నా జూనియర్ కాలేజీ కథా కమామిషు
నేను అత్తెసరు మార్కులతో పదవ తరగతి పాస్ అయినప్పటికీ, నాకు Bi.P.C ఇంగ్షీషు మీడియం లో సీటు వచ్చింది. నా ఇంటర్ విద్యా సంవత్సరం 1986-88. నేను మొదట తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో చేరాను. అనంతపురం జిల్లాలో జిల్లా కేంద్రం వదిలేస్తే, ఆంగ్ల మాధ్యమం ఒక్క తాడిపత్రి లో మాత్రమే ఉండడం నా అదృష్టం. అప్పుడు మా కాలేజీ ప్రిన్సిపల్ వీరారెడ్డి. పీలగా ఉన్నా కూడా నాకు ఆయనను చూస్తే ఏదో తుత్తరగా ఉండేది. ప్రిన్సిపల్ గా ఉన్నా కూడా ఆయన మాకు జువాలజీ క్లాసులు తీసుకునే వాడు. నాకు బాగా గుర్తు ఏమంటే వీరారెడ్డి గారు మాకు మలేరియా పరాన్నజీవి జీవిత చక్రం ఆంగ్లం లో చెపుతూ, 'Liver ను తెలుగులో ఏమంటారు?' అని అడిగాడు. ఆయనను చూస్తే నాకున్న భయం తో నేను 'ఊపిరితిత్తి ' అని జవాబు చెప్పడంతో ఆయన ఖంగు తిన్నాడు. అలాగే మా తెలుగు మాస్టారు 'ఏదైనా ఒక వేదం పేరు చెప్పండి' అని అడిగితే, ఒక బడుద్ధాయి 'ఆయుర్వేదం' అన్నాడు. మా తెలుగు మాస్టారుకు వాడి సమాధానానికి ముచ్చెమటలు పట్టాయి. ఇలా సరదాగా ఒక నెల గడిచిపోయింది. తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మాకు పాఠం చెప్పిన వాళ్ళల్లో నాకు బాగా గుర్తున్న మాస్టారు జువాలజీ దస్తగిరి గారు. తరువాత ఈయనను 1999 -2000 మధ్యలో నేను చిత్తూర్ విజ్ఞాన సుధ కాలేజీ లో పనిచేస్తున్నప్పుడు చూసాను. ఈ పరిచయం నేను విజ్ఞాన సుధ లో నిలదొక్కుకోవడానికి బాగా పనికొచ్చింది. ఇలా ఉండగానే మా నాన్నకు తిరిగి అనంతపురం బదిలీ కావడంతో, నేను టీసీ మీద అనంతపురం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో వచ్చి చేరిపోయాను.
అనంతపురం టౌన్ కు వచ్చిన తరువాత నాకు మోతాదు మించిన స్వేచ్చ వచ్చినట్టయింది. చదువు మందగించి, తిరుగుడు పెరిగింది. నేను ఇంటర్ మొదటి సంవత్సరం లో ఉండగానే దూరదర్శన్ ప్రసారాలు మొదలయ్యాయి. ఇంటికి viola tv వచ్చింది. నాకు వయసొచ్చింది.
శుక్రవారం రాత్రి చిత్రలహరి , ఆదివారం సాయంత్రం వచ్చే సినిమాల కోసం ఇంట్లో అందరూ ఎదురు చూడడం అనేది ఒక మధురమైన జ్ఞాపకం. ఊరిలో బోలెడన్ని థియేటర్లు. సినిమాల మీద సినిమాలు చూడడం మొదలెట్టాను. క్లాసులు పెద్దగా జరిగేవి కావు. తెలుగు, ఇంగ్షీషు క్లాసులు అంటే పడిచచ్చేవాణ్ణి. సబ్జెక్ట్స్ లో జువాలజీ ఒకటే ఇష్టపడేవాణ్ణి. సినిమాలు, షికార్లు ఎక్కువ అవడంతో ఇంటర్ మొదటి ఏడాదిలో బాటనీ, జువాలజీ మరియు కెమిస్ట్రీ మూడు సబ్జెక్ట్స్ లో తప్పాను. విచిత్రంగా ఫిజిక్స్ మాత్రం పాస్ అయ్యాను. మూడు సబ్జెక్ట్స్ కలిపి నాకు కేవలం 17 మార్కులు వచ్చాయి. వైఫల్యం ఇచ్చే బాధ నాకు తెలిసి వచ్చింది కాబట్టే ఇప్పుడు నా విద్యార్థుల వైఫల్యాలను గౌరవించగలుగుతున్నాను.
ఇలా ఇంటర్ మొదటి ఏడాది ఫెయిల్ కావడంతో మా ఇంట్లో నన్ను వాసుదేవరావ్ గారి వద్ధ కెమిస్ట్రీ ట్యూషన్ కు వదిలారు. ఆయన ప్రతి ఆదివారం పరీక్ష పెట్టేవారు. ఈయన చెప్పిన organic chemistry నాకు ఇంకా గుర్తుకు ఉంది. ఒక అధ్యాపకుడు పాఠం ఎలా చెప్పాలో ఈయనను చూసి నేర్చుకున్నాను. నోట్స్ కూడా dictate చేసేవారు. ఆయన నా దృష్టిలో chemist కాదు, నన్ను మార్చిన alchemist. ఆ ధారా, ధారణా ఇప్పటి వరకు నేను మరెవరిలో చూడలేదు. వాసుదేవరావు గారి వలన నాకు చదువు మీద శ్రద్ద పెరిగింది. కొద్దిగా పుంజుకుని ఇంటర్ 575 మార్కులతో పాస్ అయిపోయాను. తరువాత EAMCET లో 5000 ర్యాంక్ వచ్చింది. నా జూనియర్ కాలేజీ జీవితం ఇలా వరుస వైఫ్యల్యాల లాగా మీకనిపించినప్పటికీ, నేను వాటిని అధిగమించిన తీరు ఈ క్రింద పేర్కొంటున్నాను.
- Failure మరియు success అనేవి అనివార్యమైన దశలు. అపజయాన్ని అంగీకరించాలి. ప్రతి ఓటమి గెలుపుకు ఒక మలుపు.
- ఒకప్పుడు EAMCET 5000 ర్యాంక్ తెచ్చుకున్న నేను EAMCET trainer గా తదనంతర కాలం లో చిత్తూర్ విజ్ఞాన సుధలో రెండున్నర సంవత్సరాలు పనిచేశాను. ఏ సెట్ అయినా కాకున్నా జీవితం లో upset మాత్రం కాకూడదు సుమీ!!!! జీవితం యొక్క విస్తృతి విజయం కంటే పెద్దది.
- విజయం కోసం తొందర పడకూడదు. జీవన గమనంలో ఏ మలుపు లోనో గెలుపు నీతో కరచాలనం చేయడం తథ్యం.
- ఎప్పటి పాఠాలు అప్పుడే revise చేసుకుంటే అపజయం రాదని గ్రహించాను. గెలుపు కన్నా ఓటమి గొప్ప టీచర్.
- listening skills గెలుపును సాధించడం లో ప్రధాన పాత్రను పోషిస్తాయి.
- ఇంటర్ దశ చాలా కీలకం. ఆ దశలో ప్రలోభాలు ముదురుతాయి. నాకు ఇంటర్ లో ఎవరి ప్రభావం వల్లనో మరి ప్రబంధ సాహిత్యం చదవడం అలవాటయ్యింది. తరువాత అదో వ్యసనం అయ్యింది. కళాపూర్ణోదయం తో మొదలు పెట్టి మను చరిత్ర వరకు చదివేశాను. రాధికా సాంత్వనం చదివి ఎంతో సాంత్వన పొందాను. మను చరిత్ర లో వరూధిని వయో విలాసాన్ని పెద్దన వర్ణించిన తీరు నా నాడీ తంత్రులను వెర్రెక్కించి వదిలేసింది. పెద్దన వరూధిని కళ్లను 'ఇంతలేసి కళ్లు' అని వర్ణిస్తే , నేను వరూధిని ప్రతి పొంకాన్ని, బింకాన్ని అంతలేసి ఊహించుకుని తెగ మురిసిపోయేవాడిని. ఇక కళా పూర్ణోదయం,రాధికా సాంత్వనం లో ప్రబంధ నాయికల తీరు తెన్ను చదివిన తరువాత నేను ఒక చోట స్థిరంగా కూచోలేక పోయాను. చంద్రరేఖా విలాపం ప్రబంధం అయితే నాకు గంగ వెర్రులెక్కిచ్చింది. నాకున్న మితమైన తెలుగు పరిజ్ఞానం వలన నాకు అప్పట్లో ప్రబంధ సాహిత్యం కేవలం పొడి పొడిగా మాత్రమే అర్థమయ్యింది. పొడి పొడిగా అర్థం చేసుకున్న నేను వాటిని చదువుతుండగానే మొదట తడి పొడిగా, చివరకు తడి తడి గా అయిపోయేవాడిని. అది ఏమి పద గుంభనం? అది ఏమి వాగ్వైచిత్రి? నా జీవితం అప్పుడే ధన్యమై పోయిందన్న ఫీల్ వచ్చేసింది. నేను విద్యార్థులకు చెప్పదలిచింది ఏమంటే వీలైనన్ని భాషా ప్రయోగాలను నేర్చుకోండి. గెలిచి తీరుతారు.
- ఇంతకు నేను ఇంటర్ లో చదవ వలసిన క్లాస్ పుస్తకాలు తప్ప మిగిలినవన్నీ తెగ చదివేసాను. యండమూరిని , మల్లాదిని చదవడం ఇంటర్ లో మొదలెట్టాను. వ్యసనాలు గా భావించిన వన్నీ చివరకు నా వ్యక్తిత్వ వికాసానికి దోహదపడ్డాయి. నాకు అర్థం అయ్యింది ఒక్కటే.. గెలవాలి అంటే ఏదో ఒకటి చదవాలి అని.
Lo, the life.... It's ebb is the highest.
ReplyDeleteLife has courtesy towards all and sundry in all through it.
Childhood memories often haunt us in its own ways.
The sweetest, darkest and brightest of all memories have shadows.
These shadows appear nostalgic in our cranium like eclipses.
Not all eclipses are dark, some are unforgettable, unseen, insane and definite.
Reading at teenage is the making of our mind.
Neitsczhe mentioned "the books are conversations with the dead authors".
"Converse and converse with the dead, so you become more alive while preparing be dead" I say.
Read, write, re-ead, re-write and keep rewriting again... It is like a circadian rhythm of one's life.
And many of the memories of life with literature makes author, reader and writer in us ecstatic.
Wonderful life is yours with all the ebbs and flow.
Great. Grandiloquent in its way.
Lo, the life.... It's ebb is the highest.