పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుభవాలు 

1991 లో డిగ్రీ పూర్తి అయిన వెంటనే శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం లో పీజీ చేరడానికి ప్రవేశ పరీక్షలు రాసాను. మైక్రో బయాలజీ , బయోకెమిస్ట్రీ మరియు జువాలజీ మూడింటికీ ప్రవేశ పరీక్షలు రాసాను. అప్పట్లో డిగ్రీ మార్క్స్ కు కూడా వెయిటేజ్ ఉండడం వలన నాకు దేని లోనూ సీట్ రాలేదు. అంతా మన మంచికే అనే విజ్ఞత అప్పుడు లేదు కాబట్టి, బాగా బాధ పడ్డాను. అంతలో మా మేనమామ వరద రాజులు ప్రోత్సాహం వలన RC Reddy ఇన్స్స్టిట్యూట్ లో సివిల్ సర్వీసెస్ కోచింగ్ చేరిపోయాను. మా మామకు అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. ఆయన నేషనల్ ఎయిర్ పోర్ట్ అథారిటీ లో బేగంపేట విమానాశ్రయం లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా పనిచేసేవాడు. నేను మా మామ గదిలో ఉండి చదువుకునేటప్పుడే నాతో పాటుగా శివ నారాయణ స్వామి కూడా ఉండేవాడు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో DSP గా విధులు నిర్వహిస్తున్నాడు. లెక్కల్లో దిట్ట. రవిచంద్రన్ అని మరో సహచరుడు ఉండేవాడు. అతనికి సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది. ఇతను కూడా గణితం లో విశేష ప్రతిభ కలిగిఉండేవాడు. అందుకే వీరివురికి అనేక ఉద్యోగాలు వచ్చాయి. గణితం నేర్చుకుంటే జీవితంలో త్వరగా స్థిరపడవొచ్చు అని నాకర్థమయ్యింది అప్పుడే. 

నా సివిల్ సర్వీసెస్ కోచింగ్ గురించి నేను 'నా కోరా రాతలు' లో ప్రస్తావించడం వలన ఇక్కడ ప్రస్తావిస్తే పునరుక్తి దోషం ఆపాదించబడుతుంది కాబట్టి చేయడం లేదు. 1992 సంవత్సరం లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు పీజీ కోర్సులకు మొదటిసారిగా ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. నేను జువాలజీ లో MSc చేయాలని నిర్ధారించుకుని అప్లై చేసాను. రెండవ ర్యాంక్ వచ్చింది. తక్షణమే చేరిపోయాను. అదృష్టవశాత్తు మా నాన్నకు తిరుపతికి ఆ సమయానికి బదిలీ అవడం నాకు బాగా కలిసి వచ్చింది. అలా పీజీ చేసేటప్పుడు కూడా నాకు హాస్టల్ లో ఉండే అవసరం లేకపోయింది. అప్పుడప్పుడు హాస్టల్ కు వెళ్లి భోంచేసేవాడిని. మా మిత్రులు అంతా B బ్లాక్ లో ఉండేవారు. 

వెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్ అంతా పచ్చదనం పరుచుకుని ఉంటుంది. ఇప్పటికీ అంతే. సుమారు నలభై మంది ఉండేవారు మా తరగతిలో. ఆడిటోరియంలో చాలా కార్యక్రమాలు జరిగేవి. మొదటిసారి నేను అక్కడే పట్టాభిరామ్ గారిని చూసాను. హిప్నాటిజం మీద ఒక ప్రదర్శన ఇచ్చారు ఆయన. కాంటీన్ ఉండేది. అప్పట్లో నేను MBA విద్యార్థులను చూసి కుళ్లుకునేవాడిని. వాళ్లు కోటు వేసుకుని వచ్చేవారు. అప్పట్లోనే బృంద చర్చలు లాంటి నూతన విధానాలను ఆ డిపార్ట్మెంట్ వాళ్లు అనుసరించేవారు. తిరుపతి క్యాంపస్ నాకు తెగ నచ్చేసింది. మా ఇల్లు కూడా కొండకు ఇంచుమించు ఆనుకుని కపిలతీర్థం రోడ్డు లోని ద్వారకా నగర్ లో ఉండేది. తిరుపతి ఎప్పటికీ నిద్రపోని నగరం. వీధుల నిండా ఎప్పుడూ భక్తుల సందడి. నడక దారిలో పోయే వాళ్లు చాలా మంది 'గోవిందా!!! గోవిందా! ' అని ఎలుగెత్తి అరుస్తూ మా ఇంటి ముందు నుంచే వెళ్లేవారు. కపిలతీర్థం వర్షాలు వచ్చినప్పుడు ఉధృతంగా ప్రవహించేది. పీజీ లో నాకు దొరికిన మిత్ర బృందంలో చాలా మంది  పోటీ పరీక్షలకు బాగా సన్నద్ధం అయ్యేవారు. అందరూ ఇప్పుడు ఉన్నత పదవుల్లో స్థిరపడిపోయారు. 

తిరుపతి లో గుళ్లు , గోపురాలు ఎక్కువ కాబట్టి నాకు చరిత్ర మీద వ్యామోహం కలిగింది. సివిల్ సర్వీసెస్ కోచింగ్  నేపథ్యం అప్పటికే ఎలాగూ ఉంది. గుళ్లను ఆధ్యాత్మిక, చారిత్రిక, సామాజిక, తాత్విక మరియు తార్కిక కోణంలో దర్శించడం మొదలెట్టాను. మా ఇంటికి వచ్చిన బంధువులందరికీ నేనే గైడ్ గా వ్యవహరించేవాడిని. అప్పుడప్పుడు కాలేజీ ఎగరగొట్టేవాడిని. పరీక్ష రాయడానికి condonation fee కట్టినట్టు గుర్తు. పీజీ లో ఉండగానే తమిళనాడు టూర్ ఆరు రోజుల పాటు వెళ్లాము. ఊటీ, మధురై, మేల్ మరువత్తూర్, సమయపురం, శ్రీ రంగం, మహా బలిపురం, తంజావూర్ మరియు కన్యాకుమారి లాంటివన్నీ చూసేసాను. రామేశ్వరం కూడా వెళ్లాము. ఈ టూర్ మొత్తం నరసింహ మూర్తి నాయకత్వం లో జరిగింది. ఒక టూర్ ను ఎంత సమర్థవంతంగా నిర్వహించాలో ఇతడిని చూసి నేర్చుకున్నాను.  విద్యార్థి దశలో టూర్ వెళ్లే అవకాశం ఎవరూ వదులుకోకూడదనేది నా అభిప్రాయం. 

వెంకటేశ్వర యూనివర్సిటీ లో చదువుకునేటప్పుడు మిత్రులతో కలిసి కాలి నడకన కొండ చాలా సార్లు ఎక్కాను. ఇలా ఒక పదిహేను సార్లు ఎక్కి ఉంటాను. చాలా అరుదైన జంతు, వృక్ష జాతులు తిరుమల లో ఉన్నట్టు మా ఆచార్యులు చాలా మంది చెప్పేవారు. పీజీ లో నాకు నందకుమార్ మాస్టారు చెప్పే పాఠాలు ఇష్టమయ్యేవి. చాలా సరళమైన ఆంగ్లం లో హాస్య స్పోరకంగా పాఠం చెప్పేవారు ఆయన. Lesson plan ఎలా వేసుకోవాలో నందకుమార్ గారిని చూసి నేర్చుకోవాలి. Prairie dog community గురించి ఆయన చెప్పిన పాఠాన్ని నేను ఇంకా మర్చిపోలేదు. పాఠం చెప్పేటప్పుడు ప్రతి మాస్టారు గుర్తుకు ఉంచుకోవాల్సిన అంశాలు ఈ క్రింద ఇస్తున్నాను. 

  • Black board management 
  • Selection of words 
  • Sense of humour 
  • Reflective data 
  • Relevant diagrams 
ఇప్పటిలాగా అప్పట్లో డిజిటల్ క్లాస్ రూములు లేవు మాకు. కానీ సాంప్రదాయక పద్దతిలోనే చక్కగా బోధించే వారు. నందకుమార్ గారు నాకు ఆదర్శ గురువు. 
మేము పీజీ మొదటి ఏడాదిలో ఉండగా ఒక అంతర్జాతీయ సదస్సు ఆచార్య రామ్మూర్తి గారి ఆధ్వర్యం లో జరిగింది. విదేశాల నుంచి కూడా చాలా మంది సదస్సుకు హాజరయ్యారు. అప్పుడు మేమంతా ఫుడ్ కమిటీ లో ఉండి వచ్చిన అతిథులకు భోజన ఏర్పాట్లు చూసాము. ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు కమిటీలు వేయడం అనే పద్దతి మంచిదని అప్పుడు నాకు అర్థం అయ్యింది. 
పీజీ లో ఉండగానే నా వ్యాసం Competition Success Review లో బహుమతికి ఎంపిక అయ్యింది. తరువాత మరో వ్యాసానికి Competition Refresher లో ద్వితీయ బహుమతి వచ్చింది. తరువాత చాలా ఏళ్ళకు నా వ్యాసానికి Civil Services Chronicle లో ప్రథమ బహుమతి వచ్చింది. వ్యాసం రాసేటప్పుడు ఈ క్రింది అంశాలు ఉండేలా చూసుకోవాలి. 
  • సామాజిక కోణాలు 
  • చారిత్రిక కోణాలు 
  • భౌగోళిక కోణాలు 
  • సాంస్కృతిక కోణాలు 
  • వైయక్తిక కోణాలు 
వ్యాసం రాసేటప్పుడు General to Specific పద్దతి పాటించాలని నాకు అర్థం అయ్యింది. అసలు ఏ ప్రశ్నకు జవాబైనా సానుకూల ధోరణితో ముగించాలి. ఒక అంశం గురించి రాసే వ్యాసం లో మొదటి నుంచి చివరి వరకు evolution of thought కనిపించాలి. చెప్పదలుచుకున్న అంశం మీద స్పష్టత మరియు చెప్పే తీరులో సాధికారత ఉండాలి. వ్యాసం లో సరళమైన పదాలు మాత్రమే వాడాలి. మన పాండిత్య ప్రకర్ష కంటే, చెప్పదలుచుకున్న అంశం పాఠకుల హృదయానికి హత్తుకోవడమే ముఖ్యంగా భావించాలి. 
ఇక ప్రొఫెసర్ ఇందిరా శ్రీ రామ్ గారి నుంచి నేను నేర్చుకున్న అంశాలు క్రింద పేర్కొంటున్నాను. 
  • Eye contact : క్లాస్ మొత్తాన్ని కళ్లతో నే అదుపు చేసేవారు. 
  • Body language : ఈమెను చూసిన మరుక్షణమే పూజ్య భావం కలిగి అటెన్షన్ లోకి వెళ్లిపోయేవాళ్లం మేమంతా. 
  • Clarity of thought : పాఠం చెప్పేటప్పుడు అంశాల వారిగా ఒక ప్రాధాన్యతా క్రమాన్ని పాటించేవారు. 
క్యాంపస్ లో తాజ్ మహల్ లాగా ఉన్న లైబ్రరీ ఉంది. అక్కడ వాతావరణం ఎవరినైనా కుదురుగా కూచుని చదువుకునేలా ప్రేరేపిస్తుంది. నేను కొన్ని గంటల పాటు స్థిరంగా కూచోవడం అక్కడే నేర్చుకున్నాను. పీజీ ముగిసిన ఏడాది లోనే NET, GATE పరీక్షలు ప్యాస్ అయ్యాను. ఈ విజయాలు నా ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. 
మొత్తానికి టీచింగ్ కు సంబంధించిన చాలా అంశాలు నేను పీజీ లోనే  నేర్చుకున్నాను. కానీ నాకు బోధనా వృత్తిలోకి ప్రవేశించాలన్న తలంపు ఇసుమంతైనా ఉండేది కాదు. అందుకే నేను B.Ed చేయలేదు. కానీ ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోతుంది అన్నట్టుగా నేను అధ్యాపక వృత్తి లోకి ప్రవేశించాను. ఇదంతా కూడా నా వ్యక్తిగత పరిమితులను అధిగమించడం వలన మాత్రమే  సాధ్యం అయ్యింది. Teaching is a science and teaching is an art అనే విషయం నాకు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో అర్థమయ్యింది. పాఠం చెప్పడం ఒక ప్రసవ వేదన. పాఠం బాగా వస్తే, ఆ అనుభూతి పుత్ర పరిష్వంగ సుఖానికి సాటి. ఒక తరాన్ని తలెత్తుకుని నిలబడేలా చేయగలిగేది ఒక టీచర్ మాత్రమే అనేది నాకు పీజీ లోనే అర్థమయ్యింది. నేను నమ్మేది ఒక్కటే........ మా గురువుల చైతన్యమే నాలో, నా శిష్యులలో అనుస్యూతంగా కొనసాగుతోంది. ఇప్పుడు నాలో కనిపించేదంతా గురువు వైభవమే, నాలో పలికేదంతా గురువు వచో విలాసమే. చాలా మంది గురువులు నన్ను ఉలి తో తొలిచి మలిచారు. అమ్మవారి ఆకృతికి సకల దేవతలు అవయవ దానం చేసినట్టు, నా వ్యక్తిత్వం రూపొందడానికి చాలా మంది గురువులు నాకు వివిధ నైపుణ్యాలను ధారాదత్తం చేసారు. ఇప్పుడు నేనో వ్యష్టి కాదు. నేనొక సమిష్టి. 
    
                                            నా గురు మండలికి శత సహస్ర వందనాలు 

Comments

  1. 💐🌹👌🌹🤝🌹🙏🌹🇮🇳🌹❤️🌹💐

    ReplyDelete
  2. మీతో జర్నీ ఆహ్లాదకరంగా ఉంది సార్.

    ReplyDelete
  3. ధన్యవాదాలు చౌదరీ

    ReplyDelete
  4. Exciting to read and write about your stories.

    A student learns from his own teachers', teaches to his students and out of few become teachers, learn and teach or learning while teaching or teaching and learning. This cycle goes on and on.

    The fountain of knowledge always flows and flows, floods, cascades in its own intensive torrents from generation to generation.

    Your experiences in young adult age is a delicious sweet to swallow. Very few get an opportunity to go through prestigious universities.

    Education at the right age is a gift of the God. Quality education from high level teachers is a manna from heaven. Educate and get educated to transform thinking of the society.

    We often meet teachers, but we dont meet masters. Be a story-teller, master, and effective teacher who can impart skills.

    And finally, god blesses those who learns themselves.

    ReplyDelete
  5. This article reminds me my PG Days in SV University. No wonder, who ever goes there, they surely admire the greenery of University. Teaching style of Indira mam, Nanda Kumar sir is unforgettable. It has a long lasting impact on us which shaped all our careers. They are truly role models. Even in the next births if they are teachers I will be their student...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog