విద్యార్థి గా నేను 


నేను అందరి లాగా బుద్ది కుశలత ఉన్న విద్యార్థి నైతే కాదు. నిజానికి బుద్ది కుశలత లేకపోగా బుద్ది జాడ్యం కూడా ఉండేదేమో అని నాకు అనుమానం. ఒకటి నుంచి నాల్గవ తరగతి వరకు అనంతపురం లో ఉన్న వివేకానందా విద్యా మందిర్ లో చదివాను. ఇప్పుడు ఆ స్కూల్ ఎక్కడికి పోయిందని నన్నడక్కండి. ఉపాధ్యాయులు బాగానే చెప్పేవారు. ఈ స్కూల్ లో నాకు ఉపాధ్యాయులు పెట్టిన ఒక పోటీ ఎప్పుడూ గుర్తుకు వచ్చి నవ్వు వస్తూనే ఉంటుంది. ఒక సారి మాకు వర్ణమాల లో 'అ' నుంచి 'అః ' వరకు రాయమని పోటీలు పెట్టారు. ఎవరు ముందుగా రాస్తే వారికి మొదటి బహుమతి అని మా టీచర్లు చెపితే నేను అందరికంటే ముందే రాసి తీసుకువెళ్ళాను. కానీ ఆ హడావుడి లో 'ఉ ' మరియు 'ఊ' అనే రెండు అక్షరాలు ఎగరకొట్టేసాను. నాకు ఏ బహుమతి ఇవ్వాలో తెలియక మా అయ్యవార్లు మల్ల గుల్లాలు పడి రెండవ బహుమతి ప్రకటించారు. ఆ బహుమతి గా కోడి బొచ్చు నెత్తి మీద పెట్టుకున్న ఒక బొమ్మ ను ఇచ్చారు. దాని తల అలా, ఇలా ఊగేది. పుష్ప సినిమా విడుదల తరువాత ఇటీవలనే ఆ బొమ్మను గిరాటేశాను. ఆ బొమ్మ కున్న స్ప్రింగ్ తల అటూ , ఇటూ ఊగుతున్నప్పుడల్లా  ఆ బొమ్మ నన్ను "ఊ అంటావా మావా .. ఊహూ అంటావా మావా" అని వెక్కిరిస్తున్నట్టు అనిపించేది. ఈ  'ఉ .. ఊ ' రాయకపోవడం వలన నేను ద్వితీయ బహుమతి తో సర్దుకోవలసి వచ్చింది. 

అదే స్కూల్ లోనే నిర్వహించిన కథలు చెప్పే పోటీలో నాకు ప్రథమ బహుమతి వచ్చింది. ఏ కథ చెప్పానో గుర్తుకు లేదు  గానీ, ఇప్పుడు మాత్రం కనిపించిన ప్రతి ఒక్కరికీ రోజుకో కథ చెప్పి నెగ్గుకు వస్తున్నాను. 

నాలుగో తరగతి తరువాత మా నాన్నకు కదిరికి బదిలీ కావడంతో, మన మకాం కదిరికి మార్చబడింది. అక్కడ నేను ఐదు మరియు ఆరు తరగతులు వెలగబెట్టాను. 5 వ తరగతి శారదా కాన్వెంట్ లో చదివాను. అప్పుడు హిరణ్యకశుపుడి గా ఏకపాత్రాభినయనం స్టేజ్ మీద చేశాను. ఒక్క సారిగా స్టేజ్ నుంచి చూసిన నాకు చాలా మంది జనం కనిపించేసరికి పంచ జారినంత పనయ్యింది. నా మీసాలు ఊగి.. ఊగి ఊడి పోతాయేమో అనిపించింది. ఈ భయం వల్ల ఏకబిగిన స్క్రిప్ట్ లో ఉన్న డైలాగులన్నీ చెప్పేసి డ్రెస్సింగ్ రూములోకి పరుగు లంకించుకున్నాను. 

ఏదో అల్లరి చేయడంతో నన్ను శారదా కాన్వెంట్ యాజమాన్యం మందలించడంతో , నా ego ( అప్పటికే బాగా ముదిరినట్టు ఉంది) దెబ్బ తిని పాఠాలు సరిగా చెప్పడం లేదని మా నాన్నకు చెప్పాను. దాంతో టీసీ తీసుకుని నాన్న నన్ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. అప్పటి నుంచి నా చదువు మొత్తం ప్రభుత్వ బడులు మరియు కళాశాలల లోనే జరిగిపోయింది. 

కదిరి లో నా చదువు వానా కాలం చదువుగా మారిపోయింది. తరువాత కొద్ది కాలానికి నాన్నకు ఉరవకొండ బదిలీ కావడంతో, ఆ ఊరి లోని కరిబసప్ప ప్రభుత్వ పాఠశాల లో చేరిపోయాను. నా చదువు అనేక కారణాల వలన అధమ స్థాయి కి చేరిపోయింది. దీనిలో పాపం ఉపాధ్యాయుల తప్పేమీ లేదు. మనకు బుద్ది జాడ్యం ఆ స్థాయిలో తగులుకొని ఉంది అంతే. స్కూల్ షిఫ్ట్ పద్దతి లో జరిగేది. ఉదయం 8 గంటల నుంచి, మధ్యాహ్నం ఒంటి గంట వరకు అంతే. ఇంటికి వచ్చిన నాకు ఏమి చేయాలో తెలిసేది కాదు. హోమ్ వర్క్ లాంటివి ఇచ్చేవారు కాదు. అలా ఉరవకొండ లో 6 నుంచి 9 వ తరగతి వరకు చదివాను. 

ఉరవకొండ లో ఉన్నప్పుడే దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షలకు కట్టి చదవడం మొదలెట్టాను. ప్రవేశిక వరకు నెగ్గుతూ వచ్చాను. విశారద లో పూర్వార్ధ తప్పడం తో నా హిందీ వ్యామోహం మాయం అయిపోయింది. ఇప్పటికీ నా హిందీ పరిజ్ఞానం అంతంత మాత్రమే. ఈ హిందీ మాస్టర్ ఇల్లు ఉరవకొండ లో కొండ దగ్గరగా ఉండేది. ఈ కొండ చుట్టూ ఉన్న పరిసరాలు నాకు ఎందుకో మిస్టిక్ గా, భయంగా అనిపించేవి. మాస్టర్ ఉన్న వీధి పేరు జారగబండ వీధి. అప్పట్లో హైనా లు చిన్న పిల్లలను ఎత్తుకుపోతున్నాయి అనే వార్తలు ప్రముఖంగా వచ్చేవి. నన్ను హైనా వచ్చి ఎక్కడ ఎత్తుకు పోతుందో అని తెగ హైరానా పడేవాడిని. మేము గాంధీ చౌక్ లో ఉండేవాళ్లము. ఇప్పటికీ ఉరవకొండ బాల్య మిత్రులను కొందరిని కలుస్తూ ఉంటాను. స్కూల్ మధ్యాహ్నం అయిపోవడంతో నేను సాయంత్రం సీతా రామా చార్యుల వద్ద ట్యూషన్ వెళ్లేవాడిని. ఆయన సోషల్ స్టడీస్ బాగా చెప్పేవాడు. ఆయన రెండు, మూడు ఇళ్లు మారడంతో, నా ట్యూషన్ యొక్క కార్య క్షేత్రం  కూడా మారుతూ ఉండేది. 

నేను పదో తరగతి వచ్చేసరికి నాన్నకు తాడిపత్రి కి బదిలీ అయ్యింది. ఆ ఊర్లో సంజీవ రెడ్డి నగర్ లో ఉండేవాళ్లము. మా స్కూల్ చాలా దగ్గరగా ఉండేది. పెద్దప్ప గారి ట్యూటోరియల్ కు వెళ్లేవాడిని. ఎలాగో పదో తరగతి అత్తెసరు మార్కులతో పూర్తీ చేసుకున్నాను. లెక్కల్లో అయితే మరీ దారుణంగా 36 మార్కులు వచ్చాయి. 

ఇలా నా బాల్యం మొత్తం బాధ్యతా రాహిత్యంగా గడిచిపోయింది. ఇలా బాల్యం లో బాధ్యతా రాహిత్యంగా ఉండడం వలన, నేను జీవితంలో స్థిరపడడం కూడా బాగా ఆలస్యం అయ్యింది. 

అందుకే నేను విద్యార్థులకు ఇచ్చే సలహా ఏమంటే, మీరు మీ బాల్యాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా గణితాన్ని నిర్లక్ష్యం చేయకండి.  

Comments

  1. Replies
    1. Writing style is very impressive and simple. U never disappoint us. Good to know that you have acting skills too sir.

      Delete
    2. Thanks a lot for your encouraging words madam.

      Delete

Post a Comment

Popular posts from this blog