అనంతపురం ఆర్ట్స్ కళాశాల
నేను పుట్టి పెరిగిన అనంతపురం లో నాకు నచ్చిన ప్రదేశాలు రెండు. అవి ఒకటి ఆర్ట్స్ కాలేజీ, మరొకటి దాని పక్కనే ఉన్న విశాలాంధ్ర. విశాలాంధ్ర గురించి నేను కోరా లో రాసేశాను కాబట్టి ఇక ఇక్కడ ఆ ముచ్చట పెట్టుకోను.
మా ఆర్ట్స్ కళాశాల ఆషామాషీ కళాశాల కాదు. వంద సంవత్సరాల పై చిలుకు చరిత్ర ఉన్న విద్యాలయం. ఇచట పుట్టిన చిగురు కొమ్మయిన చేవ అన్నట్టు, ఇక్కడ చదువుకున్నా, పని చేసినా, ఆ పొగరే వేరు. ఈ క్యాంపస్ లో వీచే గాలిలోనే ఏదో మహత్యం ఉంది. మా నాన్న తో సహా మా బంధువులందరూ ఈ కాలేజీ లోనే చదువుకున్నారు. మా కాలేజీ ప్రాంగణం చాలా పెద్దది. సుమారుగా 46 తరగతి గదులు ఉంటాయి. దానిలో కొన్ని గాలెరీలు. ఇప్పుడైతే కొన్ని తరగతులు డిజిటల్ సొబగులు అద్దుకున్నాయి. ఇవి కాక ప్రయోగశాలలు, హెల్త్ సెంటర్, కాంటీన్ , లైబ్రరీ లాంటి అదనపు హంగులు కూడా ఉన్నాయి. విభాగాల ముందు పొడవైన కారిడార్లు చూస్తే , రాజ ప్రాసాదాలు గుర్తుకు వస్తాయి. నా వరకు నాకు మా ఆర్ట్స్ కళాశాల ఒక మైసూర్ ప్యాలెస్, నేనో మైసూర్ మహారాజ్. 'ఎవరక్కడ ?' అని అరిస్తే 'ఎవరూ లేరిక్కడ' అని సమాధానాలు ఇచ్చే చిలిపి విద్యార్థులతో ప్రాంగణం అంతా ఎప్పుడూ పండగ వాతావరణం పరుచుకుని ఉంటుంది.
నేను ఈ ఆర్ట్స్ కళాశాలలో ఎన్నో పోగొట్టుకున్నాను, ఎన్నో పొందాను. నిజానికి నా జీవితంలో సింహ భాగం ఆర్ట్స్ కళాశాల లోనే జరిగిపోయింది. నేనిక్కడ విద్యార్థిగా 1988-91 వరకు BSc BZC English medium చదివాను. మూడేళ్ల చదువు నాకు చాలా విషయాలే నేర్పింది. నేను చదువుకునే రోజుల్లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తానని అనుకోలేదు. అందునా నేను చదువుకున్న, ఈ ఆర్ట్స్ కళాశాల లోనే సుమారు ఓ దశాబ్ద కాలం పని చేస్తానని అనుకోలేదు. నా డిగ్రీ అధ్యయన దినాల అనుభవాలు కొన్ని ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తాను. నన్ను ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి, నేను ప్రలోభపడ్డ సన్నివేశాల గురించి చెపుతాను. ఇవి చదివితే, ఆ కాలపు చదువులే వేరప్పా అని మీరు అచ్చెరువుతో ముక్కున వేలేసుకుంటారు.
మా జువాలజీ విభాగం లో మా క్లాస్ కు వసంత మూర్తి మేడం, మదన్ మోహన్ దాస్ సర్ మరియు మురళీ సర్ వచ్చేవారు. వసంత మూర్తి మేడం మాకు vertebrate zoology బోధించారు. మదన్ మోహన్ దాస్ సర్ చెప్పిన ecology లోని అంశాలు నాకు ఇప్పటికీ గుర్తుకున్నాయి. మురళి సర్ మాకు మొదటి ఏడాది వచ్చారు. ఈయన వల్లనే నాకు పీజీ zoology చేయాలనే సంకల్పం కలిగింది.
బాటనీ లో తిమ్మప్ప సర్, మాధవ మూర్తి సర్, జానకి మేడం ఉండేవారు. ఒక క్రమశిక్షణ తో, చక్కగా వీరి బోధన ఉండేది. కానీ నాకు ఎందుకో జంతుశాస్త్రం మీద మక్కువ ఎక్కువ అయ్యింది. నేను అప్పటికే సివిల్ సర్వీసెస్ లో జువాలజీ ఆప్షనల్ గా తీసుకోవాలనే సంకల్పానికి వచ్చేశాను. మీకో ఆసక్తి కరమైన అంశం చెప్పాలి. నా డిగ్రీ మూడు సంవత్సరాలలో నేను ఎప్పుడూ మా కళాశాల ప్రిన్సిపల్ ను చూడలేదు. అప్పట్లో ప్రిన్సిపల్ ఛాంబర్ బయట ఒక బిళ్ల బంట్రోతు ఉండేవాడు. అతను దండధరుడై ఉండి , నాలాంటి అల్లరి మూకను లోపలికి రానిచ్చేవాడు కాదు. chemistry లో మరో మాధవ మూర్తి సర్ ఉండేవారు. ఇటీవలనే ఆయన కాలం చేశారు. chemistry , botany మరియు zoology ప్రాక్టికల్స్ చాలా స్ట్రిక్ట్ గా జరిగేవి. chemistry ప్రాక్టికల్స్ లో నేను organic analysis మరియు salt analysis ఎంతో ఆసక్తి తో చేసేవాడిని. Chemistry ల్యాబ్ చాలా పెద్దది. ఇప్పటికీ దాని రాజసం ఏ మాత్రం తగ్గలేదు. ఇది ఇప్పటికీ అతి పెద్ద విభాగం గానే చెలామణి అవుతోంది. ఈ కళాశాలలో నా క్లాస్ మేట్స్ ( అబ్బాయిలు ) అందరితో నేను ఇప్పటికీ సంబంధ బాంధవ్యాలను కలిగేఉన్నాను. అందరం జీవితాల్లో స్థిరపడిపోయాము. నేనైతే మరీ విచిత్రంగా ఇదే కాలేజీ లో జంతుశాస్త్ర విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. ఆర్ట్స్ కాలేజీ లో విద్యార్థిగా కొనసాగిన నా ప్రస్థానం లో కొన్ని సరిగమలు, పదనిసలు కింద ప్రస్తావిస్తున్నాను.
- మొదటిసారి నేను co -education లోకి అడుగుపెట్టాను. అమ్మాయిలు చాలా మందే ఉండేవాళ్లు. చాలా మంది పేర్లు గుర్తుకు లేవు. అతి కొద్ది మంది పేర్లు గుర్తుకు ఉన్నా కూడా వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అనే విషయాలు తెలియరాలేదు. నాకు అమ్మాయిలతో మాట్లాడాలి అంటే చాలా బెరుకుగా ఉండేది. ఇప్పటికీ అంతే అనుకోండి. మహిళా అధ్యాపకులతో నేను ఇప్పటికీ మాటలను ముక్తసరిగా ముగించేస్తా.
- మేము డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉండగా తిరుమల, తలకోన, కళ్యాణి డ్యామ్ లాంటి ప్రదేశాలకు టూర్ వెళ్లాము. Chemistry మాధవ మూర్తి సర్ మా వెంట వచ్చారు. ఈ టూర్ నాలో ఉన్న బెరుకును కొద్దిగా పోగొట్టిందనే చెప్పవచ్చు. ఈ టూర్ నిజంగా ఒక మధురానుభూతి. దీనికి చిలువలు, పలువలు అల్లి, అవాకులు, చెవాకులు చేర్చి ఒక కథ రాసి 'Tea Time కథలు' అనే పుస్తకం లో చేర్చాను.
- ఈ డిగ్రీ లోనే నేను Competition Success Review లాంటి magazines ను చదవడం అలవాటు చేసుకున్నాను.
- ఆప్యాయ అనే మిత్రుడి వలన నేను చాలా స్పూర్తిని పొందాను. వీడి ప్రోద్బలం తో క్లాస్ లోని అబ్బాయిలందరు పెనకచర్ల కు సైకిల్ యాత్ర చేసాము. ఇంట్లో ఏదో నోటికి వచ్చిన అబద్దం చెప్పి భోజనం, టిఫిన్ లాంటివి నాగేశ్వర రూము లో వండుకుని సైకిళ్ల వెనుక కట్టుకుని బయలుదేరాము. గార్ల దిన్నె వచ్చేసరికి మా ఉత్సాహం నీరుగారిపోయింది. సైకిల్ పంక్చర్ అయితే బస్సు లో పోవచ్చు కదా అనుకున్నాను. అందరూ అలాగే ఆలోచించారని తరువాత తెలిసింది. కానీ ఆప్యాయ ప్రోత్సాహం తో ఎలాగో, ముక్కుతూ, మూలుగుతూ, సైకిళ్లు తొక్కుతూ పెనకచర్ల చేరాము. అక్కడి ప్రవాహంలో స్నానం చేసాము. నాకు ఈత రాకపోవడంతో వేరే వాళ్లు పట్టుకుంటే ఎలాగో నన్ను నేను ఆ నీటిలో నెట్టుకొచ్చాను. ఈత తరువాత తెచ్చుకున్న భోజనం తినేసి, కాసేపు లైట్ హౌస్ ఎక్కి ఆడుకున్నాము. యాషికా కెమెరా తో సురేష్ ఫోటోస్ తీశాడు. ఇప్పటికీ అవి నా ఆల్బమ్ లో భద్రంగా ఉన్నాయి. అప్పుడప్పుడే కలర్ ఫోటోస్ యుగం మొదలయ్యింది. కెమెరా లోకి రీలు ఎక్కించడం, ఫోటోస్ తీయడం, తీసిన వాటిని కడిగించడం లాంటివి పెద్ద ప్రహసనాన్ని తలపించేవి. ఇంతా చేస్తే ఆ ఫోటోస్ ఒక్కోసారి సరిగా వచ్చేవికావు. ఈ విషయం లో ఈ కాలం కుర్రకారు బాగా అదృష్టవంతులనే చెప్పొచ్చు. ఎక్కడిక్కకడ సెల్ఫీలు,ఫోటోలు తీసుకొనే వెసలుబాటు మొబైల్ లోనే ఉంది ఇప్పుడు.
- 1991 లో నా డిగ్రీ అయిపోయింది. బొటాబొటిగా ఫస్ట్ క్లాస్ వచ్చింది. Microbiology చేయాలని తెగ కోరిక ఉండేది. అప్పట్లో ఆ కోర్సు కు క్రేజ్ ఉండేది. నేను ఎంట్రన్స్ లో మొదటి స్థానం లో నిలిచినప్పటికీ , నాకు కొన్ని కారణాల వలన సీటు రాలేదు. అప్పుడు ఫీల్ అయ్యాను గానీ, నాకు సీట్ రానిదే మంచిదయ్యిందని ఇప్పుడు అనిపిస్తుంది. నేను విద్యార్థులకు చెప్పేది ఏమంటే మీరు అనుకున్నది ఏదైనా జరగకుంటే తెగ గింజుకోకండి. అంతకంటే ఉన్నతమైనది ఏదో మన కోసం భవిష్యత్తులో కాచుకుని ఉంటుందని నమ్మండి. నేను నా జీవితం లో పోగొట్టుకున్నవి అన్నీ తిరిగి పొందాను. పొందినవి అన్నీ పోగొట్టుకోవడానికి అంతే సిద్దంగా ఉన్నాను.
- నాకు ఇలా పీజీ సీట్ రాకపోవడం తో నేను హైదరాబాద్ లో అశోక్ నగర్ లో ఉన్న RC Reddy coaching center లో సివిల్ సర్వీసెస్ కోచింగ్ లో చేరిపోయాను. ( దీని గురించి మీరు 'నా కోరా రాతలు' పుస్తకం లో చదవచ్చు) . ఈ కోచింగ్ నా జీవితం లో ఒక మేలి మలుపు.
మరో పోస్టింగ్ లో ఇంకో ముచ్చటను పంచుకుందాం.
ప్రలోభాలకు గురైన సన్నివేశాలను మరోసారి ప్రస్తావిస్తాను.


Very interesting memories sir. As usual your writing never disappoints.
ReplyDelete