నా మజిలీలు 

గ్రహచారమో, గోచారమో నాకు తెలియదుగానీ పుట్టినప్పటినుంచి నేను ఒక చోట స్థిరంగా ఉండలేదు. నాన్న కు ఉద్యోగరీత్యా రెండేళ్లకు ఒక బదిలీ ఉండేది కాబట్టి నేను చదువుకునే సమయంలో చాలా ఊర్లు మారవలసి వచ్చింది. అలాగే నేను ఉద్యోగించే సమయంలో కూడా చాలా చోట్లకు బదిలీ మీద వెళ్లాను. అలా అని నేను ఎప్పుడూ ఖండాంతరాలు దాటి ప్రయాణించలేదు. అనంతపురం, చిత్తూరు మరియు కడప జిల్లాలకు నా మజిలీలు పరిమితం అయ్యాయి. ప్రతి మజిలీ నాలో అనేక మార్పులను తీసుకొచ్చింది. ప్రతి మజిలీ నాకు ఎన్నో అనుభవాలను పంచి పెట్టింది. ప్రతి చోట నన్ను నేను మార్చుకోవడమో లేక ఇతరులను ఏమార్చడమో జరిగింది. ఎక్కడికక్కడ నా వ్యక్తిత్వం లో సర్దుబాటు చేసుకున్నాను. నాన్న బదిలీల వలన నాకు Change management కొద్దివరకు అలవాటు అయిపోయింది. నాలోనికి నావి కానివి ఇప్పటికి చాలానే ప్రవేశించి ఉంటాయి. అసలు ఇప్పుడు నాదంటూ ఏమైనా నాలో ఉందా అనేది నాకున్న పెద్ద సందేహం. నేను నా అభిప్రాయాలను మార్చుకోవడానికి సర్వదా సిద్దంగా ఉంటాను. ఒక విషయం ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాను. "I never die for my opinions, who knows I may be wrong". 

అనంతపురం నా మొదటి మజిలీ. అనంతపురం లో మేము మార్చినన్ని ఇళ్లు పిల్లి కూడా మార్చి ఉండదు. సొంత ఇల్లు లేకపోవడం వలన వచ్చిన తిప్పలు ఇవి. అప్పట్లో ఒక ఇల్లు అంటూ చేసుకోవాలని ఎందుకో మా పెద్దలకు ఆలోచన రాలేదు. అసలు ప్లాట్ తీసుకోవాలనే ఆలోచన కూడా రాలేదు వాళ్లకు. దానికి కారణాలు ఆర్థికం అయి ఉండొచ్చు.. దైవికం అయి ఉండొచ్చు. మరో కారణం నాన్న బ్యాంక్ ఉద్యోగి కావడం వలన ఇళ్లను లీజ్ కు ఇచ్చేవారు. ఒక స్థాయి దాటిన తరువాత ఫర్నీచర్ తో పాటుగా లీజ్ కు ఇవ్వడం మొదలెట్టారు. కాబట్టి స్వంత గూడు చేసుకోవాలన్న ఆలోచన కలిగి ఉండకపోవచ్చు. 

అలా అనంతపురం లో నా బాల్యం నుంచి రామ్ నగర్, రెవెన్యూ కాలనీ, RK నగర్, కోవూర్ నగర్ , వేణుగోపాల్ నగర్, మూడో రోడ్డు, తపోవనం ఇలా అనేక చోట్ల నివాసం ఉన్నాము. ఒక రామ్ నగర్ లోనే నాలుగు ఇళ్లు నేను నాలుగో తరగతి చదివే లోపల మారాము. అప్పట్లో రామ్ నగర్ పరమ ప్రశాంతంగా ఉండేది. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య వచ్చేది. మేము ఇళ్లు మారడానికి వాస్తు కారణం అనుకునేరు. అలాంటి చాదస్తాలు అదృష్టం కొద్దీ మా కుటుంబంలో ఎవరికీ లేవు. నాకైతే ఇప్పటికీ ఏ దిక్కు ఎక్కడుందో కూడా తెలియదు. నాది ఎప్పటికీ ఓ దిక్కు తోచని స్థితి లెండి. 

ఇన్ని ఇళ్లు మారిన మాకు ఎన్ని పరిచయాలు అయి ఉంటాయో ఊహించుకోండి.  ఒకటవ తరగతి నుండి నాల్గవ తరగతి వరకు నా బాల్యం రామ్ నగర్ లో గడిచింది. ఇంట్లో మూడు తరాలు.....ఆ  తరాల మధ్య అంతరాలు ఉండేవి. నా బాల్యం అంతా అజ్ఞానం లో గడిచిపోయింది. చాలా బాలారిష్టాలు దాటేశాను. నేను చూసిన మొదటి చావు మా ముత్తాత గారిది. ఆయన చనిపోయినాడు అని తెలిసిన తరువాత నా చిట్టి బుర్రకు వచ్చిన ఆలోచన ఆయన మంచం మీద ఇక మీదట  నేను పండుకోవచ్చని. ఆ విషయమే నిర్ధారించుకోవడానికి మా అమ్మను రెట్టించిన ఉత్సాహం తో అడగడం, ఆమె నా నోరు నొక్కేయడం జరిగిపోయింది. తరువాత కాలంలో ఆ మంచం మీద ఎవరు పండుకున్నారో కూడా గుర్తుకులేదు. కానీ చాలా ఏళ్ల తరువాత నేను పీజీ చేసే సమయం లో ఆ మంచం మా పెద్ద తాత గారి ఇంట్లో చెక్కు చెదరని నగిషీలతో దర్శనం ఇచ్చింది. ఇప్పుడు మరి ఆ  హంస తూలిక ఎక్కడుందో నాకు తెలియదు. 

మా ఇంట్లో అప్పట్లో ఒక ఈజీ చైర్ ఉండేది. దానికి ఒక కర్ర ఉండేది. ఆ కర్ర తీసేస్తే దాని మీద పండుకున్న వాళ్లు ధబ్బు మని కింద పడతారు. నేనోసారి నా బాల్య చేష్ట లో భాగంగా ఆ కర్ర తీసేసి, ఎవరు పడతారా అని తలుపు చాటున నిలబడి తొంగి చూస్తూ ఉన్నాను. అప్పుడే అక్కడో, ఇక్కడో, ఎక్కడో తన ఆటలు ముగించుకుని మా బావ గాడు ( అత్త కొడుకు ) లోపలికి వస్తూ కనిపించాడు. వాడు స్కూల్ లో నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటూ వుండేవాడు. వాడిని పడదోయాలనే కాంక్ష నాకు అంతరాంతరాలలో బలంగా ఉన్నట్టే ఉంది. ఇక మన బావ గాడు పడడం గ్యారెంటీ అనుకున్నాను. వాడు తీరా దగ్గరకు వచ్చి ఆ ఈజీ చైర్ లో కూచునే సమయానికి మా అత్త పిలవడంతో , వాడు దానిలో కూచోకనే తుర్రుమని ఉడాయించాడు. అనుకున్నామని జరగవు అన్నీ అని వాడు అలా నిరూపించాడు. కానీ అనుకోలేదని ఆగవు కొన్నీ అన్నట్టుగా మా పాటీ ( అవ్వ ) ఈజీ చైర్ వైపు వస్తూ నాకు కనిపించింది. హతోస్మి అనుకున్నాను. మా పాటి జగడం లో ఘనాపాటి. మడిశాలు పద్దతి లో చీర కట్టేది. సాంప్రదాయాల పేరుతో అప్పటికే మా ఇంట్లో పెద్దలు ఆమెను చితక్కొట్టారు. ఆమెకు లోకం మీద పెను కోపం ఉండేది. ఆమె పేరు రాజ్యలక్ష్మి. అలాంటి ఆమె పరమ రాజసంతో ఆ సమయంలో ఆ ఈజీ చైర్ వైపు ఎందుకు వస్తోందో నాకు తెలియలేదు. ఏమి చేయాలో తోచక నేను తలుపు చాటు నుంచీ సాక్షీ భూతంగా నిలుచుండి పోయాను. మా పాటీ రావడం, ఆ ఈజీ చైర్ లో కూచోవడం, ధబ్ మని పడడం క్షణాలలో జరిగిపోయింది. పడుతూ ఆమె ఒక వెర్రి కేక వేయడం, ఆమె కుయ్యాలించి మా తాత సంధ్యావందనం వదిలేసి ఆమె వద్దకు రావడం జరిగింది. అప్పుడు వారిద్దరికీ జరిగిన వాద, ప్రతి వాదాలలో మార్పిడి, చేర్పిడి అయిన సంస్కృత మరియు అపభ్రంశ పదాలనన్నీ నేను కూర్చగలిగి ఉంటే ఒక పద కోశం అవలీలగా తయారయ్యేది. ఇలా మా పితామహి, పితామహులు నా భాషా పరిజ్ఞానాన్ని మరింత సుసంపన్నం చేసారని చెప్పొచ్చు. ఆ ఘట్టం అలా ఎలాగో ముగిసిపోయింది కానీ, నా లాగే ఈ సన్నివేశాన్ని మొత్తం తిలకించిన మా బావ గాడు తదనంతర కాలం లో , ఆ ఈజీ చైర్ నుంచి కర్రను అనేక సార్లు తొలగిస్తూ రావడంతో చాలా మంది నడుములు విరిగాయి. 

ఇంకో సారి నేను ఒక ఉత్పాతాన్ని తీసుకొచ్చాను. మా ఓనర్ కూతురు తలను గేట్ సందులో ఇరికించాను. ఆ అమ్మాయి పేరు చెప్పను గానీ, ఆ తల తీయడం చాలా మంది పెద్దలకు తలకు మించిన పనై కూచుంది. చివరికి ఎలాగో ఒకలా ఆ అమ్మాయి శిరస్సుకు కవాటపు సందుల నుంచి విముక్తిని ప్రసాదించిన తరువాత సదరు ఇంటి యజమానులు మేము ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేయాలని ప్రతిపాదించడం తో మేము మరో ఇంటికి తట్టా బుట్టా సర్దుకోవలసి వచ్చింది. మేము అలా మారిన ఇంటికి గేట్ లేకుండా మా వాళ్లు తగు జాగ్రత్త తీసుకున్నారు లెండి. 

ఈ మరో ఇంటిలో మేము చేరిన కొద్ది కాలానికి ఎవడో ఒక పాంథుడు మా నాన్నకు కనపడి 'మీరు చేరిన ఇంట్లో దయ్యం ఉంది' అని చెప్పాడు. ఆ మాట విన్న నాకు అప్పటికే మూత్రాశయ సంవరణీ కండరం వదులైనంత పనయ్యింది. మా బావ గాడు తెలివిగా హనుమాన్ చాలీసా నేర్చుకోవడం మరుసటి రోజు నుంచే మొదలెట్టాడు. ఇలా నాకు, మా బావకు మంత్రోపాసన అలవాటయ్యింది. మంత్రాలకు శక్తులుంటాయో లేదో తెలియదు గానీ, వీటిని సంపుటీకరణం చేయడం వలన నాకు వాగాడంబరం బాగా అబ్బింది. మా ఇంట్లో వాళ్ల దెబ్బకు , దయ్యం వేరే ఇల్లు చూసుకున్నట్టు ఉంది. మాకెప్పుడూ ఆ ఇంట్లో ఎలాంటి ప్రేత శరీరాలు కనిపించలేదు. 

ఇన్ని ఇళ్లు మారిన నాకు తెలిసింది ఏమంటే ప్రతి ఇంట్లో , ప్రతి ఒక్కరి ఒంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య లేని కొంప లేదు. సమస్య వచ్చింది కదా అని కొంపలు మారుస్తూ పోతే, ఊర్లో ఉన్న కొంపలన్నీ కూడా మనకు సరిపోవు. 

అనంతపురం నుంచి నేను ఐదవ తరగతి లో ఉండగా నాన్నకు కదిరికి బదిలీ అయ్యింది. కదిరిలో మాత్రం మేము ఆ రెండేళ్ళు ఒకే ఇంటిలో ఉన్నాము. ఇంటి ఓనర్ పద్మాక్షమ్మ నిస్సంతు. నన్ను బాగా చూసుకునేది. కంటేనే బిడ్డలా, అనుకుంటే కూడా బిడ్డలే అనే ధోరణి ఆమెది. పద్మాక్షమ్మ భర్త శ్రీనివాస శాస్త్రి. ఆయన హార్మోనియం వాయించేవాడు. దానిని నేను బాల్య చాపల్యం తో  వాయించడం మొదలెట్టడంతో, ఆయనకు వేరే దారిలేక దానిని అమ్మేశాడు. లేదంటే మీరు ఈరోజు ఒక హార్మోనియం విద్వాంసుడిని చూసేవాళ్లు. అలా ప్రపంచం ఒక మంచి హార్మోనిస్ట్ ను కోల్పోయింది. కదిరి నరసింహ స్వామి గుడికి మేము తరచూ వెళ్లేవాళ్లం. అలా దైవం తో నా అనుబంధం కాస్తా బలపడుతూ వచ్చింది. కదిరి స్కూల్ లో నా సహపాఠి  అయిన సలీం ప్రస్తుతం కడప మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాడు. కదిరిలో అప్పట్లో నీటికి కట కటగా ఉండేది. మేము తరువాత ఆ ఊరు వదిలేసినా కూడా ఇప్పటికీ నరసింహ స్వామి దర్శనానికి వెళుతూనే ఉంటాము. 

నేను ఏడో తరగతి కి వచ్చే సమయానికి నాన్నకు ఉరవకొండకు బదిలీ అయ్యింది. 9 వ తరగతి వరకు ఆ ఊర్లోనే ఉన్నాము. విచిత్రంగా మేము ఉన్న ఇంట్లో అర్ధరాత్రి దాటిన తరువాత పెద్ద రుబ్బు రోలు దొర్లుతూ వెళ్ళిన శబ్దం ప్రతి రోజూ వచ్చేది. ఆ శబ్దానికి ప్రతి రోజు రాత్రి నాకు మెలుకువ వచ్చేది. ఇంట్లో చాలా మంది జనం ఉండేవాళ్లు కాబట్టి నేను ధైర్యంగానే ఉండేవాడిని. తరువాత ఆ శబ్ధం ఆ వీధిలో ఏడు తలల తాయెమ్మ తిరగేటప్పుడు వస్తుందని మిత్రుల మాటల్లో తెలిసింది. దీనిలో నిజానిజాలు పక్కన పెట్టేస్తే , జీవితం థ్రిల్లింగా గడవాలంటే ఇలాంటి అతీత శక్తుల హల్ చల్ ఉండాలి. ఈ ఏడు తలల తాయమ్మ కు నా తల కూడా తగిలించి ఒక కథ రాసి 'టీ టైమ్ కథలు' పుస్తక రూపంలో అచ్చేసి వదిలాను. చదివి (అం) తరించగలరు. 

ఉరవకొండ నుంచి తాడిపత్రికి మకాం మార్చాం. ఇక్కడ నేను పదో తరగతి చదివిన వైనం గత పోస్ట్ లో ముచ్చటించాను. ఇంటర్ నుంచీ డిగ్రీ వరకు తిరిగి అయిదేళ్ళ పాటు అనంతపురం లోనే చదివాను. 

తరువాత కాలంలో తిరుపతి, రాయదుర్గం, హిందూపురం, చిన్న ఓరంపాడు, చవటగుంట, కల్యాణదుర్గం లాంటి ప్రదేశాలకు నా కార్య క్షేత్రం బదలాయించబడింది. ఒక్కోచోట ఒక్కో వింత అనుభవం నా కోసం ఎదురు చూసేది. 

సందర్భోచితంగా వాటిని నా భవిష్యత్ పోస్టింగ్ లో ప్రస్తావిస్తాను. 

ఇప్పటికే నా పోస్టింగ్స్ చదివిన మిత్రులు, స్టూడెంట్స్ 'మీ బ్లాగు బహు బాగు' అంటున్నారు. మీ కామెంట్స్ అన్నీ కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేస్తే నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 

Comments

  1. రచయిత సొంత గొంతు తో podcast చేస్తే ఈ మజిలీలు ఇంకా సొంపు గా ఉంటాయి.

    ReplyDelete
    Replies
    1. I will try to implement your suggestion madam. Thank you very much.

      Delete

  2. We are learning about your life with every post. Rivetting. Autobiography of GLN Prasad.

    Change is the essence of the life.

    One changes with the encounters of ones life.

    The significance of working at other places is one gets good experiences with life and people they surround with.

    Your storytelling is topnotch.

    One incident that you've quoted about supernatural moments at one house should've been dramatic. Use it as a plot to one of your futute stories.

    Yes, I second with my predecessor's thought of making your experience as a podcast given hour voice is not rasping but pleasing.

    Good piece.

    ReplyDelete
    Replies
    1. Million thanks. Your reviews as usual add value to my content.

      Delete
  3. నిజంగానే మీ బ్లాగు బహు బాగు sir. Very interesting to read. I wonder how could you remember each and every incident of your past! చమక్కు ల తో నిజంగా నే తరింప చేస్తున్నారు. ఏడు తలల తాయారామ్క కథ మిస్ అయినట్లున్నా

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog