ఒంగోలు ప్రయాణం
అధ్యాపకులందరము విద్యార్థి దశలోకి వెళ్ళిపోయిన అనుభూతి ఈ రోజు వచ్చింది. Association elections రాష్ట్ర స్థాయిలో ఒంగోలు సక్కూ భాయి మహిళా డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 9, 2025 న జరగబోతున్నాయి. ఆ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అనంతపురం జిల్లా నుంచి 30 మంది వరకు అధ్యాపకులు ఒంగోలుకు ఫిబ్రవరి 8 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆర్ట్స్ కళాశాల నుంచి బయలుదేరాము. ప్రయాణానికి ఏర్పాటు చేసిన బస్సు చాలా సౌకర్యవంతంగా ఉంది. నేను అందరికంటే ముందుగా వెళ్లి సింగల్ సీట్ లో కూచుండి పోయాను. చేతిలో ఒక బ్యాగ్ తప్ప ఎవరికీ పెద్ద లగేజ్ లేదు. బస్సు ఎక్కడానికి ముందే అందరూ blissful mood లోకి వచ్చేసారు. ఈ టూర్ మొత్తం మనోహర్ రెడ్డి, శేషయ్య మరియు సోమశేఖర్ ఆధ్వర్యంలో నడుస్తోంది. బయలుదేరడానికి ముందు రోజే నేను గూగుల్ లో ఒంగోలు చుట్టుపట్ల ఉన్న ప్రదేశాల గురించి వెతికి పట్టుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా, అక్కడకు దగ్గరగా ఉన్న ప్రదేశాలు చూసి రావడం నాకు ఓ రివాజు. ఎందుకంటే మళ్లా మనం ఆ తోవ పోక పోవచ్చు. ఇప్పుడు నా ప్లానింగ్ లో సింగరాయకొండ, వల్లూరమ్మ గుడి మరియు కొత్తపట్నం బీచ్ ఉన్నాయి.
అనుకున్న సమయానికంటే కొద్దిగా ఆలస్యంగా మధ్యాహ్నం మూడింటికి బస్ బయలుదేరింది. అహ్మద్ blue tooth కు మొబైల్ ద్వారా connect అయిపోయి మంచి పాటలు వినిపించడం వలన ఎవరికీ ప్రయాణ బడలిక తెలియలేదు. పెనుగొండ నుంచి మిత్రుడు హరీష్ వచ్చాడు. అలాగే జువాలజీ నుంచి శ్రీదేవి, జమీల , జక్క సత్యనారాయణ వచ్చారు. మైదుకూర్ దగ్గర లో ఎక్కడో ఒక పెద్ద టీ స్టాల్ వద్ద మేమంతా చిల్లో బొల్లో మంటూ దిగి తేనీటిని సేవించాము. నేనైతే ఆకలి మీద ఉండడంతో కొన్ని చేగోడీలు లాగించాను. తరువాత బద్వేల్ లో ఒక హోటల్ వద్ద భోజనానికి ఆగాము. కానీ ఎవరూ భోజనం చేయకుండా నెయ్యి దోసెలు, చపాతీలు, ఇడ్డెన్లు ఆబగా ఆరగించారు. తరువాత మేము అహ్మద్ పెట్టిన పాటలు వింటూ ఒంగోలు చేరే సమయానికి రాత్రి ఒకటిన్నర అయ్యింది. మాకు హరిప్రియ లాడ్జ్ లో వసతి ఏర్పాటు చేసారు. సౌకర్యవంతంగా ఉంది. నేనున్న గదిలో శ్యామ్, శివ శంకర్, శేఖర్ ఉన్నారు.
మరుసటి రోజు ఓటింగ్ మొదలవడానికి ఉదయం పదకొండు గంటలు కావొచ్చు అని నాకు చూచాయగా తెలిసింది. కాబట్టి అంతలోపు నేను చూడాలని నిర్ణయించుకున్న ప్రదేశాలకు వెళ్లడానికి ఒక ప్లాన్ వేసుకున్నాను. నాతో పాటు రావడానికి పెనుగొండ డిగ్రీ కళాశాల ఇంగ్షీష్ లెక్చరర్ యశోదా రాణి, నా క్లాస్ మెట్ శ్రీదేవి, జమీలా, విజయ లక్ష్మీ మరియు బృంద మేడమ్స్ సన్నద్ధత తెలియజేసారు. ఉదయం 5.30 కు బయలుదేరాలని నిర్ణయించుకున్నాము. రాత్రి గదిలో దోమలు ఉండడం వలన చప్పట్లు కొడుతూ గడిపాము. ఆ చప్పట్లు ఎవరైనా విని ఉంటే, మేమేదో భజన చేస్తున్నాం అనుకుని ఉండేవారు. కేవలం అరగంట నిద్రపోయాను. వేడి నీళ్లు లభించకపోవడంతో శీతోదక స్నానం చేసి బయటకు వచ్చేసరికి యశోదా రాణి మరియు శ్రీదేవి సిద్దంగా ఉన్నారు. తరువాత జమీలా, విజయలక్ష్మీ మరియు బృంద మేడం వచ్చేసారు. అందరం ఒక పెద్ద ఆటో పట్టుకుని సింగరాయకొండకు బయలుదేరాము. డ్రైవరు పేరు అంజయ్య. మొత్తం ట్రిప్పుకు రెండు వేల రూపాయలు అడిగాడు. చలి ఉన్నప్పటికీ ఇబ్బంది పెట్టే స్థాయిలో లేదు. సింగరాయకొండ కు రూట్ బాగుంది. ఎక్కువ భాగం high way మీద ప్రయాణం సాగింది. మేము సింగరాయ కొండ చేరుకోవడానికి సుమారు గంట పట్టింది. సింగరాయకొండ ఊరు బాగా ఉంది. గుడి కొండ మీద ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఉంది. గుడి పరిసరాలు చాలా శుభ్రంగా ఉన్నాయి.
సింగరాయకొండ లో ఉన్న దైవం వరాహ నరసింహ స్వామి. అలాగే యోగ నరసింహ స్వామి గుడి కూడా ఉంది. వరాహ నరసింహ స్వామి ఉండడం వలన ఈ క్షేత్రాన్ని దక్షిణ సింహాచలం అని కూడా పిలుస్తారు. మేము వెళ్లే సమాయనికి పూజారి గర్భగుడి లో అలంకారం చేస్తూ ఉండడం వలన, మేమంతా గుడి ప్రదక్షిణలు ముగించి, ఫోటోస్ తీసుకోవడంలో నిమగ్నమయ్యాము. తరువాత వరాహ నరసింహ స్వామిని దర్శించి, పక్కనే ఉన్న యోగా నరసింహ స్వామి గుడికి వెళ్లాము.
ఈ క్షేత్రం లో విశేషం ఏమంటే ఇక్కడ ప్రథమ నైవేద్యం యోగా నరసింహ స్వామికి, ఉత్సవాలు మరియు భోగాలు వరాహ నరసింహ స్వామికి జరుగుతాయి. వరాహ నరసింహ స్వామి వారిని ప్రతిష్టించినది శ్రీరాముడు. యోగా నరసింహ స్వామి అంతకు ముందే నారదుని కోరిక మేర ఇక్కడ వెలిశారు. యోగా నరసింహ స్వామి ఓడ్యాణ బంధంలో కూచుని ప్రశాంతంగా భక్తులకు ఇక్కడ దర్శనం ఇస్తారు. యోగా నరసింహ స్వామి గుడిలో ఒక అర్చకుడి పుత్రుడికి స్వామి వృద్దుడి రూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది. అందుకే ఈ దైవాన్ని తాత గారు, తాతయ్య స్వామిగా కూడా పిలుస్తారు. తాత అయినా, విధాత అయినా స్వామి వారే కదా!!! బ్రిటీష్ వారి కాలం లో బంగాళా ఖాతం లో ప్రయాణించే స్టీమర్లు యోగా నరసింహ స్వామి దృష్టి సోకి తగలబడి పోయేవి. అందుకే ఆ దృష్టి సోక కుండా బ్రిటీష్ అధికారులు గర్భాలయం తలుపులను కొద్దిగా పక్కకు జరిపారు. మేము సింగరాయకొండ వదలడానికి ఉదయం 8 గంటలు పట్టింది.
తరువాత వల్లూరమ్మ గుడి కి వెళ్లాము. ఈమెను మహిమగల దేవతగా స్థానికులు కొలుస్తారు. ఉల్క రూపంలో దర్శనం ఇవ్వడం వలన వల్లూరమ్మకు జ్వాలాముఖీ అనే పేరు కూడా ఉంది. ఇక్కడ అమ్మవారికి అలకరించిన చీరలు అమ్ముతారు. వెంకటగిరి రాజుల నుంచి రాజ్యాన్ని రక్షించుకోవడానికి మందపాటి రాజులు చేసిన యజ్ఞం నుంచి ఉల్క రూపంలో అమ్మవారు ఆవిర్భవించింది అని చెపుతారు. ఇక్కడ ఇచ్చిన శర్కర పొంగలి అమృతం లాగా ఉంది.
ఇలా క్షేత్ర దర్శనాలు ముగియగానే, కొత్తపట్నం బీచ్ కు బయలుదేరాము. బీచ్ కు ఉదయం 9.15 కు చేరాము. ఈ బంగాళాఖాతం బీచ్ నిండా చేపల పడవలే. పడవలతో నిండి పోయి బీచ్ సినిమా సెట్టింగ్ లాగా కనిపించింది. సమయం ఎక్కువ లేకపోవడంతో కేవలం అర్ధ గంట మాత్రమే అలల తో ఆడుకుంటూ గడిపాము. సముద్రం లో పడవలు కదిలి పోతున్న దృశ్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. సాగర తీర దృశ్యాలను ఫోటోల్లో బంధించాము.
ఇవన్నీ ముగించుకుని, లాడ్జ్ కి వెళ్లి, అక్కడ నుంచి ఓటింగ్ జరిగే కళాశాల కు వెళ్లేసరికి ఉదయం 11 గంటలు అయ్యింది. అక్కడ అప్పటికే చాలా హంగామా నడుస్తోంది. ఎక్కడ చూసినా మిత్రులే. మరో క్లాస్ మెట్ అంకమ్మ వచ్చింది. నగరి నుంచి భాస్కర రాజు, గురువులు, వర్మ సర్ మరియు శామ్ సన్ సర్ వచ్చారు. అందరితో ఫోటోస్ తీసుకున్నాము.
ఓటింగ్ ముగిసిన తరువాత గెలిచిన వారు ప్రమాణ స్వీకారం చేసారు. గెలిచిన వారిలో మా మిత్రులు శేషయ్య మరియు రామచంద్ర ఉండడం మాకు ఎంతో గర్వకారణం.
తిరుగు ప్రయాణం ఇంచు మించు రాత్రి 8 కి మొదలయ్యింది. అందరం ఒళ్లు తెలియకుండా నిద్రపోయాం. అనంతపురం 10 వ తేదీ ఉదయం 6 గంటలకు చేరాము. బడలిక తీరిన వెంటనే, నిత్య కృత్యాలలో మునిగిపోయాము.
అన్నట్టు చెప్పడం మరిచాను. ఎవరైనా ఒంగోలు వెళితే అల్లూరయ్య స్వీట్ స్టాల్ లో మైసూర్ పాకం, జీడి పప్పు పాకం తీసుకోవడం మరువకండి. వీలుంటే, అటునుంచి అటే వేట పాలెం వెళ్లి జీడి పప్పు తీసుకుంటే ప్రయాణం పరిపూర్ణం అవుతుందని నా అభిప్రాయం.












Nice memories sir. Tq
ReplyDelete