సంక్రాంతి ప్రయాణం - గాణగాపురం - అక్కలకోట సందర్శన
సంక్రాంతి పండగ ముగిసింది. ఈసారి కాలేజీకి చాలా సెలవులే ప్రకటించారు. ఎక్కడికైనా ప్రయాణించకుంటే సెలవులు వృధా అయిపోతాయనే ఆరాటం నాకు మొదలయ్యింది. ప్రతి సెలవులలో ఇంట్లో వారితోనో, బంధువులతోనో, మిత్రులతోనో ఎక్కడికో ఒకచోటికి ప్రయాణించడం నాకు రివాజు. నేను adventure tourism ను ఇష్టపడకపోవచ్చు గానీ, వినోదాత్మక మరియు ఆధ్యాత్మిక ప్రయాణాలు ఇష్టపడతాను. హిమాలయాల లాంటి వాటిని నేను ఇంతవరకు దర్శించక పోవడానికి కారణం నాకు రిస్క్ తీసుకునే మనస్తత్వం లేకపోవడమే. నేను సెలవులు వృధా అవుతాయేమో అని ఆలోచిస్తూ ఉండగానే, మిత్రులు ఫోన్ చేసి గాణగాపురం మరియు అక్కలకోట వెళదామా అని అడగడంతో వెంటనే సరే అనేసాను. 16 అర్ధరాత్రి 12.25కు హోసూర్ express లో బెర్త్ లను ముందస్తుగా రిజర్వ్ చేసుకున్నాము. అందరూ అనుకున్న సమాయనికి 'సంక్రాంతి వచ్చిందే తుమ్మెద!!! సరదాలు తెచ్చిందే తుమ్మెద!' అనుకుంటూ ఆనందంగా బయలుదేరాము. ఇక్కడ గాణగాపురం తో నాకున్న స్మృత్యనుబంధాన్ని చెప్పాలి.
1991లో డిగ్రీ చదువుకునే సమయంలో నేను గాణగాపురం పేరు మొదటిసారిగా విన్నాను. 1990 వ దశకంలో ఆంధ్రప్రదేశ్ లో షిర్డి సాయి ఆరాధనకు ఎక్కిరాల భరద్వాజ గారి వలన విశేషమైన ప్రాచుర్యం వచ్చింది. ప్రతి ఊరిలో షిర్డీ సాయి ఆలయాలు వెలిసాయి. గురువారానికి విశేషమైన ప్రాధాన్యత వచ్చేసింది. దత్త పారాయణ గురించి అప్పుడే మా ఇంటిల్లిపాదీ వినడం తటస్థించింది. నాథ సంప్రదాయం గురించి కూడా అప్పుడే నేను విన్నాను. అలా మేము దత్త సంప్రదాయం గురించి విన్న ఆ కాలంలో ఇసుకపల్లి సంజీవ శర్మ గారు రచించిన "గురు చరిత్ర" పుస్తకం మాకు లభ్యమయ్యింది. మేమే కొన్నామా లేక ఎవరైనా ఇచ్చారా అనే విషయం నాకు గుర్తుకు లేదు. తరువాతి కాలం లో నేను ఆ పుస్తకాన్ని చాల మందికి బహుమతిగా ఇచ్చాను. ఆ గురు చరిత్రను మా అమ్మ విశేషంగా పారాయణ చేయడం మొదలెట్టింది. ఇప్పటికీ మా అమ్మ ఆ పారాయణ ప్రతి నిత్యం కొనసాగిస్తూనే ఉందనుకోండి. ఏ సాధన అయినా కూడా అలా తైల ధార లాగా కొనసాగాలి. కానీ నా సాధన ఎప్పుడూ ఓ జల ధారనే!!!! నా ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడూ జారుడు మెట్లే. నేను అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఒక భ్రష్ట యోగినే, యోగ భ్రష్టుడనే!!!!!. ఏది ఏమైనప్పటికీ గాణగాపురంతో నా స్మృత్యనుబంధం అలా 1991 లో మొదలయ్యింది. తరువాత మేము ఇంటిల్లిపాది 1999 లో షిర్డీ వెళ్లాము. అప్పుడు అక్కల కోట వరకు వెళ్ళిన మేము, మా క్యాబ్ కు కర్ణాటక పర్మిట్ లేక పోవడం తో గాణగాపురం వెళ్లలేక పోయాము. తదనంతరం నేను ఎప్పుడూ ఆ ప్రదేశాలకు వెళ్లాలని అనుకోలేదు. 1999 వరకు అప్పుడప్పుడు నేను కూడా గురుచరిత్ర పారాయణ చేసేవాడిని. సంస్కృతం లో ఉన్న సంహితాయన గురు ద్వి సాహస్రి కూడా నేను పారాయణ చేసాను. తిరుపతిలో కాపురం ఉన్నంతవరకు నా ఆధ్యాత్మిక ప్రయాణం జోరుగా సాగింది. తిరుపతి వదిలి అనంతపురం వచ్చిన తరువాత నా ఆధ్యాత్మిక ప్రయాణం నిలిచిపోయిందనే చెప్పవచ్చు. దేవుడికి నా అవసరం లేకపోవడమో లేక నాకు దేవుడి అవసరం లేక పోవడమో ఇందుకు కారణం కావొచ్చు. మొదటే చెప్పాను కదా నావన్నీ ఆపద మొక్కులు, సంపద మరుపులు అని. నేనో సందేహ జీవిని. సంశయాత్ముడిని. ఇలా నా స్మృతి పథం లో మాత్రమే మిగిలిపోయిన గాణగాపురం ను సందర్శించడానికి ఇప్పుడు రైలెక్కడం ఒక spiritual twist అనుకుంటే అదో థ్రిల్.
అలా అర్ధరాత్రి హోసూర్ రైలు ఎక్కిన మేము ఉదయం 6.30 కు కలబురిగీ ( గుల్బర్గా ) లో దిగాము. బాగా చలిగా ఉంది. ముగ్గురం ఒక ఎలెక్ట్రిక్ ఆటోను గాణగాపురం వరకు ఏర్పాటు చేసుకున్నాము. ఆటో లో మేము ప్రయాణిస్తూ ఉంటే, అన్ని వైపుల నుంచి చలి గాలి ఈడ్చి కొడుతూ ఉంది. చలికి నా దవడలు కదిలి ఒక దానితో ఒకటి కొట్టుకోవడం వలన గాణగాపురం చేరేంతలో నా పళ్లు ఊడడం గ్యారంటీ అనిపించింది.
గుల్బర్గా నుంచి గాణగాపురం 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంట సేపు ప్రయాణించి గాణగాపురం చేరాము. మెయిన్ రోడ్డు లో ఉన్న సాయి దత్త లాడ్జ్ లో గదిని అద్దెకు తీసుకున్నాము. రోజుకు అద్దె రెండు వేల రూపాయలు. సౌకర్యవంతంగానే ఉంది. ఆ లాడ్జ్ లో ఉన్న ఆఫీసు లోనే గుడిలో పూజలకు ముందస్తు ఏర్పాటు చేసే పూజారి అందుబాటులో ఉన్నాడు. ఆయన వద్ద వెయ్యి రూపాయలు రుసుము చెల్లించి రుద్రాభిషేకానికి ఏర్పాటు చేసుకున్నాము. గుడి వద్ధ ఎవరిని కలవాలో చెప్పాడు ఆయన.
గాణగాపురం లో కర్మ స్థాన్ , ముక్తి స్థాన్ మరియు భక్తి స్థాన్ అనే మూడు ప్రదేశాలు చూడాలి. కర్మ స్థాన్ లోనే దత్త అవతారం అయిన నరసింహ సరస్వతి స్వామి నిర్గుణ పాదుకలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన మేము ముందు కుదుర్చుకున్న విధంగా రుద్రాభిషేకం చేయించాము. మొత్తం ఆ ప్రదేశం అంతా ఆధ్యాత్మిక తరంగాలతో నిండి ఉంది. నా మనసు చంచలత్వం కాసేపు అణిగింది. అక్కడ నరసింహ సరస్వతి స్వామి చేసిన మహిమలు నా మదిలో మెదిలాయి. అక్కడి నుంచి భక్తి స్థాన్ కు వెళ్లాము. అక్కడ భీమా అమరజ నదీ సంగమం ఉంది. ఈ రెండు ఉప నదులు కలుసుకునే ప్రదేశాన్ని స్పష్టంగా చూడొచ్చు. అక్కడ ఆ సంగమ ప్రదేశం లో నారికేళ సహితంగా నదీ జలాలకు తాంబూలాన్ని సమర్పించాము. నేను నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇలా నదికి పూజ చేయలేదు. నా చిన్నప్పుడు బస్ లో గానీ రైల్లో గానీ ప్రయాణించేటప్పుడు నది వస్తే మా నాన్న నా చేతికి ఒక రూపాయి బిళ్ల ఇచ్చి నదిలో విసరమని ( సమర్పించమని ) చెప్పేవారు. అంతవరకే నాకు నదితో ఉన్న అనుబంధం. భీమా అమరజ సంగమ ప్రవాహం లో బోటింగ్ చేసాము. ఒక అర్ధ కిలోమీటర్ తిప్పి పడవ అతను మా వద్ద ఐదు వందల రూపాయలు ముక్కు పిండి వసూలు చేసాడు. సకల క్షేత్రాలలో భక్తి కంటే కూడా వ్యాపారం పెచ్చు మీరుతోంది.
అక్కడ నుంచి నదీ సంగమ ప్రాంతంలోనే ఉన్న ఔదుంబర వృక్షం వద్దకు చేరుకున్నాము. ఈ వృక్షం నరసింహ సరస్వతి స్వామి వారు ప్రదర్శించిన అనేక మహిమలకు సాక్షి. దాని చుట్టూ మెట్ల లాగా వేదికలు అమర్చారు. ప్రతి మెట్ల వేదిక మీద వరసగా వ్యాస పీఠాలు ఉన్నాయి. వాటి మీద గురుచరిత్ర ను పెట్టుకుని వందల మంది పారాయణ చేస్తూ కనిపించారు. మేము ప్రదక్షిణ చేస్తూ వెళ్లి ఔదుంబర వృక్షాన్ని దర్శించుకున్నాము. అక్కడ ఒక వీడియో చేసి ఇంస్టా రీల్స్ లో పెట్టాను.
ఈ నదీ సంగమ ప్రదేశం లోనే దర్శనానికి ముందుగా హోటల్ లో పోహా ( అటుకుల ఉప్మా లేదా ఉగ్గాణి ) మరియు సగ్గు బియ్యం వడలు తిన్నాము. రెండూ చాలా బాగున్నాయి. ఇక అక్కడ నుంచి ముక్తి స్థాన్ లో ఉన్న కల్లేశ్వర్ గుడికి వెళ్లాము. ఇక్కడే శిలా రూపంలో ఉన్న శనీశ్వరుడు ఉన్నాడు. కల్లేశ్వర్ గుడిలో పూజారులు నమక చమక సహితంగా అభిషేకాలు చేస్తూ కనిపించారు. వాతావరణం పరమ ప్రశాంతత తో అలరారుతోంది. గర్భగుడి బయట ఉన్న అంతరాలయం లో ఒక యువకుడు వింత వింత శబ్ధాలతో భస్త్రికా ప్రాణాయామం చేస్తూ కనిపించాడు. దాని ద్వారా వచ్చే శక్తి సంచాలనాన్ని తట్టుకోలేక ఆ వింత శబ్దాలు చేస్తున్నాడు. అక్కడ నిలబడి విష్ణు సహస్ర నామ అనుసంధానం చేసుకుని బయలుదేరాము. సాయి దత్త లాడ్జ్ కు చేరుకుని కాసేపు కూచునే విశ్రమించి, తరువాత ఇన్నోవా లో అక్కల కోటకు బయలుదేరాము. సుమారు రెండు గంటలు ప్రయాణించి స్వామి సమర్థ మందిరాన్ని చేరుకున్నాము. అపరిమితమైన జన సందోహం ఉన్నప్పటికీ దర్శనం బాగా అయ్యింది. నేను 1999 లో చూసిన అక్కల్ కోట్ కు, ఇప్పుడు చూస్తున్న దానికి తేడా చాలా స్పష్టంగా నాకు తెలుస్తోంది. ఇప్పుడు స్వామి సమర్థ మందిరం చుట్టూ చాలా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దర్శనం తరువాత బయట లభ్యమయ్యే థాయిలాండ్ జామ కాయ తిని ముగ్గురం అక్కల కోట్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నాము. మాకు బసవ ఎక్స్ప్రెస్ కు రిజర్వేషన్ కన్ఫర్మ్ కాకపోవడంతో, దానిని క్యాన్సిల్ చేసుకుని ఉద్యాన్ రైలు పట్టుకుని ఆరు గంటలు ప్రయాణించి అర్ధ రాత్రి 12.45 కు ఎవరి గూటికి వారు చేరుకున్నాము.
Excellent 👍👍👍
ReplyDelete
ReplyDeleteJai guru datta
Dattatreya is immortal.
Datta chooses whom to be given access to visit his abode.
But our rational mind questions "how come the holy place is a convergent point to many devotees?, are only devotees given access..? Even time alone can't answer divine interventions in our mundane life.
It is heard that datta bhakti arises in an individual if your life cycles coming to an end. A good harbinger.
Dattas miracles are unimaginable, unspeakable, inexplicable and wonderful too.
One visits abode and relish it immensely like an ambrosia is given to a hungry man.
Needless to say I have experienced the datta bhakti on various occasions.
Here "I" is the lesser we know about ourselves and the more we try to crave for it.
"I" is the smallest of the words and very difficult to understand.
"I" is cocooned with mystery and shrouded in mysticism.
This is dattathatvam as i am trying to understand
Jai datta.
U r Lucky sir. Utilised holidays for visiting the temples u wanted to see. But we never heard of this place. Shall wait for our turn to visit????
ReplyDelete