భయాలు మరియు భావోద్వేగాలు 

భయం లేని మనిషి భూమి మీద ఉండడు. ఆ విషయం తెలియక, ఇది మనకు మాత్రమే పట్టిన జాడ్యమేమో అని మనం భయపడుతుంటాము.  నాకు చిన్నప్పటి నుంచి అకారణ భయాలు చాలా ఉండేవి. వీటిని జయించడానికి చాలా కాలమే పట్టింది. ఇప్పటికీ కొన్ని భయాలు నాలో సూక్ష్మ రూపంలో కొనసాగుతున్నాయి. 'క్షుద్రం హృదయ ధౌర్భల్యం' అని భగవానుడు గీత లో చెప్పాడు కదా!!! ఈ అనవసర భయాల వల్ల నేను జీవితంలో చాలానే పోగొట్టుకున్నాను. వాటి ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే, నా స్టూడెంట్స్ వీటి గురించి చదివి అలాంటి భయాలను జయించాలని. తల్లి తండ్రులు కూడా పిల్లలకు భయాన్ని నేర్పకూడదు. భయాన్ని జయించే మార్గాలను అన్వేషించేలా పిల్లలను ప్రోత్సహించాలి. 

నాకు కూడా విద్యార్థి దశలో చాలా భయాలు ఉండేవి. దానిలో ప్రధానమైనది స్టేజ్ ఫియర్, అంటే సభా కంపం. అది ఏ స్థాయిలో ఉండేది అంటే పది మంది నా ముందుంటే చాలు నాకు ముచ్చెమటలు పట్టేవి. నేర్చుకున్నది గుర్తుకువచ్చేది కాదు. ఈ భయం నన్ను చాలా కాలం వెన్నాడింది. అందుకే నేను విద్యార్థి దశలో పాల్గొన్న ప్రతి వక్తృత్వపు పోటీ నా పాలిట ఒక disaster అయ్యేది. ఉరవకొండ కరి బసప్ప స్కూల్ లో నేను తొమ్మిదవ తరగతి చదువుతుండగా హిందీ మాధ్యమం లో జరిగిన వక్తృత్వపు పోటీలో మొదటి సారి పాల్గొన్నాను. నా పేరు పిలిచిన వెంటనే, మెదడులో సర్క్యూట్స్ చిందరవందర అయిన ఫీలింగ్ వచ్చేసింది. అంశం 'మేరా గావ్' . ఏమి మాట్లాడానో నాకే తెలియదు. కాళ్లు భరతనాట్యం చేసాయి. హృదయం శివుడి చేతిలో ఢమరుకం మోగినట్టు గా కొట్టుకుంది. రెండు నిముషాలలో ముగించి వచ్చి కూలబడిపోయాను. జ్యూరీ గా వ్యవహరించిన వారిలో ఒక అయ్యవారి వద్ధకు నేను ట్యూషన్ పోయేవాడిని కాబట్టి నాకు రెండవ బహుమతి వచ్చిందనుకోండి. ఆ దెబ్బకు తిరిగి పీజీ చదివేవరకూ వక్తృత్వ పోటీల్లో పాల్గొనలేదు. 

పీజీ లో మా జువాలజీ డిపార్ట్మెంట్ లో management విభాగం వారు వక్తృత్వపు పోటీలు నిర్వహించారు. అంశం నా స్మృతి పథం లో లేదు. కానీ ఆంగ్ల మాధ్యమం లో మాట్లాడిన నాకు మళ్లీ ద్వితీయ బహుమతి వచ్చింది. ఈసారి జ్యూరీ గా వ్యవహరించిన ప్రొఫెసర్ నీరజ మమత్వ ధోరణి తో కాక, సమత్వ ధోరణితోనే నన్ను ఆ స్థానం లో నిలిపారు. 

అలాగే ఒక సారి క్లాస్ సెమినార్ చెప్పమని ఆచార్య ప్రకాశ్ బాబు గారు నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయన కేంద్రీయ విశ్వవిద్యాలయం లో పనిచేస్తున్నారు. సెమినార్ లో నేను కుప్పకూలినంత పనయ్యింది. గంట టాపిక్ ఐదు నిమిషాల్లో ముగించి మా మిత్రుల మధ్య వచ్చి కూలబడ్డాను. 

ఇలా వచ్చిన వరుస వైఫ్యల్యాలు నాలో కసిని పెంచాయి. అప్పటికే సివిల్ సర్వీసెస్ కోసం కోచింగ్ తీసుకుని ఉండడం వలన ఇక ఏ మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్ ను నిర్లక్ష్యం చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాను. నా భయానికి కారణాలు అన్వేషించడం మొదలెట్టాను. వాటిని క్రింద పేర్కొంటున్నాను. 

  • Fear of Rejection - ఇది ప్రధానమైనది. శ్రోతలు మన భావాలను అంగీకరించరేమో అనే భయం. దీనిని వదిలిపెట్టాలి. 
  • ఆత్మ న్యూనతా భావం 
  • మాట్లాడడానికి తగిన విషయ పరిజ్ఞానం లేకపోవడం. 
  • స్టేజ్ మీద మన కంటే పై స్థాయి అధికారులు, ఆచార్యులు ఉండడం 
  • బహుమతి రాదేమోనన్న భయం 
  • ఎక్కువ మంది జనాలను చూస్తే హృదయ స్పందన వేగం పెరగడం
వీటన్నిటినీ నేను మెల్లమెల్లగా అధిగమిస్తూ వచ్చాను. ఈ స్టేజ్ ఫియర్ ను వ్యూహాత్మకంగా ఎదుర్కొన్నాను. ఆ వైనం కూడా ఇక్కడ ముచ్చటిస్తాను. 
  • మాట్లాడడానికి వచ్చిన ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకున్నాను. ముఖ్యంగా  welcome మరియు farewell ఫంక్షన్ లాంటి వాటిలో ప్రధాన భూమికను పోషిస్తూ వచ్చాను. భయాన్ని ఎదుర్కోవాలి కానీ తప్పించుకు తిరగకూడదు. 
  • సివిల్ సర్వీసెస్ కోచింగ్ నేపథ్యం ఉండడం వలన హాస్టల్లో  గ్రూప్ డిస్కషన్ పెట్టేవాడిని. నిదానంగా గ్రూప్ సైజ్ పెరుగుతూ వచ్చి, నా చుట్టూ జనం చేరడం మొదలెట్టారు. 
  • ఇంట్లో డ్రెస్సింగ్ టేబల్ ముందు నిలబడి ప్రాక్టీస్ చేసేవాడిని. నా ఆంగికం, వాచికం, అభినయాల మీద పట్టు ఇలా సాధించాను. దీనితో స్వీయ గౌరవం పెరిగింది. నన్ను నేను అంగీకరించుకోవడమే కాకుండా, అభినందించుకోవడం మొదలెట్టాను. 
  • మాట్లాడే విషయాన్ని చిన్న చిన్న అంశాలుగా విడదీయడం నేర్చుకున్నాను. అంశాల ప్రాధాన్యతా క్రమాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలి అని తెలిసివచ్చింది. 
  • ప్రతి అంశానికి సంబంధించిన reflective data సేకరించడం మొదలెట్టాను. దీని వలన మీరు మాట్లాడిన అంశానికి శాస్త్రీయత మరియు సాధికారత చేకూరతాయి. ఇవి చాలు మీరు అందరి ఆమోదం పొందడానికి. 
  • పిట్ట కథలు, జోక్స్ జోడించడం మొదలెట్టాను. 
  • నేను 1996 లో శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో జూనియర్ రీసెర్చ్ ఫెల్లో గా చేరాను ( దీనిని మధ్యలో మానేశాను అనుకోండి. దానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఉన్నాయి). అప్పుడు పీజీ పిల్లలకు పాఠాలు బోధించేవాడిని. దీని వలన నాకు స్టేజ్ ఫియర్ పూర్తీగా పోయింది. 
  • సివిల్ సర్వీసెస్ పరీక్ష లో నా రెండవ ఐచ్చికం తెలుగు సాహిత్యం కాబట్టి నాకు ప్రాచీన సాహిత్యం మీద పట్టు వచ్చింది. పద్య పఠనం అలవాటయ్యింది. ధారణ, ధారా శుద్ది ఒక దాని తరువాత ఒకటి వచ్చి నేను మాట్లాడే అంశానికి ప్రాసంగికతను జోడించాయి. 
  • విద్యార్థి దశ నుంచి సగటున వారానికి ఒక పుస్తకం అన్నా చదివేవాడిని. ఈ అలవాటు ఇప్పటికీ ఉండడం వలన ప్రసంగించేటప్పుడు తత్సంబంధిత అంశాలు నాకు స్పురణకు రావడం మొదలెట్టాయి. 
  • ఇప్పుడైతే మాట్లాడే ప్రతి అంశానికి sense of humour జోడించడం వలన అవకాశాలు నాకు వెల్లువెత్తడం మొదలెట్టాయి. స్కూల్ టీచర్స్ శిక్షణా తరగతులకు, నెహ్రూ యువ కేంద్ర వారి యువత శిక్షణా తరగతులకు నేను ఆస్థాన విద్వాంసుడిని అయిపోయాను. మా అధ్యాపకులకు కూడా ఇప్పుడు నేనో శిక్షకుడిని. ANSET తరపున స్కూల్స్ కు వెళ్లి skill development మీద విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను. 
  • అన్నిటికంటే ముఖ్యంగా Police Training Center లో IPS officers, DSP, CI, SI స్థాయిలలో ఉన్న వారికి linguistics skills, crisis management, time management లాంటి వాటి మీద అవగాహనా సదస్సులకు resource person గా హాజరు అవుతూ ఉంటాను. 
  • వక్తగా విజయం సాధించాలి అంటే అందరినీ కలుపుకు పోవాలి. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకూడదు. భావోద్వేగాల మీద పట్టు ఉండాలి. ఆవేశం ఉండకూడదు. వైరుధ్యాలను సైతం సమన్వయం చేయగల నేర్పు ఉండాలి. 
  • ఇప్పటి వరకు నేను ఒక లక్ష మంది విద్యార్థులను కలిసి ఉంటాను. ఇవన్నీ నా భయాన్ని బలంగా మార్చుకోవడం వల్లనే సాధ్యమయ్యాయి. 
  • చదివింది రాయడం, రాసింది చదవడం కూడా అలవాటు చేసుకోండి. అప్పుడు మాట్లాడడం సహజంగానే వస్తుంది. 
  • మరో ముఖ్య విషయం. ఎంత విషయ పరిజ్ఞానం ఉన్నా కూడా వినయం లేకుంటే రాణించదు. కాబట్టి చెప్పే అంశం హితంగా, మితంగా ఉండేలా జాగ్రత్త పడ్డాను. 
ఇలా స్టేజ్ ఫియర్ ను నేను అధిగమించడం నాకు వృత్తి రీత్యా ఎంతో మేలు చేసింది. 
ఇక మిగిలిన భయాలు నాకు అడ్డంకి కాకపోవడంతో నేను వాటి మీద ఎక్కువ ధ్యాస పెట్టలేదు. ఇప్పటికీ నాకు కుక్కలంటే భయం. నా పిక్కను ఓ బర్గర్ గా భావించి ఎక్కడ ఒక బైట్ తీసుకుంటాయో అని భయం. స్టాఫ్ మీటింగ్ లన్నా భయమే. ఇలాంటి భయాలను జయించలేనప్పుడు అంగీకరించడం నేర్చుకున్నాను. వాటితో సహజీవనం చేయడం అలవరుచుకున్నాను. భయాన్ని మీరు లొంగదీసుకోకుంటే, అది మిమ్మల్ని లొంగదీసుకుంటుంది. మీ భయం వలన మీరు ఇతరులకు చులకన అవుతారు. శాస్త్రీయంగా భయాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి. 
'అభయం సర్వ భూతేభ్యో' అన్నారు ఆచార్యులు గీతలో. భయపెట్టడం మృగ లక్షణం, భయపడడం పశు లక్షణం. రెండూ వద్ధు. భయపడకండి.. భయపెట్టకండి. 


Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Enormous fear ia outrageous.

    Minimum fear is worrisome

    Maximum fear leads no where.

    And fear is psychological.

    The more you fear the more disastrous courses will go.

    So understanding death, being fearless about time which is always a pregnant are the two remedies that i practice in my life to get rid of it.

    Human being intrinsically have desires that causes dreams, wants and eventually fears.

    The kind of fears people cultivate is countless. One imagines more in his closed eyes than in his opened eyes.

    So.. The writing is on the Wall

    "Scare your fear".

    ReplyDelete
    Replies
    1. భయాన్ని భయపెడదాం రండి టైటిల్ తో మరో ఆర్టికల్ రాస్తా. Million thanks

      Delete

Post a Comment

Popular posts from this blog