నా డిజిటల్ నైపుణ్యాలు
నేను డిగ్రీ చివరి సంవత్సరం లో ఉండగా కంప్యూటరు సైన్స్ కోర్సు లకు మా చెడ్డ క్రేజ్ వచ్చి పడింది. మిగిలిన కోర్సులకున్న డిమాండ్ ఉన్న పళంగా అధః పాతాళానికి పడిపోయింది. నేను పీజీ చేసే సమయంలోనైతే కంప్యూటరు కోర్సులకు డిమాండ్ తారా స్థాయికి చేరుకుంది. నేను జువాలజీ లో పీజీ చేస్తున్నానని చెపితే మా బంధువులు కొద్ది మంది నన్ను హీనంగా చూడడం నాకింకా గుర్తుకుంది. అప్పట్లో Y2K సమస్య ఉండడం వలన కంప్యూటరు రంగానికి అలవి కాని డిమాండ్ ఏర్పడింది. అప్పట్లో చిన్న చిన్న కంప్యూటరు సెంటర్ల లో డిప్లొమా కోర్సులు చేసినవారు కూడా క్రౌంచ ద్వీపానికి విమానం ఎక్కి వలస వెళ్లి పోయారు. కంప్యూటరు కోర్సు చేసిన వారికి చిన్న వయసులోనే పెద్ద, పెద్ద ఉద్యోగాలు వచ్చాయి అప్పట్లో. కంప్యూటరు కోర్సు చేసినవారు డాలర్లలో సంపాదించడం మొదలుపెట్టిన రోజులు అవి. యువత purchasing parity పెరిగిపోవడంతో బజార్లన్నీ తెగ బలిసి పోయాయి. నగరాల్లో వీకెండ్స్ కు హోటళ్లకు పోయే సంప్రదాయం వచ్చి చేరిపోయింది. ప్రతి ఇంటికి ఒక కారు ఉండడం సర్వ సాధారణమై కూచుంది. అన్ని ప్రోడక్ట్స్ లో కొత్త బ్రాండ్ లు కుర్రకారును వెర్రెక్కించడం మొదలుపెట్టాయి. కొనడం ఒక వ్యసనం స్థాయికి చేరి పోయింది. వస్తువులు కలిగిఉండడం అనేది ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. భూమికి ఉన్న పళంగా బూమ్ వచ్చింది. మా బంధు వర్గాల్లోనే నియో రిచ్ కమ్యూనిటీలు ఏర్పడ్డాయి. డబ్బు వల్ల ఆత్మ విశ్వాసం వస్తే పర్లేదు కానీ బరితెగింపు రావడం అనారోగ్యకరమైన పరిణామం. అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి. బేరం ఆడే వారి సంఖ్య తగ్గిపోయింది. ఈ నియో రిచ్ సంస్కృతి లో నా నిరుద్యోగ జీవితం నన్ను తీవ్ర నైరాశ్యానికి గురిచేసింది.
నేను జువాలజీ ఎంచుకుని తప్పు చేసానేమో అనే ఆలోచన నన్ను తొలచడం మొదలెట్టింది. నా తోటివారు ఉద్యోగం లో చేరి అపార్ట్మెంట్స్ కొంటున్నారు. ఏకంగా కార్లలో దర్జాగా తిరుగుతున్నారు. నాకు ఉద్యోగమే లేకపోయే!!!! ఇక కారెక్కడి నుంచి వస్తుంది???? విచిత్రంగా ఇదే సమయంలోనే నాకున్న ఒక్క సైకిల్ ని తిరుపతిలో ఎవడో దొంగలించాడు. తిరుపతి లాంటి దివ్య క్షేత్రం లో కూడా దొంగలుండడం నన్ను అప్పుడు ఆలోచింపజేసింది. ఎవడి కడుపాత్రం వాడిది అనుకుని సర్దుకున్నాను. నేను కూడా ఉక్రోషం తో ఒక కంప్యూటరు సెంటర్లో పీజీ డిప్లొమాలో చేరాను. ఆ ప్రోగ్రామింగ్ మెళుకువలు అర్థం కాక మధ్యలోనే మానేసాను. కొద్ది కాలానికి GATE స్టైఫండ్ తో Ph.D చేరాను. సంవత్సరం పాటు కొన్ని పదుల ఎలుకలను నా పరిశోధన కోసం తోక లాగి ( Cervical dislocation ) చంపి ఉంటాను. ఉద్యోగ ప్రయత్నాలన్నీ వ్యర్థం అయ్యాయి. గ్రూప్ I ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. సివిల్ సర్వీసెస్ mains నాలుగు సార్లు రాసిన అనుభవం మాత్రం మిగిలింది. ఇంట్లో వారికి దూరంగా హాస్టల్ లో ఉండడం వలన PhD చేసేటప్పుడు నైరాశ్యం ఆవరించేది. తరువాత నా పరిశోధనను మధ్యలో విరమించి ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తే హిందూపూర్ లోని బాలాజీ విద్యా విహార్ లో ఉద్యోగం వచ్చింది. తరువాత చిత్తూరు విజ్ఞాన సుధ లో కూడా ఉద్యోగం చేసాను. ఈ ప్రైవేట్ ఉద్యోగాల గురించి మరియు నా ప్రభుత్వ కొలువుల గురించి ఇంకో చోట ఏకరవు పెడతాను. ఇప్పుడు నా డిజిటల్ ప్రయాణం గురించి మాత్రమే చెపుతాను. ఏ దానికైనా ఒక టైమ్ కాప్సుల్ ఉంటుంది కదా!!!!! నాకు కాలం అనుకూలంగా మారినప్పుడు 2002 లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగం వచ్చింది. అప్పుడు మొదటసారిగా mail id క్రియేట్ చేసుకున్నాను. mail inbox లో ఎవరిదైనా సందేశం వస్తే ఎగిరి గంతేసినంత పని చేసేవాడిని. తరువాత కొద్ది కాలానికి మొబైల్ ఫోన్ల యుగం మొదలయ్యింది. ఇంత ఆలస్యంగా నేను డిజిటల్ ప్రపంచం లోకి అడుగుపెట్టాను అంటేనే నా వెనుకబాటుతనాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ సంధర్భంగా నేను నా విద్యార్థులకు చెప్పదలిచింది ఏమంటే మార్పును వీలైనంత తొందరగా అంగీకరించండి. కాలానికి, దేశానికి అనుగుణంగా మారండి. మార్పుకు అలవాటు పడండి.
జూనియర్ కాలేజీ వ్యవస్థ లో ఉండగానే నేను కొన్ని శిక్షణా తరగతులకు హాజరయ్యాను. జనాలను కలవడం నాకిష్టం. 2010 సంవత్సరం నాటికి నాకు డిగ్రీ కాలేజీ లెక్చరర్ గా పదోన్నతి వచ్చింది. కల్యాణదుర్గం డిగ్రీ కాలేజీ కి బదిలీ అయ్యింది. మేము తిరుపతి వదులుతామని కలలో కూడా అనుకోలేదు. తిరుపతిలో మాకు స్వంత అపార్ట్మెంట్ ఉండేది. దాన్ని అద్దెకిచ్చి మూటా ముల్లె సర్దుకుని ఇంటిల్లిపాది అనంతపురం వచ్చేసాము. అప్పటికే మ తాతా, అవ్వ కాలం చేసారు.
కల్యాణదుర్గం కాలేజీ ప్రిన్సిపల్ గా రామచంద్ర మూర్తి గారు ఉండేవారు. ఆయన జాతీయ సదస్సులను తరచూ నిర్వహించేవాడు. నేను ఆ కాలేజీ లో మూడు సెమినార్లకు కన్వీనర్ గా వ్యవహరించాను. వీటిలో పాల్గొనడానికి నాకు లాప్ టాప్ అవసరం అయ్యింది. బెంగళూరు నుంచి నాకు మా విష్ణుప్రియ డెల్ ఇన్స్పిరాన్ లాప్ టాప్ పంపించింది. ఇక అప్పటి నుంచి నేను డిజిటల్ ప్రపంచం లో పూర్తీగా మునిగిపోయాను. మొదట ఫేస్ బుక్ లో అకౌంటు తెరిచాను. అంతకు ముందు ఆర్కుట్ అని ఒక వేదిక ఇలాంటిదే ఉండేదట. ఫేస్ బుక్ వచ్చిన తరువాత అది కనుమరుగయ్యింది. సెమినార్ ఫోటోస్ అన్నీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేవాడిని. నా వద్ద సోనీ కెమెరా ఉండేది. అప్పటికింకా మొబైలు కెమెరాలు రాలేదు. పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ నేర్చుకున్నాను. అలా కొత్త టెక్నాలజీ ని కొద్దిగా అందిపుచ్చుకున్నాను. ఇవన్నీ చిన్న, చిన్న విజయాలే అయినా నాకు వృత్తి రీత్యా బాగా సహకరించాయి.
అంతలో 2013 లో అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు బదిలీ అయ్యింది. మూవీ మేకర్ లో ఫోటోస్ పెట్టి, పాటలు జోడించి వీడియో గా మార్చడం నేర్చుకున్నాను. YouTube లో ఛానెల్ ప్రారంభించాను. ఆ సమయంలోనే MANA టీవీ live presenter గా నాకు అవకాశం వచ్చింది. మొదటిసారి స్టూడియో లోకి అడుగుపెట్టినప్పుడు చాలా థ్రిల్లింగా ఫీల్ అయ్యాను. ఆకాశవాణి లో అనేక అంశాల మీద నా ప్రసంగాలు చాలా ప్రసారం అయ్యాయి. కానీ ఈ డిజిటల్ ప్రయాణం అంతా కాస్తా మందకొడిగానే ఉండేది. కానీ ఉన్నట్టుండి కరోనా విరుచుకుపడడంతో , నేను కొత్త డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. నేనే కాదు, అధ్యాపక మిత్రులందరికి డిజిటల్ టూల్స్ వాడడం తప్పనిసరయ్యింది. జూమ్, వెబెక్స్ , గూగుల్ మీట్ లాంటివి నిత్యకృత్యాలై పోయాయి. ఆన్లైన్ క్లాసుల హవా ప్రవేశించింది. ఒకప్పుడు తరగతి గదికి మాత్రమే పరిమితమైన గురువులు విశ్వ గురువులుగా ఎదిగే అవకాశం వచ్చింది. మాకు కూడా ఈ డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించే కిటుకులు నేర్పడానికి శిక్షణా తరగతులు మొదలయ్యాయి. అన్నిటినీ అందిపుచ్చుకున్నాను. ఇంట్లోనే కూచుని స్టూడియో వాతావరణం ఎలా నెలకొల్పుకో వాలో నేర్చుకున్నాను. YouTube ఛానెల్ లో వెయ్యికి పైగా నా వీడియోలు ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి సామాజిక వేదికను ఉపయోగించడం మొదలెట్టాను. Instagram లో కూడా తక్కువ నిడివి ఉన్న వీడియోలు పెట్టడం మొదలెట్టాను. నేను పనిచేసే కాలేజీ నోడల్ కేంద్రం కాబట్టి ఇక్కడ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ దగ్గరగా ఒక స్టూడియో నే నెలకొల్పారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ అంటే కృత్రిమ మేధస్సు యుగం మొదలైన తరువాత చాట్ బాట్ లను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాను. వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను. Podcast clips చాలానే చేసాను. బాల్యం లో రేడియోతో మొదలైన నా జీవితం ఇప్పుడు కృత్రిమ మేధ వద్ద ఆగింది. ఇంకా చాలా మార్పులను అందిపుచ్చుకోవడానికి నేను సిద్దంగా ఉన్నాను.
నేను డిజిటల్ ప్రపంచంలో ఏదో సాధించానని చెప్పను గానీ, ఈ ప్రపంచం లో ఇమిడే ప్రయత్నం విజయవంతంగా చేసాను. కృత్యకృత్యుడిని అయ్యాను.
నిజాయితీ గా రాస్తున్నారు మీ జర్నీ. నలుగురికి ధైర్యం వచ్చేలా..!
ReplyDeleteకంప్యూటర్ చదువులు ఊపందుకున్న కాలం గురించి బాగా రాశారు.
Thank you for your encouraging comments madam
DeleteSir! Great stand of blogging Journey with GLN. Merely it is not your journey. Besides it, it is laying road for great destination for those who sincerely follow your journey.
ReplyDeleteThank you sir
DeleteFacts are facts.
ReplyDeleteFacts always rule the world.
Factual world initially appears fictional.
Eventually it unfolds into reality.
Realuty fuels experiences.
Collection of experiences is wisdom.
Often wisdom brings about consciousness.
Any decision taaken out of conscious element is called effective decision making.
The turns of your life is really serendipitous. From scratch, failure and despondency yoive built up your empire which consist of your own army.
The army of tools of technology that you have used to uplift yourself and exhibit your knowledge is inspiring.
I kjst sign off with a belief thay further episodes are interesting