంచెం అనే వారంటే, ఇప్పుడు మనింట్లో ఉన్న కంచాలన్నీ ఖంగు తింటాయి. కంచెర అనే కుల వాచకం కూడా కంచు తో పనిచేసే వారికి సంబంధించినదే. తిరుపతిలో నైతే ఏకంగా కంచర వీధే ఉంది. కంసాల శబ్దం కూడా ఇలానే వచ్చి ఉండొచ్చు. మరి 'మామ మంచు- అల్లుడు కంచు' సినిమా టైటిల్ లో కంచు దేనిని సూచిస్తుందో, సినిమా చూసిన వారే చెప్పాలి. 
  • సెమెటిక్ జాతులు కూడా రాగిని వాడే వారట. ఇప్పుడు రాగి తో చేసిన వాటర్ బాటిల్స్ వచ్చేసాయి. 
  • ఒక పదం వ్యుత్పత్తిని కూపీ లాగాలంటే, ఇతర భాషా పదాలను కూడా పరిశీలించాలి. ఒక చోటి నుంచి మరో చోటికి తీసుకుపోయేది అనే అర్థంలో  'నీరు' అనే శబ్ధం వచ్చింది. గుడిలో మాత్రం దీనిని తీర్థం అనాలి సుమండీ. బయట ఉంటే నీరు, శంఖంలో పోస్తేనే తీర్థం. కావి మట్టిలో పారే యేరే కావేరీ అయ్యిందట. నల్ల రేగడి లో పారేది కృష్ణ అయ్యింది. పేరులో ఇంతుందా అంటే ఔననే అంటున్నారు తిరుమల రామ చంద్ర. 
  • మనం నిత్యం దేవుడి పూజలో పగలకొట్టే టెంకాయ మన దేశంది కాదని తెలిస్తే, టెంకాయ కేసి మన తలకాయ కొట్టుకోవాలి అనిపిస్తుంది. మనీలా పరిసర ప్రాంతాల నుంచీ ఈ టెంకాయలు వచ్చి ఉండొచ్చు. ఈ నారికేళ వ్యవహారం ఇంత జటిలమై కూచుంది. వావిలకొలను సుబ్బరావు గారు అనుకుంటా ఏకంగా టెంకాయ చిప్ప మీద శతకమే రాసేశారు. నా చిన్నప్పుడు వావిళ్ల ప్రెస్ వారు ముద్రించిన ఈ టెంకాయ చిప్ప శతకం చదివాను. ఈరోజు అసలు టెంకాయ లేని పూజను, కొబ్బరి లేని పచ్చడిని ఊహించగలమా!!!!! నియోర్ కేడా నే నారికేళం అయ్యింది. 
  • వడ గళ్లు చల్లగా ఉంటే, వడ గాలిలోని వడ శబ్దం వేడిని ఎలా సూచిస్తుంది? అసలు గారె వడ గా ఎలా మారింది? 
  • ద్రావిడ సాంగత్యం వల్లే ఆర్యులకు రోలు, రోకలి తెలిసి వచ్చాయని ఈ పుస్తకం చదివిన నేను అంటే ఆర్య పుత్రులంతా కలిసి నా తలకు రోలు కడతారు మరి. నేనెందుకు రోట్లో తల పెట్టడం. మీరే చదివి తెలుసుకోండి. ఈ మధ్య హైందవ - బౌద్ధ, ఆర్య- ద్రావిడ వివాదాలు ముదురుతున్నాయి. విద్యను వివాదానికి వాడకూడదు అని భీష్మించుకున్న నాకెందుకీ గోల? అసలు మనం "రోలు" మాడల్స్ గా భావించే ఆడవాళ్లకు ఈ రోలు, రోకలి ఊసులు తెలుసా???? వారి చేతిలో రోకలి లేనప్పుడు అడిగి తెలుసుకుందాము. 
  • గరిట ను ప్రాచీన ద్రావిడ భాష అయిన అరవం లో కరండి అంటారు. ఇది 'కరండండం" అనే సంస్కృత పదం నుంచి వచ్చిందని నేను అంటే అరవోళ్లు  అందరూ నేను అరవకుండా నా నోరు నొక్కేస్తారు. సంస్కృతంలో కలియబెట్టేది కరండండం. ఇవన్నీ ఒకప్పుడు కర్ర తో చేయబడ్డాయి. లోహ విజ్ఞానం పెరిగిన తరువాత గరిటను లోహం తో చేయడం మొదలెట్టారు. 
  • పులి మీద పుట్ర లో పులి అంటే పురుగు అనే అర్థంలో వాడారట. మరో విశేషం ఏమంటే ఇక్కడ పురుగు పదం పాము అనే అర్థం లో వాడేవారు. కొద్దిమంది ఇప్పటికీ ఈ అర్థంలో పురుగు అనే పదం వాడుతున్నారు. ఒక పాము మీద పడితేనే భయం వేస్తుంది. అలాంటిది పుట్ట వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో తెలియజేసేకే ఈ సామెత వాడబడింది. నేను ఇంటర్మీడియట్ లో ఉండగా, రెండు వేల వరకు తెలుగు సామెతలు సేకరించాను. అందులో ఇలాంటి మతలబులు ఉన్న సామెతలు చాలానే ఉండేవి. తెలుగు భాష సౌందర్యం తెలియాలి అంటే సామెతలు, పొడుపు కథలు చదవాలి. ప్రాచీన సాహిత్యం తో మొదలెట్టి వచన సాహిత్యం వరకు అధ్యయనం చేయాలి. కానీ ఇప్పటి విద్యార్థులకు పోతన గురించి చెపుతాను రారా అంటే 'నే పోతాన్నా సర్" అంటాడు. కాళిదాసు నుంచి, శ్రీ శ్రీ వరకు చదివితే భాష మీద సాధికారత వస్తుంది. కానీ సాహితీ అభిమానులు గ్రూపులుగా విడిపోయి కవులను విడదీయడం తో ఒకరిని అభిమానించేవారు మరొకరిని ద్వేషించడం మొదలెట్టారు. ఏమన్నా అంటే పులి మీద పుట్ర లాగా నా మీదొచ్చి పడతారు. 
  • సూర్యుడిని పేర్కొనే పదాలే తెలుగులో సుమారు ముప్పై వరకు ఉన్నాయట!!!! 
  • దీపావళి పండగ లో బాణ సంచా కాల్చడం ముస్లిం సోదరుల రాకతో మొదలయ్యిందని ఈ పుస్తకం చదివిన నేనంటే నా మీద అందరూ అవ్వాయి చువ్వలు ( తారా జువ్వలు) ఎక్కుపెడతారు. సాంప్రదాయంగా దీపావళి జరుపుకునే వారికి తెలుసు ఆ రోజు పితృ దేవతలకు దారి చూపించడానికి మనం కొరువులు మాత్రమే చూపించేవారమని. కొరివితో తల గోక్కొవడం నాకెందుకు లెండి!!! నేనో తుస్సు టపాసును.. నేను అట్టే వాగాను అంటే నన్నో గోడ టపాసును చేసి గోడకేసి కొడతారు.  అరేబియా లో జరుపుకునే ఈద్ ఉన్ నూర్ మన దీపావళి లాంటిదే. 
  • బృహత్ఫలం గా, కంటకీ ఫలంగా పిలవబడే పనస మాత్రం మన దక్షిణాది వారిదే నట. కొద్ది మంది వైద్యులు ఈ పనసను స్వస్థాహారం అంటే, మరి కొద్ది మంది దీనిని విరుద్ధాహారం అంటారు. ఈ పనస నస మన కెందుకు లెండి. పనస పదం ఎలా వస్తే మనకెందుకు? పనస తొనలు తిని లొట్టలేయండి. తేనె లో అద్దుకు మరీ తినండి. 
  • అలాగే అనాస కూడా అమెరికా నుంచి పర్షియాకు వచ్చి అక్కడ నుంచి మన భరత ఖండానికి వచ్చిందట. మిరపకాయ మనది కాదు అంటే కారాలు.. మిరియాలు నూరేస్తారు మీరు నా మీద. శ్రాద్ద కర్మల లో మా ఇంట్లో మిరియాలు తప్ప మిరపకాయలు వాడకపోవడం నాకు తెలుసు. నీ శ్రాద్దం తో నాకేమి పని అనకండి. శ్రద్దగా చేసేది ఏదైనా శ్రాద్దమే మరి. 
  • నాగలి పదం నిషాద సంస్కృతి నుంచి వచ్చిందని అంటారు రచయిత. రామాయణ కాలం లో కర్షక యజ్ఞం చేస్తూ ఉంటే, సీతా దేవి నాగేటి చాలుకు చిక్కింది మరి. మొన్న ఎవరో చరిత్రకారుడు రాముడికి వ్యవసాయం తెలియదని నాతో అన్నాడు. ఇలాంటివి మీరూ, మీరు చూసుకోండి. నన్ను ఆ నాగేటి చాలులోకి లాగకండి. 
  • మరో విషయం, భూచణకంగా పిలవబడే వేరు శెనగ మనది కాదు. ఇలా అన్నీ మనది కాదు అంటే , మేము దేనితో వంట చేయాలి అని కన్నెర్ర చేయకండి. బ్రెజిల్ లో ఈ పంట విపరీతమంట. ఈ వేరు శెనగ మీద ప్రస్తుతం మన కదిరిలో విశేషమైన పరిశోధనలు జరుగుతున్నాయి. గాంధీ గారి భాషలో ఇది పేద వాడి గోడంబి. 
  • ఉప్పు గురించి ఆది మానవుడికి అసలే తెలియదట. ఉప్పు మాత్రం పూర్తిగా దక్షిణాది పదమేనట. గుర్రాలకు సైంధవ లవణం పెట్టేవారట. లవణం వల్లే లావణ్యం వస్తుందని రచయిత అంటే, ఉప్పు పెద్ద ముప్పు అని నేటి వైద్యులు అంటున్నారు.  
  • దిక్కూ దివాణం అనే జంట పదాలలో దివాణం అనేది మొఘలు రాజ దర్బార్ అయిన దీవానే ఆమ్ ను సూచించేది. 
  • జల్లించేది జల్లెడయ్యింది. 
  • నిమ్మ కూడా మనది కాదట. ఇదేమి విచిత్రం. మరి అప్పట్లో దిష్టి ఎలా తీసేవారు???? "నిమ ఊ" అనే నిషాద పదం నుంచి నిమ్మ వచ్చిందట. సంస్కృతం లో నింబ పదం వేపను సూచిస్తుంది అని మనకు తెలుసు. ఉగాది రోజు మనం నింబ కందళ భక్షణం చేస్తాము కదా!!!
  • చిదంబర దేవాలయానికి, పతంజలి సమాధికి ఏదో దగ్గర సంబంధం ఉందంటారు రచయిత. ఇల్లు అనేది నిలాయ్, నిలై , నిల్ .. ఇలా పరివర్తనం చెంది ఇల్లు అయ్యిందట. మరి కొంప ఎలా వచ్చిండొచ్చు? మీరే ఆలోచించండి. 
  • ఉండ్రాళ్ళు అనే పదం రూప ప్రధాన పదమే కానీ గుణ ప్రధాన పదం కాదట. పొడుగుగా ఉంటే మోదకాలు, గుండ్రంగా ఉంటే ఉండ్రాళ్ళు .. అంతే. 
  • క్షీర శబ్ధం 'క్షర' ( స్రవించు ) అనే పదం నుంచి వచ్చింది. పయః అంటే పాలు. పయం తో చేసినదే పాయసం. క్షీర్ నుంచి వచ్చిందే ఖీర్ ( హిందీ పాయసం ) 
  • భారతంలోని భోజన వర్ణన లో చారు లేదంటాడు రచయిత. భారతం లో లేనిది భారత దేశంలో ఎలా వచ్చింది? అంతెందుకు బసవన్న అల్లమ ప్రభునికి పెట్టిన విందులో కూడా చారు లేదంటే మీకు సర్రుమని కాలుతుంది. మీకు కాలకుండా ఉండడానికి ఓ మాట చెపుతాను. శ్రీనాథుడి కాలానికి చారు వచ్చి మన భోజనం లో చేరిపోయింది. మన వంటలన్నింటి పైకి చారుకు ఉన్న ఔషధ గుణం ఇంక దేనికీ లేదు కదా!!!!. పథ్యం ఉన్నవాడు కూడా చారును లోటాల కొద్దీ జుర్రేయ వచ్చు. అరెరే .. ఈ లోటా ఎలా వచ్చింది అంటే, ఇదో మరాఠీ పదం అట. "ఈ లోటా ఎలా వచ్చింది? నీ లంగోటా ఎలా వచ్చింది? ఇవన్నీ మాకెందుకు?"  అని కోప్పడితే నేను చెప్పడం మానేస్తాను. హర విలాసం లో నల్ల చారు గురించిన ప్రస్తావన ఉంది. ఇప్పుడు పెళ్లిళ్ల లో ఉలవ చారు లేకుంటే మనకు ముద్ద దిగదు. మిరియాల చారు మంచి జీర్ణకారి. ఆకలిని పెంచే వ్యంజనం. అందుకే మంగళూరు ప్రాంతం లో మొదటగా చారు వడ్డిస్తారు. దీనికి కారణం అతిథికి ఆకలి పెరిగి బాగా ఆరగిస్తాడు అని. 
  • వేప శబ్దం వికార ధ్వన్యనుకరణ పదంగా తేల్చేశారు రచయిత. వేప పదం వ్యుత్పత్తి చదువుతున్నప్పుడే కుమారదర్తుడు వేపూరు గ్రామంలో చెరువు తవ్వించాడని తెలిసింది. 
  • వ్రీహి  అనే సంస్కృత పదం వ్రియ్యమై తరువాత బియ్యం అయ్యిందట. వ్రీహి నుంచే వరి కూడా వచ్చింది మరి. ఇక్కడ మరో విశేషం చెప్పాలి. పెళ్ళిలో శాలి ధాన్యం పేలాలు అందివ్వడం వలననే పెళ్ళికూతురు సోదరుడికి 'శ్యాల:' ( బావ) అనే సంభోదన వచ్చిందట. అరిసి అంటే తమిళం లో బియ్యం. బియ్యప్పిండితో చేసేవే అరిసెలు అంటే తెలుగువారు బరిసెలతో నా మీద దాడి చేస్తారేమో!!! నాకీ అరవ దాస్యం నా వైష్ణవ నేపథ్యం వల్ల అంటుకుంది లెండి. 
  • తెలుగు దేశం లో వంకాయ వంటి కూరే లేదని తెగేసి చెప్పిన వైనం మనకు తెలుసు. అలాంటి వంకాయ మనదా , కాదా అనే విషయం నుడి-నానుడి చదివి తెలుసుకోండి. మా అనంతపురం చుట్టుపక్కలకు వచ్చినప్పుడు గుత్తొంకాయలు, రాయదుర్గం వంకాయలు, షేక్శాన పల్లి వంకాయలు తినడం మరవకండి. నా చిన్నప్పుడు ముళ్ళోంకాయలు వచ్చేవి. ఆ వంగ ముళ్లు  నాటుకుంటే తీయాలంటే ఎవరి తరమూ కాదని ఒక సినిమా గేయం లో విన్నాను.  ప్రాచీన మరియు ఆధునిక సాహిత్యాలలో ఇంతలా చొరబడిన ఈ వంకాయ మనదా, కాదా అనేది చదివి తెలుసుకోండి. 
  • కోమటి శబ్ధం గోమఠి నుంచి వచ్చిందట. వీరు ఇతర వణిజుల వలె కాకుండా శాకాహారులుగా మిగలడానికి కారణం జైన ప్రభావమేనట. ఇలా చూసుకుంటూ పోతే మన భాషలో ఎన్ని అన్య దేశ్యాలు చేరిపోయాయో కదా అనిపిస్తుంది. 
  • ఇక చింత చింత కొంత తీరుద్దాం పదండి. తమర్ ఇ హింద్ అనే పదమే టామరిండ్ అయ్యిందట. దీనిని బట్టి మనకున్న చింతలు చాలవని, చింతను కూడా మనం వేరే దేశాల నుంచి చెంతకు తెచ్చుకున్నాము. అలా వేరే దేశం నుంచి వచ్చిన చింతను మనం తోపులు, తోపులుగా పెంచుతున్నాము. ఇలా ఇది చెట్లల్లో పెద్ద తోపై కూచుంది. 
  • ఇక "శెట్టి సింగారించే నాటికి పట్నం పాడయ్యింది" అనే సామెతలో ఉన్నది శెట్టి కాదు జెట్టి అట. అలాగే పట్నం కాదట పట్టం అట. 
  • గొబ్బి అనే పదం తెలుసుకోవాలి అంటే తుళు భాష లోని  గొబ్బు నాట్య విశేషం చూడాల్సిందే. అలా అని ప్రతి పద మూలాన్ని  తుళు భాషలో వెతికేరు. తుళు భాషలో "అండి" అంటే ఏమో తెలిస్తే మన తెలుగు వాళ్లు భర్తను ఇక జీవితంలో ఏవండీ అని పిలవరు.  గోపీ శబ్దం నుంచి గొబ్బి వచ్చిందనడం ఐతిహ్యం మాత్రమే. చిత్తూరు జిల్లాలో గొబ్బెమ్మను గౌరమ్మ అంటారు. 
  • నెయ్యి నుంచి నెయ్యం ఎలా వచ్చిందో తెలుసుకుంటే, స్నిగ్ధత నుంచి స్నేహం ఎలా వచ్చిందో ఇట్టే అర్థం అవుతుంది. అంటించుకున్న తరువాత ఎంత వదిలించుకుందామన్నా వదలని జిడ్డే స్నేహం అంటే. 
  • కోటలో పాగా అనే సామెతలో పాగా అనే పదం పచ్చీసు కాయ ఆటకు చెందినది. తాపీ ధర్మారావు కూడా దీనినే ధ్రువీకరించారు. ఈ పాగా అనే పదం గురించిన వివరణలో కోయంబత్తూరు జిల్లాలో ఉడుముల పేట ఉదంతం ఆసక్తికరంగా ఉంది. అప్పట్లో ఆ పేట లో ఉడుములు పెంచేవారట. అప్పట్లో రాజాస్థానంలో ఉడుముల బాగుగోగులు చూడడానికి ఒక మంత్రిత్వశాఖ ఉండేదట. 
  • ప్రాకృత సమాలు అయిన వైకృతాలు కొన్ని మన భాషలో ప్రవేశించాయి. కరాంబువు అంటే లవంగం. కారము గల పువ్వు కరాంబువు. లవంగాలు పుట్టింది మొలుక్కా దీవులలోనట. 
  • శుభ్రమణి నుంచి సుబ్రమణ్యుడు వచ్చాడు. 
  • మాచకమ్మ మరియు 'పోటా స్త్రీ'  పదాల గురించి చదివినప్పుడు, భారత దేశంలో ఆధ్యాత్మిక దృష్టి, తత్వ దృష్టి మోతాదు మించడం వలన చారిత్రక దృష్టి ఎలా లోపించిందో తెలిసింది. 
  • కృష్ణ దేవరాయలంతటి వాడికి, శ్రీనాథుడి లాంటి మహాకవికి మిరపకాయలు తెలియకపోవడం కాల వైచిత్రి. మిరపకాయ బజ్జీలు లేని విజయనగర సామ్రాజ్యాన్ని నేను ఊహించ లేకుండా ఉన్నాను మహా ప్రభో!!!! అప్పుడు మిరపకాయ బజ్జి ఉండినచో దీని మీద మహా కావ్యాలు రచించేవారేమో!!!!!. కావ్యాలు రాయాలి అంటే కడుపు నిండనన్నా నిండాలి, మండనన్నా మండాలి. వేమన కాలంలో కూడా లేని మిరపకాయ మన దేశంలో ఎంతగా పాకి పోయింది. మిరప లేని వంటను మనం ఊహించలేమే!!!!
ఇలా ఈ నుడి- నానుడి చదివిన తరువాత నా భాషా పరిజ్ఞానం సుసంపన్నం అయ్యింది. విద్యార్థులారా!!!! ఇలాంటి ఎన్నో అపురూప పదాలను మనం మరిచిపోతున్నాము. మన చరిత్రతో ముడిపడి ఉన్న పదాలను బతికించాల్సిన బాధ్యత మీ తరానిదే. మొదట పదాలు పలకడం, తరువాత అక్షర దోషాలు లేకుండా రాయడం నేర్చుకోండి. ఆ చరవాణులు పక్కన పెట్టేసి చదవడం నేర్చుకోండి. జీవితాన్ని ధన్యం చేసుకోండి. 

Comments

Post a Comment

Popular posts from this blog