దాసప్ప గాని మనవడు - మరి కొన్ని కథలు
అశేరా రచించిన "దాసప్ప గాని మనమడు - మరి కొన్ని కథలు" ఛాయా బుక్. కాం నుంచి తెప్పించుకుని మరీ చదివాను. నాకెందుకో పుస్తకాలను ఇప్పించుకుని చదివే అలవాటు లేదు. తెప్పించుకుని చదివే అలవాటే ఉంది. నా దృష్టిలో రచయిత అంటే ఒక ఋషి. అతను రచించిన పుస్తకం చదవడం అంటే ఋషి ఋణం తీర్చుకోవడం లాంటిదే. ఈ పుస్తకం లో మొత్తం ఐదు కథలు ఉన్నాయి. పుస్తకం మొదట్లోనే కథలు ఎందుకు పుడతాయో, ఎలా పుడతాయో చక్కగా వివరించారు రచయిత. కథ ఎవరిదైనా కావొచ్చు , ప్రతి కథలో కూడా ఆదిమ కాలం నుంచీ, నేటి కాలం వరకు కాల గర్భంలో కలిసి పోయిన వివిధ వ్యక్తిత్వాలు తొంగి చూస్తాయి అని రచయిత పేర్కొంటారు. నేల విడిచి సాము చేయడం కవిత్వానికి చెల్లుతుందేమో కానీ కథకు కాదు. ఈ కథల ప్రధాన ఉద్దేశ్యం సంస్కరించకుండా వదిలేసిన అనేక అమానవీయ పోకడల ఖండన. కథలో వాడిన మొరుసునాడు మాండలిక పదజాలం కథ లోని సన్నివేశాలకు ఔచిత్యాన్ని జోడించింది.
ఈ దాసప్ప గాని మనమడు కథలో దాసరి రామాంజనేయులు మనవడు రమేషుడిది ప్రధాన పాత్ర. గడ స్తంభం పట్టుకుని, ముఖం నిండా తిరు నామాలు దిద్దుకుని 'ఓం నమో నారాయణాయ' అనే అష్టాక్షరి మంత్రాన్ని బిగ్గరగా చదువుతూ దాసంగం చేసే తాత రామాంజనేయులు పొందుతున్న అవమానాలని అతి దగ్గరగా చూసిన పసివాడు రమేషుడు. ఆ పసి వాడికి ఒకే పని చేస్తున్న ఇద్దరిలో ఒకరు గౌరవాన్ని పొందడం, మరొకరు అవమానం పొందడం ఎందుకు జరుగుతోందో అర్థం కాదు. రమేషుడు తన తాత తో కలిసి తిరుపతికి రైలులో టాయిలెట్ వద్ద కూచుని ప్రయాణించినప్పుడు అడిగిన ప్రతి ప్రశ్న కూడా మనువాదం మీద, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ మీద ఎక్కు పెట్టిన బాణం. మనువు చేసిన ఆచారాలకు, తోటి మనుషుల ఆగడాలు తోడు కావడం మూలాన తన తాత లాంటి వాళ్లు వివక్షను ఎదుర్కొంటున్నారనే విషయం రమేషుడి పసి హృదయం ఇట్టే పసిగట్టింది. బడైవారు తన పనిని ఎగ్గొట్టి, పౌరోహిత్యం చేస్తూ దాసంగాలు చేసేవారి పొట్టకొట్టిన వైనంలో కనిపించే అమానవీయ కోణం కంట తడి పెట్టిస్తుంది.
నా చిన్నప్పుడు నేను దాసంగాలు చేసే వారిని చూసాను. వారు తీసుకువచ్చిన గడ స్తంభం పైన అమర్చిన ఇత్తడి పలకలో నేను కూడా నా పసితనం లో నూనె పోసేవాడిని. ఆ వయసులో నాకు అంతకు మించి ఏమీ తెలియదు. ఈ పుస్తకం చదివిన తరువాత దాసర్లలో ఎన్ని రకాల వారు ఉంటారో తెలిసివచ్చింది. ఒకప్పుడు కుల వృత్తులు పాటించడంలో గౌరవం ఉండేది. కానీ కాల ప్రవాహంలో వీటికి ఎక్కువ తక్కువలు ఆపాదించబడిన తరువాత ఆయా కుల వృత్తులలో తరువాతి తరాలు కొనసాగడం లో ఇబ్బంది మొదలయ్యింది. ఈ anthropological journey ని చక్కగా వివరించారు రచయిత. బ్రాహ్మణీకరణ వలన కొన్ని కులాలు ఉపాధిని ఎలా కోల్పోయాయో చెప్పిన వైనం బాగుంది.
కథను నడిపించిన తీరులో ఆవేదన తప్ప ద్వేషం కనిపించదు. నామధారులు, మోడికోళ్లు లాంటి భిన్న వర్గాలు ఎలా వచ్చాయో చక్కగా సందర్భ శుద్ది చెడకుండా వర్ణించారు. ఈ పుస్తకం చదవడం ద్వారా వృత్తి సంబంధమైన జాగిటి, గడ స్తంభం, బోనాసి ( భవ నాశిని - బిక్షా పాత్ర ) లాంటి పదాలు నాకు పరిచయం అయ్యాయి. ఇది చదువుతుంటే నాకు నా బాల్యం గుర్తుకు వచ్చింది. బాల్యం లో నేను కూడా శ్రావణ శనివారాలలో పట్టె నామాలు పెట్టుకుని, బిక్షాటన చేసేవాడిని. తన తాత ఎదుర్కొంటున్న అవమానాలను చూసిన తరువాత దాసరి వృత్తి గురించి ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నప్పటికీ, తాత చనిపోయినప్పుడు రమేషుడే స్వయంగా దాసంగం చేయడం ఆ సన్నివేశానికి తగ్గ తీవ్రతను ఇచ్చింది. ఈ మొత్తం కథలో తాత 'తత్వం' పట్టుకుంటే, మనవడు రమేషుడు 'తర్కం' పట్టుకొన్నాడు. రామానుజులు ప్రతి కులం లో దాసర్లు ఉండేలా చేయడం లాంటి ఉదంతాలను, ఆ కాలం లో వాళ్లు పోషించిన ప్రధాన పాత్రను కథలో చక్కగా వర్ణించారు.
నిచ్చెన మెట్ల వర్ణ వ్యవస్థను ప్రవేశపెట్టిన పురుష సూక్త ఉదంతాన్ని దాసప్ప తన మనవడు రమేషుడికి చెప్పిన తీరు అమోఘం. హిరణ్యాక్ష, హిరణ్యకశుపుల ఉదంతం, బాణాసురుడు అస్సాంకు వెళ్లడం వెనుక ఉన్న సామాజిక కోణాలను ఆవిష్కరించడంలో అశేరా కృతకృత్యులు అయ్యారనే చెప్పవచ్చు. కథలో ప్రతి ఘట్టం ఫ్రేము కట్టినట్టుగా దృశ్యమానం అవుతుంది. దాసరి రామాంజనేయులు సమాధి వద్ధ నాగ్గాడు జాగిటీని గిరాటేసిన తీరు, శంఖాన్ని ఆకాశం వైపు గురిపెట్టి దిక్కులు పిక్కటిల్లేలా ఊదిన విధానం వర్ణించిన తీరు వలన పాఠకుల మదిలో ఆయా పాత్రలు మఠం వేసుకుని కూచుంటాయి అనేది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. తాత శవం పెట్టిన గుంతలో రమేషుడు విసిరేసిన జాగిటీ, శంఖం, గడ స్తంభం నా స్మృతి పథం లో సజీవంగా అలానే నిలిచిపోయాయి. పనిలో పనిగా, కథలో ఒక పాత్రగా వచ్చిన గురవయ్య ఉపాఖ్యానం కూడా 'పిదప తరాలు' కుల వృత్తులను ఈసడించుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో చక్కగా తెలియజేసింది.
తాతల కాలం నాటి వాళ్లు తత్వ చింతనతో గడిపి ఉండవచ్చు. కానీ నేటి తరానికి కావలసింది తత్వం కాదు తర్కం అని చక్కగా తెలియజేశారు రచయిత. తత్వాన్ని వక్రీకరించవచ్చు గానీ తర్కం వక్రీకరణకు అందదు. తర్కం తో ఆలోచించేవాడు ఎప్పుడూ దోపిడీకి గురికాడు. ఏది ఏమైనా ప్రతి పల్లెలో, ప్రతి కులంలో రమేషుడి లాంటి మనవడు ఉండాలి. జాగిటీని విసిరేసి, జాగృతి వైపు పయనం కట్టిన రమేషుడు ప్రతి తరానికి ఆదర్శప్రాయుడు. కథా కాల గమనం లో పదిహేను ఏళ్లు గడిచిన తరువాత నాగ్గాడు, రమేషుడు ఏమయ్యారనేది పాఠకులు పుస్తకం 'కొని' చదివి తెలుసుకోండి.
ఇక ఈ పుస్తకం లోని రెండో కథ "యువర్ హానర్ వీడు నా కొడుకే (కాదు)." ఈ కథ చదువుతుంటే నాకైతే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసినట్టు అనిపించింది. స్థూలంగా చెప్పాలి అంటే ఆస్ట్రేలియా కు దత్తు పోయిన ఆకాశ్ జేమ్స్ "రూట్స్" పుస్తకం చదివిన తరువాత తన మూలాలను తెలుసుకోవడం కోసం కళ్యాణదుర్గం దగ్గర ఉన్న కుందుర్పి మరియు అపిలే పల్లి ప్రాంతాలకు రావడమే కథా సారాంశం. ఈ వెతుకులాట లో అతనికి గైడ్ మరియు డ్రైవరుగా వ్యవహరించిన ఆంజనేయులు, RDT తరపున ఆకాశ్ జేమ్స్ కు సహాయం చేయడానికి నియమితులైన రాజ్ గోపాల్ మరియు హరిత పాత్రల నేపథ్యంలో సాగే సంభాషణలలో ఒక anthropology మరియు sociology పరిశోధకులకు పనికొచ్చే బోలెడంత సమాచారం ఉంది. నేను కళ్యాణదుర్గం లో పనిచేయడం వలన నాకు ఆ చుట్టు పట్ల ప్రాంతాల పట్ల ఆసక్తి ఎక్కువ. అప్పట్లో నన్ను నిజవల్లి, నేత్ర వల్లి అనే పల్లెల పేర్లు ఆకట్టుకున్నాయి. కానీ ఆ పేర్ల వెనుక ఉన్న శైవ, జైన సంస్కృతి ప్రాధాన్యత నాకు అప్పట్లో తెలియదు. కానీ ఈ పుస్తకం చదివిన తరువాత ఆ పేర్ల వెనుక దాగిన చారిత్రక వాస్తవాలను తెలుసుకొన్నాను. మలయనూరు పేరు నేను ఎప్పుడూ వినలేదు. కుందుర్పి కి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని రచయిత చక్కగా కథలో ఇమిడిపోయేలా పాత్రలతో చెప్పించారు. టముకులోడు, జముకులోడు స్నేహం చివరికి ఆకాశ్ జేమ్స్ కి మిత్ర లాభం చేకూర్చడం కథలో జరిగిన ఒక poetic justice. కళ్యాణదుర్గం ప్రాంతం ఒక old habitation site గా తెలుసుకుని నేను ఒక నాస్టాల్జిక్ ఫీల్ ను పొందాను. జముకు వాద్యం గురించి కూడా చక్కగా వివరించారు. సాలక్క పాత్ర ప్రవేశించిన సన్నివేశంలో దేవదాసీ, బసివి, జోగినీ వ్యవస్థల గురించి బాగా తెలియజేశారు. ఈ చారిత్రక వాస్తవాలు చెప్పేటప్పుడు కూడా ఎక్కడా కథా గమనం లో బిగి, వడి సడలకుండా రచయిత జాగ్రత్త పడ్డారు. ఈ పుస్తకం చదవడానికి ముందు నేను దేవదాసీ, బసివి, జోగినీ పదాలను సమానార్థక ప్రతి బోధకాలుగా భావించేవాడిని.
రాయలు విధించిన "లంజ పన్ను" గురించి, ఆ పన్ను ఆదాయం తో రాయల వారు పదాతి దళాన్ని పోషించిన వైనం రచయిత ఆసక్తికరంగా వివరించారు. ఈ లంజ పన్ను విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఒక చీకటి కోణం. చివరగా కథలో వచ్చిన కోర్టు సీన్ ను ఉద్వేగంతో నడిపించారు రచయిత. ఇలాంటి నేపథ్యం ఉన్న ఒక నవలను మల్లాది వెంకట కృష్ణ మూర్తి "ఓ నాన్న కథ" పేరుతో రచించారు. చంటబ్బాయి సినిమాలో కూడా ఇలాంటి ఛాయలు కనపడినప్పటికీ పాత్రల స్వరూప, స్వభావాలు, నేపథ్యాలు, ఉద్దేశ్యాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఓ నాన్న కథలో హీరో తండ్రి అల్జీమర్స్ రోగి. అశేరా వారి కథలో రంగప్ప స్క్రీజోఫ్రెనియా రోగి. విన్సెంట్ ఫెర్రర్ గారి సేవల గురించి చక్కగా వివరించారు కథలో.
మరి చివరాఖరికి ఆకాశ్ జేమ్స్ తన కన్న తల్లి తండ్రిని కనిపెట్టాడా లేదా అనేది మీరే చదివి తెలుసుకోవాలి మరి!!!! అంతా నేనే చెప్పేస్తే మజా ఏముంది!!!!!
మరి మూడో కథ "తొక్కలాట" లో ఏముందో చూద్దాం. దీనిలో పెద్ద కొండడు , సిన్న కొండడు అనే అన్నదమ్ముల పాత్రలు ఉంటాయి. తమ్ముడు సిన్నకొండడు డిగ్రీ వరకు చదువుకోవడం వలన అతనికి సామాజిక అంశాల పట్ల అవగాహన ఉంటుంది. కానీ రెడ్రావు కుతంత్రాన్ని మాత్రం పసిగట్టలేక పోతాడు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి సిన్నకొండడిని ఎగదోస్తాడు రెడ్రావు. ఊరి దేవర లో పెద్ద కొండడి కొడుకు రాజును భూత పిల్లిని చేస్తారు ఊరి పెద్ద మనుషులు. పెద్ద కొండడు పొలి చల్లడానికి వెళ్లే ముందే దేవర దున్నపోతును పట్టుకునే క్రమంలో సిన్న కొండడు ఏమవుతాడనేది కథలో సస్పెన్స్. రాజు సిన్న కొండడి నుంచి స్పూర్తి పొంది ఫెరర్ గారు స్థాపించిన స్కూల్ లో చేరడానికి ఉద్యుక్తుడవడం కథలో కొస మెరుపు. మనువాదానికి చదువే మందు. మనువాద mass hypnotic ట్రాన్స్ నుంచి బయటపడడానికి చదువుకోవడం ఒకటే మార్గం. ప్రతి ఒక కులంలో ఇప్పుడు మనువాదులు కొత్తగా పుట్టుకొస్తున్నారనే అంశం ఈ కథల ద్వారా తెలుస్తుంది.
"ఈత పరకలు" కథలో మొండోడు ప్రధాన పాత్రధారి. వాడి నాన్న పేరు బండోడు. పందులు కాచుకోవడం, ఈత పొరకలు, బూజు కట్టలు అమ్ముకోవడం వీరి కుల వృత్తి. మొండోడు, హనుమంతు ప్రోత్సాహంతో జై భీమ్ గా పరిణామం చెంది ఎలా స్కూల్ లో చేరాడనేది కథాంశం. ఈ కథ నిండా కరుణ రసం నిండి ఉంటుంది. హనుమంతు లాంటి యువకుడు ప్రతి పల్లెకు ఉంటే గ్రామాలు బాగు పడతాయి.
చిట్ట చివరి కథ "కాకి కల హంస" నా జువాలజీ బుర్రకు మంచి మేధో పరమైన విందు చేసింది. ఈ కథ మొత్తం దండకారణ్య నేపథ్యంగా జరిగినప్పటికీ మధ్యలో మానస సరోవర వర్ణన కూడా వస్తుంది. పక్షుల జీవ వైవిధ్యాన్ని మొత్తం భలేగా వర్ణించారు రచయిత. మన సాహిత్యంలో ఒక ఊహాజనిత పక్షి ఉంది. దాని పేరే హంస. ఎక్కడో మానస సరోవర ప్రాంతంలో తామర తూడులు తింటూ ఇవి జీవిస్తాయని ఇప్పటికీ మనం నమ్ముతూ ఉంటాము. అసలు ఈ హంస వాదమే పెద్ద బూటకము. హంస కేవలం కవుల కపోల జనితము. హంస అనేది పురాతన కాలాలలో కూడా మనుగడలో లేని పక్షి. వాటి శిలాజాల ఆనవాళ్లు కూడా దొరకలేదంటే దాని అర్థం అవి భూమి మీద ఏ కాలంలో కూడా నివసించలేదని. మనం హంసను గొప్పగా, కాకిని నీచంగా చూస్తాము. కాకి నుంచి ఎన్నో నైపుణ్యాలు మనం నేర్చుకోవచ్చు. కాకి సంఘజీవి. కాకి ఏకాకిగా జీవించలేదు. 'మంది కోసం మనం' అనుకునే పక్షి కాకి. శుభ్రత లో దానికి అదే సాటి. తన గూటిలో తనకు అవసరమున్నా లేకున్నా అన్నిటినీ పోగేసుకుని పరిసరాలను శుభ్రంగా ఉంచే స్వచ్చ భారత్ brand ambassador ఈ కాకి. దీనిని దగా చేసేది కోకిల. తన గుడ్లను పొదుగు కోవడం కూడా తెలియని కోకిల ఏ పనీ పాట లేకుండా, పాటే పనిగా పాడుతూ, తన గుడ్లను కాకి చేత పొదిగిస్తుంది. శ్రమ దోపిడి కోకిల కు వెన్నతో పెట్టిన విద్య. ఇక హంస లాగే చాతక పక్షులు కూడా ఊహా జనితమే. ఇవి వర్షపు నీటిని మాత్రమే ఆకాశంలో ఒడిసిపట్టి తాగుతాయని చెపుతుంటారు. వీటి వర్ణన మాత్రం ప్రస్తుతం జీవించి ఉన్న జాకోబిన్ కోకిల జాతికి దగ్గరగా ఉంటుంది.
ఈ "కాకి కల హంస" కథలో ఓ పిల్ల కాకి హంసల నుంచి జ్ఞానం పొంది పరమ హంస కావాలనే మోజుతో, తన తోటి కాకులు హంసలు మంచివి "కావు".. కావు" అని మొత్తుకున్నా, ఆ కాకి గోలను వినకుండా హిమాలయాల వైపు ప్రయాణిస్తుంది. దానికి comfort zone నచ్చలేదు మరి!!!!! పికాలతో, శుకాలతో కూడిన వనాలను దాటుకుంటూ మధ్యలో బకాలను కలుసుకుని, వాటినే హంసలనుకుని, తన లక్ష్యం నెరవేరిందని తెగ మురిసిపోతుంది. అప్పుడు ఆ బక నాయకుడు తన జప తపాలను వదిలి ఉండేలు దెబ్బ కూడా తెలియని పిల్ల కాకికి జాతి మనుగడకు కావలసిన నైపుణ్యాల గురించి తెలియజేస్తాడు. కానీ ఆ పిల్ల కాకి "ఈ బకాసురుడి మాటలు వింటే, నేను జీవితాంతం పిండాలు తింటూనో, లేదంటే తను ఇంకా రుచి చూడని ఉండేలు దెబ్బలు తింటూనో జీవించాలని భావించి, బక న్యాయాన్ని తృణీకరించి హిమాలయాల వైపు పయనం కొనసాగిస్తుంది. అసలు ఈ పిల్ల కాకి హంసల సంయోగం వల్ల 'వాయసత్వాన్ని' ఎలా 'వారసత్వం' గా పొందిందో తెలియాలి అంటే కథ చదివి తీరాల్సిందే.
ఈ కథలో వివిధ పక్షి జాతులు సంభాషించుకునే తీరు నవ్వు తెప్పిస్తుంది. కాకులు దండకారణ్యానికి ఎంత అవసరమో చెంచు చక్కగా వర్ణిస్తాడు. సమాజానికి పనికిరాని నైపుణ్యాలు వృధా అని తేలుస్తాడు చెంచు దొర. కాకి సమాజపు పక్షి, సమూహపు పక్షి అని చక్కగా తెలియజేస్తాడు. హంసకు ఆపాదించబడిన క్షీర నీర న్యాయం యొక్క డొల్ల తనాన్ని తనదైన రీతిలో వివరించారు రచయిత. ఈ కాకమ్మ కథ లో ఎంతో సామాజిక ప్రతీకలు కనపడతాయి. ఈ ప్రతీకలను చక్కగా అర్థం చేసుకుంటే బూటకపు అగ్ర వర్ణ హంస వాదం, హింస వాదం మనకు చక్కగా అర్థం అవుతుంది. ఇదండీ నా సమీక్ష.
ఇక నేను చదవడం అయిపోయింది కదా మరి, వేసంగి సెలవులు ముగిసిన తరువాత మా విద్యార్థులతో చదివిస్తాను.
మరో పోస్టింగ్ లో ముచ్చట్లు పెట్టుకుందాము.
స్వస్తి
G L N ప్రసాద్
జంతుశాస్త్ర అధ్యాపకుడు
ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల
అనంతపురము.
చాలా గొప్ప విశ్లేషణ సార్ ఇదంతా చదివితే మీరు దాసప్ప గారి మనవడు కథకి చాలా దాసోహమైనట్టు అనిపిస్తుంది... ఈత పరకలు దాసప్ప గారి మనవడు రెండు చదవాలని ఉంది నాకు కూడా....అరుణ
ReplyDeleteమన కాలేజీ SC & ST సెల్ convenor బాలాజీ నాయక్ సర్ కు ఈ రోజే ఆ పుస్తకం అందజేస్తున్నాను మేడం. సర్ వద్ద నుంచి తీసుకుచదవండి.
ReplyDeleteఅదృష్టవంతులు. మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు.మాకు కూడా చదవాలని పించేలా విశ్లేషించారు.
ReplyDelete