ఫిబ్రవరి 2 , 2025  నాకు ఒక మరపురాని మధురానుభూతిని పంచింది. దానికి కారణం నేను రాళ్లపల్లి లో జరగబోతున్న రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావడమే.  నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినది రాళ్లపల్లి వాస్తవ్యుడైన కృష్ణ మోహన్ రెడ్డి. ఈయన ఇంజనీర్ గా తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూనే, గ్రామంలో వ్యవసాయం కూడా చూసుకుంటున్నారు. కృష్ణ మోహన్ గారు ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వెంటనే నేను ఎగిరిగెంతేసి ఒప్పుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి పేరు వింటూనే ఉన్నాను. ఆయన నా బాల్యం లో మా ఇంటికి వచ్చేవారని మా తాత చెప్పేవారు. నేను మరీ చిన్న వాడిని కావడంతో ఆయనను భౌతికంగా చూసిన గుర్తుకులేదు. నేను ఇంటర్ లో ఉండగా మా తెలుగు పాఠ్య పుస్తకం లో రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు రాసిన 'నిగమ శర్మ అక్క' పాఠం ఉండేది. దానిలో ఉన్న 'పరిహాసము పవిత్ర వస్తువును కూడా గమనించదేమో' అనే వాక్యం నాకిప్పటికీ గుర్తు. అదే విధంగా నేను తిరుపతి లో ఉన్నప్పుడు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు అన్నమయ్య సంకీర్తనలలో 108 కీర్తనలకు సంగీతాన్ని సమకూర్చారని విన్నాను. మరో విషయం రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి కుమారుడు జయంత్ గారి ఇల్లు తిరుపతిలో మా ఇంటి వెనకాలే ఉండింది. ఇలా నాకు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి గురించి అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. అందునా రాళ్లపల్లి కూడా మా గూళ్యం లాగే ఒకప్పుడు శ్రోత్రీయ గ్రామం. నాకు మరి రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారితో ఉన్న ఈ భావ సంబంధ అనుబంధం వలన నేను ఈ రోజు రాళ్లపల్లి లో ఏర్పాటు చేసిన సంస్మరణ కు హాజరు కావడానికి ఒప్పుకున్నాను. 

నాతో పాటుగా మరో వక్తగా అంకె శ్రీనివాసులుకు కూడా ఆహ్వానం అందింది. అంకె శ్రీనివాస్ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి మీద ఒక minor research project చేసాడు. అతని వద్ద శర్మ గారి గురించి సాధికారికమైన సమాచారం ఉంది. దానిని అంకె పుస్తక రూపంలో ప్రచురించడం కూడా జరిగింది. ఉదయాన్నే 8.30 గంటలకు నా కియా కారెన్స్ లో రాళ్లపల్లి కి నేను అంకె కుటుంబ సభ్యులు బయలుదేరాము. అంకె శ్రీనివాస్ సహధర్మచారిణి పేరిందేవి కళ్యాణదుర్గం లో model school వద్ద దిగిపోయారు. నేను, అంకె శ్రీనివాస్ మరియు అతని కూతురు రాళ్లపల్లి చేరుకోవడానికి 10.30 పట్టింది. అంటే ఇంచుమించు అనంతపురం నుంచి రెండు గంటల ప్రయాణం చేశాము. 

ఊరి వారికి నేను ఎవరో తెలియకున్నా కూడా చాలా సాదరంగా పలకరించారు. కాసేపు మాటా  మంతి అయిన తరువాత సురేంద్ర అనే యువకుడు మమ్మల్ని గ్రామం లో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి పిలుచుకు పోయారు. ఈ ఆంజనేయ స్వామి గుడి రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి కాలంలో నే నిర్మించారు. ఒకప్పుడు గ్రామం ఈ గుడి చుట్టూ ఉండేదట. ఈ గుడి వద్దే రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి ఇల్లు ఉండేదట. ఇప్పుడు ఆ గృహం ఆనవాళ్లు కూడా లేవు. కాలం ఎంత కర్కశమైనదో కదా!!!! ఏ జ్ఞాపకాన్నైనా తుడిపివేయడంలో కాలం తెంపరితనం అందరికీ తెలిసిందే కదా!!!! గుడి లోపల ఉన్న హనుమంతుడి విగ్రహం అభయ ముద్రలో ఉంది. అంతరాలయం లో కూచుని విష్ణు సహస్రనామ పారాయణం చేసాను. గుడి పరిసరాలు ప్రకృతి రమణీయతతో అలరారుతున్నాయి. 

సభ జరిగే ప్రదేశానికి తిరిగి వెళ్లాము. అప్పటికీ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి వంశీకులు అయిన నందనందన్ , చేట్లూరి నళిని, శ్యామ్ సుందర్ తదితరులు వచ్చారు. వారిని నేను ఇదే మొదటి సారి చూడడం. వీరందరితో కలిసి మరో సారి జ్యోతుల ఊరేగింపుతో పాటు రాముల వారి గుడికి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్లాము. గ్రామంలో పెద్దమ్మ శిలా రూపంలో ప్రతిష్టించబడి ఉంది. ఈ జ్యోతుల మహోత్సవం చాలా బాగా ఉంది. డప్పు వాయిద్యాలతో మమ్మల్ని ఊరేగింపు గా తీసుకెళ్లిన తీరు ఒక మంచి అనుభూతినిచ్చింది. పూజా కార్యక్రమాలు ముగించుకుని తిరిగి సభాస్థలికి వచ్చాము. మాకు తోడుగా గ్రామ ఉప సర్పంచ్ శ్యమంత రెడ్డి, రాళ్ల అనంతపురం ప్రెసిడెంట్ అమర్, కృష్ణ మోహన్ రెడ్డి ఉన్నారు. విశ్రాంత MPDO జయరాములు సభను నిర్వహించారు. 

రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి గురించి అంకె శ్రీనివాస్ సుమారు 20 నిమిషాల పాటు సాధికారికంగా, ప్రవాహ సదృశంగా  ప్రసంగించారు. ఆయన రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి గురించి ఈ క్రింది విషయాలు ఉటంకించారు. 

  • రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. 
  • ఆయనకు ఆంధ్ర గీర్వాణ భాషల లోనే కాకుండా, ప్రాకృతం లో కూడా విశేష పాండిత్యం ఉంది. 
  • ఆకాశ వాణి పేరు సూచించినది రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారే. 
  • తిక్కన తీర్చిన సీత అనే వ్యాసంలో తిక్కన సీత పాత్ర ను మలిచిన తీరును రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు ఎంతో గొప్పగా పొగిడారు. 
  • వేమన మీద రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు సాధికారికమైన పరిశోధన చేసారు. 
  • హాలుడి గాథా సప్తశతి ని అనువదించారు. 
  • శ్రీ మహిశూర రాజాభ్యుదయ ధర్మః అనే పుస్తకం రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు రచించారు. 
  • పరకాల మఠం లో రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి విద్యాభ్యాసం జరిగింది. 

నేను, అంకె మాట్లాడిన తరువాత శ్యామ్ సుందర్ గారు, నంద నందన్ గారు ప్రసంగించారు. నంద నందన్ గారు  రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు రచించి 'ఉమా భరణ' రాగంలో స్వరపరచిన 'రామ చరణం శరణం, శర కోదండా భరణం' అనే కీర్తనను వేణువు మీద పలికించారు. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు రచించి, నాట కురంజీ రాగం లో స్వరపరిచిన 'జల రాశి బాలే లోలే ' అనే కీర్తన గురించిన వివరాలను నాకు తెలియజేశారు. అల్లా బకాశ్ అనే టీచర్ ఆధ్వర్యం లో చాలా మంది చిన్నారులు చక్కగా రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి గురించి మాట్లాడారు. 

వేదిక మీద ఉన్న అందరినీ MPDO జయరాములు సత్కరించారు. చివరగా చక్కటి భోజనం చేసి, అందరి దగ్గర సెలవు తీసుకుని అనంతపురం బయలుదేరాము. ఇంటికి చేరేసరికి సాయంత్రం 4.30 గంటలయ్యింది. 

ఇలా మరో ఆదివారం నాకు సుసంపన్నంగా గడిచిపోయింది. 





పెద్దమ్మ శిలా రూపం 

                                                              జ్యోతుల తో ఊరేగింపు 




















Comments

  1. మీ మధురానుభూతులను మాతో పంచుకొంటున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము sir 💐🌹👌🌹❤️🌹💐

    ReplyDelete
  2. Very good program sir. Happy to read 👌👌👍👍

    ReplyDelete
  3. So..conversing with a poet or a writer is higher than any stratospheric heights.

    A poet writes and writes wht he unable to write for many a life times.

    His thoughtful soul bleeds with ink through his working pen.

    The ability of a poet, writer or an author is not just words but thoughts of a dead souls who unable to write of their own are transferred to this alive author.

    So..the abstraction prevails, breaths and creates ripples with hardwired garland of letters.

    And a interesting aspect of writing is...

    If you're not not a writer your words won't get black and white.

    If you're not an author your words get colour of black on the clean sheet of white.

    If you're a poet your words enrich with every piece of writing and your brain gets rusted with every piece of writing.

    In a feel that poet gets refreshment with every work, so is nature compensates his every refreshing with double dose of vengeance.

    And I am author, writer and "proud poet in a prison".

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog