తిరుపతి తో నా అనుబంధం
చిన్నప్పటి నుంచి మా కుటుంబానికి తిరుమల శ్రీవారి ని దర్శించడం రివాజు. ఇంచు మించు డిగ్రీ చదువుకునే వరకు నేను ఏదో ఒక రకంగా, ఎవరో ఒకరితో ఏడాదికి ఒకసారి చొప్పున శ్రీవారి దర్శనం చేసుకుని ఉంటాను. మా ఇలవేల్పు వెప్రగల్ నరసింహ స్వామి. దీనిని ఇప్పుడు విప్రమల అంటున్నారు. రాయదుర్గం దగ్గరగా ఉన్న క్షేత్రం ఇది. కానీ మాకు కదిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించడమే అనూచానంగా వస్తున్న ఆచారం. దానికి కారణాలు కదిరికి తగు మాత్రం రవాణా సౌకర్యాలు ఉండడం మరియు మేము కొద్ది కాలం కదిరిలో నివాసం ఉండడం కావొచ్చు. ఏది ఏమైనప్పటికి జన శృతి ప్రకారం నరసింహ స్వామి ఇంటి దైవం గా ఉన్నవారు తిరుపతికి దొంగలు అని అంటారు. బహుశా మా పూర్వీకులు వేంకట నాథునికి ఏదో మొక్కుకుని, తరువాత ఆ మొక్కును తీర్చకుండా ఎగరకొట్టి ఉండవొచ్చు. దాని వలన తిరుపతి దొంగలు గా మాకు ఆ మచ్చ వచ్చి ఉండవచ్చు. ఇలా తిరుపతి దొంగలుగా ముద్ర పడినవారు తిరుమలకు వెళ్లరాదని, ఒక వేళ వెళ్ళినా కూడా ఇతరుల డబ్బుతో వెళ్లాలని చెప్పేవారు. ఇలాంటి నమ్మకాలనన్నిటినీ తోసిపుచ్చి, మా నాన్న నన్ను చాలా సార్లు తిరుమలకు తీసుకువెళ్లారు. ఇలా పిలుచుకు పోయినప్పుడల్లా నాకు గుండు గీయించేవారు. అప్పట్లో తల మనదే అయినా, దాని మీద మన పెత్తనం చెల్లుబాటు అయ్యేది కాదు మరి. పదో తరగతి లో మాత్రం నన్ను లెక్కల్లో ముప్పై ఆరు మార్కులతో గట్టెక్కిచ్చినందుకు స్వచ్ఛందంగా వెళ్లి గుండు గీయించుకున్నాను. ఇంటర్ రెండో ఏడాది లో మళ్లీ ఇలానే స్వచ్ఛందంగా కేశ ఖండన చేయించుకున్నాను.
అప్పట్లో తిరుమల మాడ వీధులలో ఉన్న మఠాలలో అద్దెకు గదులు ఇచ్చేవారు. మేము స్వీయ సంప్రదాయాన్ని అనుసరించి ఆ మాడ వీధుల్లో ఉన్న పరకాల మఠంలో గానీ లేదా అహోబిల మఠంలో గానీ గదులు అద్దెకు తీసుకునేవాళ్ళం. ఒకటి లేదా రెండు రోజులు ఇలా తిరుమలలో ఉండి మఠం స్నానం, దేవాలయ ప్రసాదం తో సర్దుకునే వాళ్లం. అప్పుడు తిరుమల గుడిలో ప్రసాదాలు అమ్మేవారు. మిరియాలు వేసిన లావుపాటి దోసె కూడా అమ్మేవారు. ఈ దోసెకు చెట్నీ కావాలని నేను మొండికేసే వాడిని. నాకు సర్ది చెప్పడానికి మా నాన్నకు తల ప్రాణం తోకకు వచ్చేది. మా తిరుమల దర్శనం అయిన తరువాత దిగువ తిరుపతికి వచ్చి మా పెద్ద తాత ఇంట్లో మరో రెండు రోజులు ఉండి చుట్టూ ముట్టుతా ఉన్న క్షేత్రాలను చూసేవాళ్లం. ఎక్కడా కూడా హోటల్లో టిఫినీలు ఇప్పించేవారు కాదు. ప్రసాదాల తోనే కడుపు నిండిపోయేది. శ్రీనివాస మంగాపురం మరియు తిరుచానూర్ గుళ్లను ఖచ్చితంగా దర్శించుకునే వాళ్లం. నేను మొదటి సారి కొండకు నడిచి పదవ తరగతిలో ఉండగా వెళ్లాను. ఇలా తిరుపతిలో స్థిరపడడానికి ముందే నేను శ్రీవారిని ఒక ముప్పై సార్లు దర్శించి ఉంటాను.
నేను డిగ్రీ పూర్తీ చేసుకునే సమయానికి 1991 లో నాన్నకు తిరుపతి బదిలీ అయ్యింది. భవానీ నగర్ లో ఒక ఇంట్లో ఒక నెలపాటు అద్దెకు ఉన్నాము. తరువాత రాంచరణ్ దాస్ కాలనీ కి వెళ్లాము. అక్కడ ఇంటిగల్లావిడతో గిల్లి కజ్జాలు పెట్టుకుని కపిలతీర్థం రోడ్డులో ఉన్న ద్వారకానగర్ లోని ఇంటికి మారాము. ఆ ఇల్లు ఆ కాలం లోనే మహా వైభవంగా ఉండేది. ఇంట్లో బ్యాంక్ వారు ఇచ్చిన ఫర్నీచర్ ఉండేది. నాన్న రేణిగుంట మార్గం లో ఉన్నశెట్టిపల్లి స్టేట్ బ్యాంక్ లో పనిచేసేవారు. తరువాత రెండు ఏళ్లకి TTD Administrative Office లో ఉన్న స్టేట్ బ్యాంక్ శాఖకు బదిలీ అయ్యింది. 1992 లో నేను వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లో పీజీ చేరడంతో తిరుమల శ్రీవారితో నా అనుబంధం బలపడుతూ వచ్చింది. నాకు ఒకసారి శ్రీవారి అభిషేకం చూసే అవకాశం వచ్చింది. మా తాతతో వెళ్లాను. ఒక గంట పాటు ధృవ బేరానికి చేసిన ఆ అభిషేకం నా జీవితంలో నేను చూసిన మహత్తర ఘట్టంగా ఇప్పటికీ భావిస్తాను. చెక్క స్టూల్స్ అధిరోహించి పూజారులు అభిషేకం చేయడం ఇప్పటికీ నాకు గుర్తుకు ఉంది. అప్పట్లో శ్రీవారిని మొదటి గడప అయిన కులశేఖర పడి నుంచి దర్శించుకునే అవకాశం నాలాంటి సామాన్య భక్తులకు కూడా వుండేది. నేను మంగళవారాలు చాలా సార్లు శ్రీవారి దర్శనం చేసుకున్నాను. తలుచుకున్నప్పుడల్లా వెళ్లిపోయేవాడిని. సుదర్శనం టోకెన్ పద్దతి అప్పుడు లేదు.
1992- 94 మధ్య కాలం లో మా ఇంటికి దర్శనార్థం ఎవరు వచ్చినా కూడా వారి వెంట తగులుకుని నేనూ వెళ్లిపోయేవాడిని. స్వామి వారి ఆర్జిత సేవలన్నిటినీ ఇంచు మించు చూసే మహత్తర అవకాశం నాకు లభించింది. పీజీ తరువాత GATE పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినందుకు కృతజ్ఞత గా గుండు కొట్టించాను. నా గుండును అప్పుడు అద్దం లో చూసుకుని జడుసుకున్నాను. అది నాకు తలలా అనిపించలేదు. బస్ హారన్ లాగా అనిపించింది. నా గుండును చూసిన సురేష్ వర ప్రసాద్ 'ఇక మీదట ఎప్పుడూ గుండు చేయించుకోకు రా!!!! చూడలేక చస్తున్నాను!!!' అనడంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గుండు ఊసే ఎత్తలేదు. 1995 లో నాన్నకు రాయదుర్గం బదిలీ అయినప్పటికీ, నేను PhD చేరడంతో F Block లో ఒక ఏడాది పైగా ఇంటి వారికి దూరంగా ప్రవాసంలో గడిపాను.
మళ్ళా తిరిగి నాన్నకు 1999 లో తిరుపతి కి బదిలీ అయ్యింది. ఖాదీ కాలనీ లో మరో అద్దె కొంపలో నివాసం ఉన్నాము. అక్కడ దొంగల పోటు అధికంగా ఉండేది. చివరకు 2000 సంవత్సరం లో ద్వారకా నగర్ లో సొంత ఫ్లాట్ తీసేసుకున్నాము. అప్పటి నుంచి 2010 వరకు తిరుపతిలో ఉండిపోయాము. నాకు చిన్న ఓరంపాడు లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ అక్కడ కాపురం పెట్టలేదు. ప్రతి రోజు ఇంటర్ సిటీ రైలు లో కాలేజీ కి పోయి వచ్చేవాడిని. తరువాత చవటగుంట లో ఉద్యోగం చేసేటప్పుడు కూడా మోటార్ సైకిల్ లో కాలేజీ కి వెళ్లేవాడిని. నాతో పాటు కమలాకర్ సర్ వచ్చేవారు. కమలాకర్ సర్ కరోనా సమయంలో కాలం చేసారు.
రెండో విడత నేను తిరుపతిలో నివాసం ఉన్న సమయం లో తిరుపతి చుట్టూ ఉన్న గుళ్లు, గోపురాలు అన్నీ చూసేసాను. 2010 పూర్తయ్యేసరికి శ్రీవారిని 420 సార్లు చూసేసాను. తిరుమల చరిత్ర గురించి చాలా పుస్తకాలు చదివాను. ఆలయ దర్శనం వారి బస్ లో చాలా ప్రదేశాలు చూసాను. శ్రీవారికి రెండు సార్లు పొర్లు దండాలు పెట్టాను. శాత్త మురై సేవ లో జియ్యంగార్ తో పాటుగా శ్రీవారిని ఒక ఇరవై సార్లు అతి దగ్గర నుంచి దర్శించి ఉంటాను.
రెండవ విడత లో తిరుపతికి వచ్చిన తరువాత మేము ద్వారకా నగర్ లో అనుకోకుండా, దైవికంగా ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. అప్పటికే మా పెద్ద తాత గారికి ఖాదీ కాలనీ లో మూడు పోర్షన్లు గల ఇల్లు ఉండేది. మా పెద్ద పాటీ ( పెద్ద అవ్వ ) నాకు చిన్నప్పుడే ఇంట్లో ice cream చేసి ఇచ్చేది. మా పెద్ద తాత గారు రైల్వే లో పనిచేసి పదవీ విరమణ చేసిన తరువాత తిరుపతి లో స్థిరపడ్డారు. పదవీ విరమణ చేసిన తరువాత కూడా గాంధీ పీస్ ఫౌండేషన్ అనే సంస్థలో పనిచేసేవారు. దాని వివరాలు తెలుసుకునే ప్రయత్నం నేను ఎప్పుడూ చేయలేదు.
మా సొంత ఫ్లాట్ పోర్టికోలో కూచుని చూస్తే కపిల తీర్థం జలపాతం, మాల్వాడీ గుండం జలపాతం కనిపించేవి. ఈ రెండూ కూడా rain fed water falls అంటే వర్షాధార జలపాతాలు. నేను తిరుపతి లో చదువుకునే రోజుల్లోనే ISCON దేవాలయం ఉండేది. ఆ వీధిని హరే కృష్ణ రోడ్డు అనే వారు. ఆ కృష్ణ మందిరానికి దగ్గరలోనే అలిపిరి బస్ స్టాండ్ ఉంది.
కపిల తీర్థానికి నేను మా బంధువులను పిలుచుకుపోయేవాడిని. ఆ దేవాలయం లో నైవేద్యం సమయం లో మోగించే ఢమరుక నాదం నాకు చాలా ఇష్టం. కోనేరును అనుకుని సంధ్యావందన మంటపాలు ఉన్నాయి. అవి ఈ రోజుటికీ చెక్కు చెదరలేదు. నేను ఉపనయనం తరువాత బాల్యం లో కొద్ది కాలం సంధ్య వార్చాను. తరువాత దాని మీద మనసు లగ్నం కాలేదు. ఎవరో కవి అన్నట్టు నా భుజం మీద యజ్ఞోపవీతం ఒక అవశేషంగా మిగిలింది అంతే. కపిల తీర్థం లో శివుడికి చేసే అన్నాభిషేకం విశేషమైనది. చూసే అవకాశం వస్తే వదలకండి. మేము తిరుపతికి వచ్చిన కొత్తలో తుఫాను వల్ల కపిలతీర్థం ఉధృతంగా ప్రవహించింది. ఆ జలపాతం కింద నిలబడి స్నానిస్తున్న ఒక భక్తుడి మీద అజగరం పడడం, అది వార్తల్లో రావడం నాకింకా గుర్తు.
తిరుపతి లో ఉన్న గుళ్లల్లో నేను తరచూ దర్శించేవి గోవింద రాజ స్వామి గుడి మరియు కోదండ రామ స్వామి గుడి. కోదండ రామ స్వామి గుడి దగ్గరగా గోవింద రాజ స్వామి కళాశాల హాస్టల్ ఉండేది. ఆ స్టూడెంట్స్ అంతా కూడా కోదండ రామాలయ ప్రాంగణంలో చదువుకునే వారు. ఈ రామాలయం లో మళహోర ప్రసాదం దొన్నెల్లో ఇచ్చేవారు. చాలా రుచికరంగా ఉండేది.
నాకు పొద్దు పోనప్పుడల్లా గోవింద రాజ స్వామి గుడికి వెళ్లేవాడిని. చిదంబరం లో రెండవ కుళోత్తుంగ చోళుడు గోవింద రాజ స్వామి విగ్రహాన్ని సముద్రం పడవేయిస్తే, దానికి నకలుగా ఈ గుడి కట్టారు అని చరిత్ర. సత్యాసత్యాలు శివ కేశవులకు ఎరుక. నాకు ప్రసాదాలతో పని గానీ, ప్రమాణాలతో కాదు కదా!!!!. ఇటీవల కాలం లో నేను చదివిన తిరుపతి కథలు అనే పుస్తకం లో ఈ గుడి చరిత్ర గురించిన వివరాలు చాలా ఉన్నాయి. పేట శ్రీ రాసిన ఈ తిరుపతి కథలు ఆద్యంతం ఆసక్తికరమైన కథనాలతో సాగుతుంది. వీలైతే చదవండి.
మంచి నీటి కుంట వద్ద ఉన్న శివాలయాన్ని కూడా నేను PhD వెలగబెట్టే రోజుల్లో తరచూ దర్శించుకునే వాడిని. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ శివాలయం.
తిరుచానూర్ కు ఎన్ని సార్లు వెళ్లానో లెక్కే లేదు. తిరుచానూర్ లో సూర్య దేవాలయం కూడా దర్శించదగ్గది. నాకు తెలిసిన ఒక ఎయిడెడ్ కాలేజీ ప్రిన్సిపల్ సూర్యోపాసన చేసేవాడు. ఆయనను నేను అక్కడికి ఒక సారి పిలుచుకు వెళ్లాను. ఈ తిరుచానూర్ నే అలివేలు మంగాపురం అని కూడా అంటారు. దీని దగ్గర యోగిమల్లారం అనే గ్రామంలోని శివాలయానికి కూడా వెళ్లాను. గుడి మల్లం లోని పురాతన పరశు రామేశ్వర స్వామి దేవాలయానికి తిరుపతి లో స్థిరపడిన చాలా కాలానికి, ఉద్యోగం లో చేరిన తరువాత వెళ్లాను. ఇది రేణిగుంట వద్ద ఉన్న పాపా నాయుడి పేట దగ్గర ఉంది. ఈ దేవాలయ వాస్తు కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
తిరుపతి నుంచి అనంతపురం వెళ్లే దారిలో శ్రీనివాస మంగాపురం ఉంది. దీనిని నేను అనేక సార్లు చూసి ఉంటాను. ఇక్కడ కూడా కొన్ని ఆర్జిత సేవలు చేయించాను. ఇక్కడికి దగ్గరలోనే శ్రీవారి మెట్లు అని పిలవబడుతున్న నడక మార్గం ఉంది. ఈ మార్గం లో నేను ఇంతవరకు నడిచి వెళ్లలేదు. అదొక కొరతగా మిగిలిపోయింది. ఈ శ్రీనివాస మంగాపురాన్ని సిద్దకుట్టి పేరుతో పిలిచే వారని పేటా శ్రీ రాసారు.
నేను చిత్తూర్ లో పని చేసేటప్పుడు వేపంజేరి గ్రామం లోని పురాతన లక్ష్మీ నారాయణ స్వామి వారి గుడి చూసాను. అక్కడకు సుదర్శనోపాసన తెలిసిన ఒక పురోహితుడు తిరుపతి నుంచి వచ్చేవారు. ఒక సారి వేపంజేరి ఆలయానికి మిత్రులతో వెళ్లినప్పుడు ఆకలి మీద ఉండడం తో ఒక కారియర్ నిండుగా ఉన్న ప్రసాదాన్ని పూజారిని అడిగి తీసుకుని, మిత్రులకు కూడా ఇవ్వకుండా తినేసాను. చిత్తూర్ లో ఉండగానే వేలూర్ లోని జలకంఠేశ్వర స్వామి గుడి కూడా చూసి వచ్చాను.
తిరుపతి లో ఉండగానే నా వివాహం కావడం, ముహూర్తం రోజే మా పితమహులు కాలం చేయడం, కానీ నా పెళ్లి జరిపించేయడం లాంటివి జరిగాయి. వివాహం సమయానికి నాకు చిత్తూర్ విజ్ఞాన సుధ కాలేజీ లో మంచి జీత భత్యాలు గల కొలువు రావడంతో బాగానే తిరిగేవాడిని. అధ్యాపక వృత్తిలో ఉన్న కిక్ నాకు ఈ కాలేజీలో ఉన్నప్పుడే తెలిసింది. కాణిపాకం కూడా ఒకటి రెండు సార్లు చూసాను. వేలూరు వద్ద రత్న గిరి లో ఉన్న స్కంధుడి గుడి కూడా చూసాను. చిత్తూర్ నుంచి తిరుత్తణి మార్గం లో ఉన్న తంగాల్ లో మౌన గురు స్వామి ఆశ్రమం ఉంది. అక్కడే నేను తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న శ్రీనివాసుడి పంచ లోహ ప్రతిమ చూసాను. ఇక్కడికి దగ్గరగా ఉన్న పొన్నయి ( Ponnai ) లో నవగ్రహ వృక్షాలు మరియు వలపురి వినాయకుడి గుడి చూసాను.
తిరుపతి నుంచి తిరుత్తణికి, షోలంగేర్ కు అనేక సార్లు వెళ్లాను. షోలంగేర్ ను మా తాత గారు ఘటికా చలం అని పిలిచేవారు. ఓడ్యాణ బంధం లో కూచున్న యోగా నరసింహ స్వామి ఇక్కడ వెలసిన దైవం. ఇటీవలనే ఏదో పుస్తకం లో విష్ణు విగ్రహాలు యోగ, భోగ మరియు వీర రూపాలలో ఉంటాయని చదివాను. షోలంగేర్ లో దధ్యోదన ప్రసాదం తింత్రిణీ పచ్చడి తో పాటుగా భుజించాను. ఆడి మాసం లో తిరుత్తణి వైభవం చూసి తీరాల్సిందే గానీ చెప్పనలవి కాదు.
తిరుపతి దగ్గర ఉన్న అప్పలాయ గుంట లో ఉన్న శ్రీనివాసుడి గుడి ఒక ఐదు సార్లు చూసి ఉంటాను. ఒక సారి స్కూటర్ లో వెళ్లాను. తీరా అక్కడికి వెళ్ళిన తరువాత నా స్కూటర్ పంక్చర్ అయ్యింది. అయ్యో.. అప్పుడు నేను పడిన తిప్పలు తిరుపతి తిమ్మప్పకు ఎరుక. అంతలో ఒక పంక్చర్ స్పెషలిస్ట్ దానిని బాగు చేసాడు. అతను నాకు ఆ రోజు మా తిరుపతి తిమ్మప్పకు సైదోడు గా అ(క)నిపించాడు.
నారాయణ వరం మరియు నాగలాపురం లో ఉన్న గుడులను అనేక సార్లు చూసాను. నారాయణవరం వెళితే శ్రీనివాసుడి గుడి వద్దే ఉన్న సొరకాయల తాత సమాధిని దర్శించడం మరువకండి. ఇక్కడికి దగ్గరగా పద్మావతమ్మ కుల దైవం అవనాక్షమ్మ గుడి ఉందని పేటా శ్రీ గారు రాసిన పుస్తకం లో చదివాను. ఈ గుడిని భవిష్యత్తు లో ఎప్పుడో ఒకప్పుడు చూసి తీరాలి. కార్వేటి నగరం లో ఉన్న వేణుగోపాల స్వామి మందిరాన్ని ఒక ఐదు సార్లు దర్శించి ఉంటాను. కార్వేటి నగరం దగ్గర ఉన్న చవట గుంట లో నేను పనిచేసాను. కార్వేటి నగరం లో ఉన్న పుష్కరిణిని అందరూ చూసి తీరాల్సిందే.
సురుటు పల్లి లో ఉన్న పళ్లి కొండేశ్వర స్వామిని రెండు సార్లు చూసి ఉంటాను. ఇక్కడ పరమ శివుడు హాలాహాల భక్షణానంతరం అలసి సొలసి ఉన్న భంగిమ లో కనిపిస్తాడు. ప్రతిమ రూపంలో, శయన భంగిమ లో కనిపిస్తాడు. సాధారణంగా విష్ణువు స్థానక, ఆసన మరియు శయన భంగిమలలో అనేక ఆలయాలలో దర్శనం ఇస్తాడు. కానీ ఇక్కడ ఈ సురుటు పల్లి లో శివుడు శయన రూపంలో ఉండడం విశేషం. ఇదే దేవాలయం లోనే కుడ్య మూర్తిగా దాంపత్య దక్షిణా మూర్తి దర్శనం ఇస్తాడు. దాంపత్య సమస్యలు ఉన్నవారు ఈ మూర్తిని దర్శిస్తే మంచిది అంటారు. ప్రయత్నం చేసి చూస్తే తప్పేంటి?????. నిజానికి పరస్పర భిన్న రుచులు ఉన్న శివ కుటుంబాన్ని అర్థం చేసుకుంటే, చాలా దాంపత్య సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ దాంపత్య దక్షిణా మూర్తి అమ్మవారిని ఆలింగనం చేసుకున్న భంగిమ లో దర్శనం ఇస్తాడు. ఇలా పరస్పర అనురాగ బద్దులైన దంపతులకు సమస్యలు ఏమి వస్తాయి??
కాళహస్తికి నేను తరచుగా వెళ్లేవాడిని. ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతకం నాకు కంఠోపాఠం. ఆ శతకం చదువుతున్నప్పుడే రాజులను అంటే అధికారులను ఆశ్రయించకూడదని నిశ్చయించుకున్నాను. 'రాజుల్ మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు' అని తెలుసుకున్నాను. నేను కాళహస్తి లో జ్ఞాన ప్రసూనాంబ ఎదురుగా నిలబడి విష్ణు సహస్ర నామ పారాయణ చేసేవాడిని. 'పుంరూపా విష్ణు విగ్రహ:' అని అమ్మవారు చెప్పినదే నాకు ప్రమాణం. ప్రమాణం మీ కోసం, ప్రసాదం నా కోసం.
చంద్రగిరి కోట చాలా సార్లు చూసాను. తొండవాడ అగస్తీశ్వర స్వామిని అనేక సార్లు దర్శించుకున్నాను. వాయల్పాడు రామాలయం చూసాను. దానికి దగ్గరగా ఉన్న తరిగొండ గ్రామం లోని నరసింహ ఆలయాన్ని అనేక సార్లు చూసాను.
కాంచీ పురం తృప్తిగా దర్శించుకున్నాను. ఒక కంచి క్షేత్రం లోనే 16 వరకు శ్రీ వైష్ణవ దివ్య దేశాలు ఉన్నాయి. అన్నిటినీ చూసాను. పృథ్వీ లింగాన్ని, కామాక్షి తాయిని చాలా సార్లు దర్శించాను. వరద రాజ స్వామి దర్శనం చేసాను.
తిరుపతి లో ఉన్న కాలం లో నా ఆధ్యాత్మిక సాధన ఇంత తీవ్రంగా సాగింది. తిరుపతి - తిరుమల చుట్టు పక్కల ఉన్న అనేక దేవాలయాలను వేలం వెర్రిగా నేను దర్శించేవాడిని. నన్ను చూడలేక ఈ ఆలయ మూర్తులకు మొఖం మొత్తినట్టుంది. పదోన్నతి రూపంలో నన్ను శ్రీనివాసుడు 2010 లో అనంతపురం జిల్లా కు పంపించి వేసాడు. 2010 నుంచి 2025 మధ్య కాలం లో నేను తిరుమల కేవలం రెండు సార్లు మాత్రమే వెళ్లగలిగాను. నా ఆధ్యాత్మిక సాధన కూడా కుంటుపడింది. తత్వం పోయి తర్కం తలకెక్కింది. మరలా ఏదో ఒక దివ్య ముహూర్తం లో ఆధ్యాత్మిక మార్గం పట్టి తీరతాను. అంత వరకు అంతర్యామి జ్ఞాపకాలతో సాధనను సరిపెట్టు కుంటాను.
అస్తు.. తథాస్తు
Excellent, I wish You come to Tirupati
ReplyDeleteధన్యవాదాలు మిత్రమా. నీవూ, నేను కలిసి చాలా ప్రదేశాలు చూసాము. నాకు ఇంకా అవి స్మృతి పథంలో ఉన్నాయి. కడప జిల్లా మొత్తం చుట్టబెట్టేసాము. దాని మీద మరోసారి రాస్తాను.
DeleteVery fortunate to read the story sir.your Writing is always mesmerizing. I think you have left no temple in and around TPT from visiting. U r blessed to visit Tirumala so many times.
ReplyDeleteఇంకా కొన్ని గుళ్లు మిగిలే ఉన్నాయి మేడం. ముఖ్యంగా కాళహస్తి దగ్గర ఉన్న తొండమనాడు చూడాలి. అవనాక్షమ్మ గుడి చూడాలి. శ్రీవారి మెట్ల మార్గం లో కొండ ఎక్కాలి. తుంబురు క్షేత్రం చూడడానికి ధైర్యం కూడగట్టుకోవాలి. తిరుమల లో చాలా తీర్థాలు ఉన్నాయి. దానిలో ఒకటి కుమార ధార. ట్రెక్కింగ్ వారితో కలిసి ప్రయాణించాలి. నాకు రిస్క్ తీసుకునే తత్వం లేకపోవడం వలన చాలా ప్రదేశాలు చూడలేక పోయాను. భవిష్యత్తు లో నా కోసం ఏ ప్రదేశాలు ఎదురుచూస్తున్నాయో ఎవరికి ఎరుక?
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteMeeting divine and connecting divine are two different things.
ReplyDeleteMeeting divine is a process of completing the said course
Connecting to divine is beyond all the objects of divinity.
The life should be divinizing in all dimensions.
This article defined how hunger for visiting temples result in meeting them (gods).
Good write up.
Hundreds of time visiting Tirupati is a great achievement. Keep it up.
Lastly, connecting to divine is always beyond any human effort.
Sadhana.... The meditation is a real bliss in its own essence.
To conclude... Meeting divine is different from connecting to divine.
Your review is more interesting than my travelogue
Delete