బాల్యం లో అనుభవాలు మరియు అభ్యసన పద్దతులు
నేను బాల్యం లో ఇంట్లో, స్కూల్ లో పొందిన అనుభవాలను ఇక్కడ ప్రస్తావిస్తాను. నేను విద్యార్థి దశ నుంచి టీచర్ గా ఎదుగుతున్న క్రమంలో బోధనా పద్దతులలో వచ్చిన అనేక మార్పులను ప్రత్యక్షంగా చూసాను. వాటి వలన లబ్ధి కూడా పొందాను. టీచర్ గా కొన్ని మార్పులకు నేను కూడా నాంది కూడా పలికాను. విద్యార్థిగా నేను పెను మార్పులు చూడనప్పటికీ, టీచర్ గా లాక్ డౌన్ కాలం లో మెథడాలజీ లో విప్లవాత్మక మార్పులు చూసాను. ఎక్కడిక్కడ అరమరికలు లేకుండా నేను నా వ్యక్తిత్వం లో సరబాట్లు చేసుకున్నాను అంటే దానికి కారణం బాల్యం లో నేను పొందిన అనుభవాలే.
నేను ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలోనే చదివాను. ప్రాథమిక స్థాయి వరకు కొన్ని తరగతులు ప్రైవేట్ స్కూల్స్ లో చదివాను. ఒకటి నుంచి నాల్గవ తరగతి వరకు నా విద్యాభ్యాసం చాలా ఆహ్లాదకరంగా జరిగింది. కానీ ఈ కాలం లో కూడా నాకు గణితం కంటిలో నలుసై కూచుంది. గణితాన్ని విద్యార్థులకు కంటిలో నలుసులా కాకుండా, కంటికి కాటుకలా మార్చాల్సిన బాధ్యత లెక్కల అయ్యవార్లదే మరి. నా చిన్న నాటి చదువులు ఎక్కువగా భాషా నైపుణ్యాల చుట్టూతా తిరిగాయి. అప్పట్లో సైన్స్ పట్ల అవగాహన తక్కువగా ఉండేది. ఇంట్లో తాత ఒత్తిడి వలన అమరం కొద్దిగా కంఠతా పట్టాను. మా తాత 'అమరం రాని వాడికి నేనమరను' అని సరస్వతి మాత అంటుంది అనేవాడు. అదేమో గానీ నేను అమర కోశం పూర్తిగా నేర్చుకోలేక పోయాను. అలాగే ఆంధ్రనామ సంగ్రహం కూడా కొద్దిగా నేర్చుకుని వదిలేసాను. వేమన మరియు సుమతి పద్యాలు బాగానే ఒంటబట్టాయి. నిత్య పారాయణలో భాగంగా పోతన భాగవత పద్యాలు నేనూ, మా బావ కలిసి చెప్పేవాళ్లము. ముఖ్యంగా గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర పద్యాలు చిన్నప్పుడే కంఠోపాఠం అయిపోయాయి. పెద్ద బాల శిక్ష కూడా అప్పట్లో అందరం చదివేవారం. నిజానికి అప్పట్లో పాఠశాలల లో ఒత్తిడి లేని విద్యా బోధన జరిగేది. నాకు ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన చేసిన టీచర్ల లో కాంతమ్మ మేడం, సామ్రాజ్య లక్ష్మీ మేడం మరియు బదరీ నాథ్ సర్ నాకు ఇంకా గుర్తుకు ఉన్నారు. కాంతమ్మ మేడం కాలం చేసారు. సామ్రాజ్య లక్ష్మీ మేడం ను నేను మళ్లీ చూడలేదు. బదరీనాథ్ సర్ ను నేను ఇప్పుడు కూడా తరచూ చూస్తూనే ఉంటాను. నాకు అమ్మవారు పోసినప్పుడు నన్ను చూడడానికి కాంతమ్మ టీచర్ మా ఇంటికి వచ్చింది. ఒక సారి సామ్రాజ్య లక్ష్మీ మేడం కూడా వచ్చారు. అప్పట్లోనే మా స్కూల్ లో ప్రొద్దుటూర్ కు టూర్ వేసారు. నేను మా నాన్న, అమ్మను వదిలి ఉండలేను కాబట్టి పోలేకపోయాను. నాకు ఇల్లంటే ఇప్పటికీ ఒక comfort zone. East or West, Home is the best అనే రకం నేను. ఇప్పటికీ నాకు ఇంటి మీద బెంగ ఎక్కువే. ఇప్పటికీ నేను నాన్న కూచినే, అమ్మ చాటు బిడ్డనే. అప్పట్లో పలక మీద బలపం తో వర్ణమాల దిద్దేవాళ్లం. నా కంటే ముందు తరం వాళ్లు ఇసుకలో దిద్దేవాళ్లట. ఇప్పుడు పిల్లలు ఇసక లో కాకుండా ఇంస్టా లో వేళ్లు రుద్దుతున్నారు.
మా నాన్న కల్యాణదుర్గం లో చదువుకునేటప్పుడు ట్యూషన్ కు రాత్రి లాంతర్ తీసుకునివెళ్ళేవారట. నా ప్రాథమిక విద్యాభ్యాస సమయానికి ఎలక్ట్రిసిటీ వచ్చేసింది. చదువుకునే సమయం లో కరెంట్ పోతే నాకు దివ్యానందంగా ఉండేది. ఇంట్లో కూడా చదవమని పోరే వారు కాదు. అప్పట్లో అందరూ అంతే. ఎలక్ట్రిసిటీ కనుగొనడం అనేది మానవ పరిణామ క్రమం లో ఒక ప్రధాన మైలు రాయి. నా చిన్నప్పుడు మా ఇంట్లో ఒక రేడియో ఉండేది. వారాంతంలో దానిలో సినిమా శబ్ద రూపంలో వచ్చేది. మా ఇంట్లో ఉన్న మూడు తరాల వారు దాని చుట్టూ చేరేవారు. ప్రతి తరంలోని కోడళ్లు అందరూ కాస్త దూరంగా, తలుపు చాటుగా కూచుని వినేవారు. మా ముత్తాత ముడుంబి చక్రవర్తుల రాజసం ఒలక బోస్తూ, ఒక చెక్క కుర్చీ మీద కాలు మీద కాలు వేసుకుని వినేవాడు. ఆయనకు కొద్దిగా దూరంగా మా తాత, ఈయనకు కొద్దిగా దూరంగా మా నాన్న కూచునేవారు. నేనూ , మా బావ పిల్లలం కాబట్టి ఎవరి ఒళ్లో నైనా కూచోవచ్చు. ఈ కూచునే పద్దతిలో నాకు తరాల మధ్య గౌరవం కన్నా తరాల మధ్య అంతరమే ఎక్కువగా కనిపించేది. పురుషాధిక్యత కూడా ప్రస్పుటంగా కనిపించేది. ఇంట్లో ఎవరి అనుష్టానం వాళ్లు చేసుకునేవాళ్లు. పిల్లలను పూజలు చేయాలని ఎవరూ ఒత్తిడి తెచ్చేవాళ్లు కాదు. కేవలం పిల్లలకు శ్లోక పఠనం ఉండేది.
పండుగలు, పబ్బాలు ఏమో గానీ, ఆబ్దికాలు మా జోరుగా జరిగేవి. ఒకసారి బ్రాహ్మణార్థం వచ్చిన ఒక బ్రాహ్మణుడు చెపుతున్న తద్దినం మంత్రాలు నేనూ, మా బావ విని నేర్చేసుకుని, మరుసటి రోజు నిత్య పారాయణ లో కలిపి చెపుతుంటే, మా పెద్ద వాళ్లు పడిన తత్తర బిత్తర అంతా ఇంతా కాదు. కానీ అప్పట్లో మా తద్దినం మంత్రాలు విన్న పెద్దలు సహస్ర చంద్ర దర్శనం చేశారు లెండి.
బాల్యం లో పిల్లలు ఏదైనా విని ఇట్టే నేర్చుకోగలరు కాబట్టి తల్లి తండ్రులు ఇంటి వాతావరణం పట్ల తగు జాగ్రత్త వహించాలి అని చెప్పడమే నా ఉద్దేశ్యం. స్కూల్స్ లో కూడా వాతావరణం selective learning కు అనుగుణంగా ఉండాలి. శ్రుతం వలన పిల్లలు చాలా నేర్చుకుంటారు కాబట్టి వారికి చిన్నప్పుడే శతక సాహిత్యం, పద్యాలు ఇలాంటివి నేర్పిస్తే మంచిది. పూర్వం ఇంట్లో స్త్రీలు పనులు చేసుకుంటూ శ్లోకాలు, పద్యాలు చెప్పేవారు. కొందరైతే సంకీర్తనలు పాడేవారు. వాటిని వింటూ పెరిగిన పిల్లల్లో భాషా పాటవం బాగుంటుంది. కానీ ఇక్కడ పిల్లలు ఎక్కువ చాదస్తం నేర్చుకోకుండా జాగ్రత్త పడాలి. మా ఇంట్లో మూడు భాషలు మాట్లాడేవాళ్లు. అందుకే నాకు చిన్నప్పుడే తెలుగు, కనడం మరియు తమిళ భాషలు వచ్చేసాయి. చాలా విచిత్రంగా ఒక భాషా పదాలను మరో భాషలో కలపకుండా మాట్లాడేవాడిని. భాష ను నేర్చుకునే నైపుణ్యం చిన్నతనం లోనే ఎక్కువ ఉంటుంది. పిల్లలు చదివి నేర్చుకునే కంటే, విని, చూసి ఎక్కువ విషయాలు ఆకళింపు చేసుకొంటారు. మరి బాల్యంలో మీ టీచర్స్ మరియు మా పెద్దలు అనుసరించిన పద్దతులను క్రింద పేర్కొంటున్నాను.
- Chalk & talk పద్దతి: నల్ల బోర్డ్ మీద చక్కటి దస్తూరీ తో రాసేవారు. Black Board Management ఆ తరానికి వెన్న తో పెట్టిన విద్య. అలవోకగా రాసేవారు. పదాలను ఉచ్చరించడం లో స్పష్టత ఉండేది. పదాలను ఎక్కడ ఒత్తి పలకాలో, ఎక్కడ ఊది పలకాలో వింటున్న మాకు స్పష్టంగా తెలిసేది. ఎక్కడా అనవసర పదాలు వాడడం గానీ, అపశబ్దాలు పలకడం గానీ, చివరి పదాలు మింగేయడం గానీ జరిగేది కాదు. మాతో కూడా రాత సాధన చేయించేవారు. రాత ద్వారా మా తల రాత మార్చేవారు. వారు పాఠం చెబుతుంటే మాకు ఆంగికం, వాచికం, ఆహార్యం లాంటివి ఎలా ఉండాలో తెలిసేది. ఇక్కడ మా తాత రాత గురించి ఒక విషయం చెప్పాలి. ఆయన కరణం. గొలుసుకట్టు రాత ఆయనది. ధృఢమైన వ్యక్తిత్వం ఏర్పడాలి అంటే రాతను సాధన చేయాలి. రాత వలన brain orientation మారుతుందనేది వాస్తవం.
- పోటీలు: అనేక రకాల పోటీలు పెట్టేవారు. ఆటల పోటీలు కూడా వుండేవి. కో కో లాంటి ఆటలు బాగానే ఆడేవాడిని. డ్రిల్ మాస్టర్ ప్రతి స్కూల్ లో ఉండేవాడు. ఆయన మాట్లాడేది అరుదు. ఎప్పుడూ విజిల్ వేసేవాడు. ఆటల వలన తోటి పిల్లలతో కలిసిపోవడం అలవాటయ్యేది. ఇంట్లో కూడా పెద్దలు, పిల్లలు అంతా కలసి బారా కట్ట ఆడేవాళ్లం. ఇది పాచికలతో గానీ, గవ్వలతో గానీ, ఇవేవీ లేకుంటే చింత పిక్కలతోనో ఆడేవాళ్లం. మా ఇంట్లో ఒక పాచికల జత ఉండేది. ఆ పాచికలను శకుని ఎముకలతో చేసినట్టుగా మా తాత చెప్పేవాడు. నేను వాటిని మా నేస్తాలకు చూపించి గర్వపడేవాడిని.
- లుడో బోర్డు కూడా మా ఇంట్లో ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా మా ఇంట్లో పరమపద సోపాన పటం ఉండేది. దానిలో పాము నోట్లో పడుతూ, నిచ్చెనలు ఎక్కుతూ నేనూ, మా బావ తెగ ఆడుకునేవాళ్లం. ఆడుతూ, ఆడుతూ ఉన్నట్టుండి జఠా ముఠీ కొట్టుకునే వాళ్లం. అప్పుడు ఇంటిల్లిపాదీ రెఫరీలుగా మారి, ఏదో తీర్పు చెప్పి విడదీసేవాళ్లు. యుద్ధాలు చేయడం ఎలాగో, రాజీలు చేసుకోవడం ఎలాగో ఆటలలోనే తెలిసివస్తుంది. ఓటమిని సరదాగా తీసుకొనే లక్షణం ఆటల లోనే అలవడుతుంది.
- సరదాలు మరియు హాబీలు : సాయంత్రం అయ్యేసరికి తాతతో బజారుకు షికారుకు వెళ్లడం నాకూ, మా బావకు అలవాటు. ఉమ్మడి కుటుంబాలలో ప్రతి తరం ఒక నీడ లాగా మరో తరాన్ని కాపాడుతుంది. అప్పట్లో నేను చూసిన ప్రతి ఇంట్లో ఒక తాతనో, అవ్వనో ఉండేవారు. నాకు ఇద్దరూ ఉండేవారు. మా ఓనర్ ఇంట్లో ఒక అవ్వ ఉండేది. ఆమెను వాళ్ల ఇంట్లో అందరూ 'అజ్జీ' అనేవాళ్లు. ఒకసారి ఆమె ఎదురయినప్పుడు మా బావ 'అజ్జీ! నిన్ను బజ్జి చేస్తాను' అనడం తో ఇల్లు మారాల్సి వచ్చింది. ఆదివారాలు వస్తే ఈ కాలం పిల్లల్లాగా టీవీ లకు అతుక్కుపోయే అవకాశం మాకు లేదు. ఆదివారం చిన్న సైకిల్ అద్దెకు తీసుకుని మా తాత నేతృత్వం లో తొక్కడం నేర్చుకునేవారం. తరువాత అర్ధ పెడల్ వేస్తూ సైకిల్ తొక్కడం నేర్చుకున్నాను. స్కూల్స్ లో పిక్నిక్ లు ఉండేవి. పండగ సమయం లో పేరంటం ఉండేది. అవి నిరంతర వార్తా స్రవంతుల పాత్ర నిర్వహించేవి. ఎన్నో మనసుల కలబోతగా ఉండేది ఆ పేరంటం.
- సినిమాలు: మాకు ఇంతకు మించిన ఆటవిడుపు లేదు. మా అనంతపురం నిండా థియేటర్లే. కానీ ఈ కాలం వాళ్ల లాగా అభిమాన సంఘాలు, వాటి మధ్య గొడవలు లేవు.
- పత్రికలు చదవడం: ఇంట్లో వారందరికీ ఇదో హాబీగా ఉండేది. కాబట్టి పిల్లలకు చదవడం సహజంగానే వ్యాపకంగా మారేది.
- తినడం: ఇంట్లో చాలా మంది ఆడవాళ్లు ఉండేవాళ్లు కాబట్టి, చిరుతిళ్లు చాలానే చేసేవాళ్లు. అమ్మాయిలకు పచ్చళ్లు, ఊరగాయలు ఎలా పెట్టాలో చిన్నప్పుడే తెలిసివచ్చేది. వడియాలు ఆరబోస్తే, పిల్లలు వంతుల వారి కాపలా ఉండేవాళ్లం. అవి మెత్తగా ఉన్నప్పుడే కొన్నిటిని నొక్కి తినేసి, కాకి ఎత్తుకు పోయిందని చెప్పేవాడిని. పెద్దవాళ్లకు నేను చెపుతున్నది అబద్దం అని తెలిసినా కూడా తిట్టేవారు కాదు. ఈ సంఘటన నాకో management పాఠం నేర్పింది. అదేమంటే If you are a master, be blind and if you are a servant, be deaf అని.
- ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళల్లో కూడా కొట్టుకు చస్తుంటే, అప్పుడు చిన్న చిన్న ఇళ్ళల్లో కూడా సర్దుకుపోయేవారు. అత్తా కోడళ్లు, బావ మరుదులు, తోడల్లుళ్లు, తోడి కోడళ్లు .... ఇలా అందరూ ఒకే ఇంట్లో సర్దుకుపోయేవారు. కాలక్షేపానికి కొదవే లేదు. కానీ ఈ మొత్తం తతంగం లో ఆడవాళ్లు చాకిరీ చేయలేక నలిగి చచ్చేవాళ్లు.
ఇలా ఇంటా, బయట నేను నా బాల్యం లో ఇలా చాలా సంగతులు నేర్చుకున్నాను. పిల్లల బాల్యాన్ని గౌరవించడం, వారిని వివక్షకు గురి కాకుండా చూడడం పెద్దలందరి బాధ్యత. నాకు మాత్రం నా బాల్యం నుంచి ఇప్పటి వరకూ మా నాన్నే హీరో అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నేను వివక్ష కు గురైన ప్రతిసారీ నాకు అండగా మా అమ్మా, నాన్న నిలబడ్డారు. వారికి శత సహస్ర వందనాలు. Parental support ఉన్న పిల్లవాడు ఎటువంటి వివక్షనైనా తట్టుకుని నిలబడగలడు. తల్లి తండ్రి లేని వారికి బంధువులు, మిత్రులు, వ్యవస్థ లేదా ప్రభుత్వమో అండగా నిలబడాలి.
All facts reveled
ReplyDeleteNice experiences sir. సరళమైన భాష తో ఆద్యంతం ఆసక్తి కరంగా సాగే మీ రచనలు ఓ అద్భుతం sir.
ReplyDeleteJai blogaiah!
ReplyDeleteIf you dont have a father, procure one. Says Neitsczhe.
ReplyDeleteFamily is not an additional burden. It is a lifeline and ddirect bloodline.
The earliest memories of life are foundations and cornerstones of tallest personalities into future.
Ideally family plays a crucial role in shaping the hearts and minds of the children.
Any teaching methodology or pedagogy should uplift the student psychologically. I see it in that way.
Teaching children at home is quite difficult, but making children learn is easy, i believe that. The Children are good imitators and observers.
I stunned at the point mentioned.... "Sports change the mental health of the children". I reiterate.
And finally heirarchy at home is good but it yields glassceiling at home itself, sometimes corruption, adamancy also start there. Which eventually make male children to practice it down the line. And you are exception here.
In the age of nuclear family... Joint family system is an oasis.
ఉమ్మడి కుటుంబాలలో సర్దుకుపోవాలంటే మానసిక పరిపక్వత అవసరం మిత్రమా!!! ఉమ్మడి కుటుంబాలలో కొద్ది మంది వ్యక్తుల ఆధిపత్య ధోరణుల వలన ఆ వ్యవస్థ కనుమరుగయ్యింది.
DeleteWonderful memories sir.we r fortunate know them. Joint families are really a blessing for the kids. They provide multiple learning opportunities for kids to grow mentally in a balanced way.Elders also nurture them with their experiences. U r a good example sir.
ReplyDelete