డిగ్రీ విద్యార్థిగా నా అనుభవాలు మరియు అవగాహనా స్థాయి
అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో 1988-91 లో B.Sc BZC English medium లో పూర్తీ చేసుకున్నాను. నా డిగ్రీ చదువు గురించి, నేను చదివిన పాఠ్య పుస్తకాల గురించి చర్విత చర్వణం కాకుండా కొన్ని అంశాలు చెపుతాను. మేము డిగ్రీ చదివే రోజుల్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు లేవు కాబట్టి డిగ్రీ కోర్సుకు మంచి డిమాండ్ ఉండేది. క్రేజ్ కూడా ఉండేది. అందునా B.Sc లో చేరడానికి మంచి పోటీ ఉండేది. ఆర్ట్స్ కళాశాలకు హాస్టల్ ఉండేది కాబట్టి, విద్యార్థులు రాయలసీమ లోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చేరేవారు. కంప్యూటరు రంగం అప్పుడప్పుడే పుంజుకుంటూ ఉంది. మా పిన్నయ్య కొడుకుకు IIT లోనూ, మా బావకు IISc లోనూ, నేను డిగ్రీ చదువుతుండగానే సీట్లు వచ్చేసాయి. వారికి నాకు ఉన్న తేడా అప్పుడే నాకు తెలిసివచ్చింది. వారు పదవ తరగతి లో ఉండగానే తమ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాకుండా, అది ఉన్నతంగా ఉండేలా చూసుకున్నారు. లక్ష్యం విషయం ఈ క్రింది రెండు అంశాలు నా విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలి.
- Low aim is crime
- Aim at the best impossible so that you can reach the best possible
డిగ్రీ చదివేటప్పుడు నాకున్న ప్రధాన లోపం ఏమంటే సిలబస్ ఏముందో సరిగా చూసుకునే వాడిని కాను. ఈ అలవాటు అలాగే కొనసాగడం వలన సివిల్ సర్వీసెస్ పరీక్షలో కూడా విజయం సాధించలేక పోయాను. మరో విషయం ఏమంటే నాకు లక్ష్య శుద్ది ఉండేది కాదు. సివిల్ సర్వీసెస్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఎందుకో మరి డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా medical representative ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కు హాజరయ్యాను.
మనం ఏదైనా పరీక్షలలో విజయం సాధించాలి అంటే, ఈ క్రింది కిటుకులు పాటించాలి.
- సిలబస్ ను కూలంకషంగా తెలుసుకోవాలి
- నమూనా ప్రశ్న పత్రాలను దగ్గర పెట్టుకోవాలి
- గత పరీక్షల ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయాలి
- పాఠ్యాంశాలను వినాలి, చదవాలి, చర్చించాలి, రాయాలి.
- సంబంధిత లక్ష్యాలు పెట్టుకోవాలి కానీ, పరస్పర సంబంధం లేని లక్ష్యాల వైపు ఆకర్షితులు కాకూడదు.
- మేము చదువుకున్న సమయం లో Teacher centric methods లో బోధన కొనసాగేది. మా గురువుల మేధో సంపత్తి అపారం కాబట్టి నాకు అది కలిసివచ్చింది. కానీ నేను ఎక్కువ సేపు పాఠం వినలేక పోయేవాడిని. ఇక్కడే విద్యార్థులు జాగ్రత్త పడాలి. వినడం నేర్చుకుంటే, విజయం సులభం అవుతుంది. వినడం వలన జ్ఞాపక శక్తి మెరుగవుతుంది.
- ఇతర పుస్తకాలు ఎన్ని చదివినా కూడా పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు చదవడం నిర్లక్ష్యం చేయకండి.
- మేము చదువుకునే కాలం లో సంపద సృష్టించగలిగిన అద్భుతాలు మాకు ఇంకా అనుభవంలోకి రాలేదు. ఇప్పటి విద్యార్థులు తెలుసుకోవలసింది ఏమంటే డబ్బు సంపాదిస్తేనే చాలా సుఖాలు అందుబాటులోకి వస్తాయి. మీరు విజ్ఞానవంతులు అవుతే, ధనవంతులు కావడం సులభం. సరైన విద్యార్హతలు లేకుండా ధనవంతులు కావడం అందరికీ సాధ్యం అయ్యే వ్యవహారం కాదు.
- అప్పట్లో మాకు స్టార్టప్ కంపెనీలు లాంటి పదాలు తెలియవు. ఉద్యోగం వస్తే చాలు అనుకునే వాళ్లం. నేను ఇప్పటి తరం వారికి కూడా చెప్పేది ఏమంటే మీరు చేస్తున్న ఉద్యోగాన్ని మీరు తక్కువ అంచనా వేయకండి. ఉద్యోగం విలువ వదిలేసిన తరువాత తెలుస్తుంది.
- మా తరం లో కామర్స్ కు పెద్ద క్రేజ్ ఉండేది కాదు. విద్యా వ్యవస్థ మార్కెట్ కు అనుగుణంగా మారిన ఈ కాలం లో కామర్స్ కు డిమాండ్ పెరిగింది. ఇక్కడ మరో సలహా ఏమంటే, మీరు ఏమి చదవాలనుకుంటున్నారు అనేది పూర్తిగా మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోకండి. మీ మార్కెట్ ను మీరే సృష్టించుకోవాలి.
- వీలైనంత తొందరగా మీ లక్ష్యం నిర్ధారించుకోండి. Early bird catches flies అనే విషయం మరవకండి. ఢిల్లీ నగరం లో పిల్లలు స్కూల్ స్థాయిలో ఉండగానే సివిల్ సర్వీసెస్ కు సన్నద్ధం అవడం మొదలెడతారు. నాకు సివిల్ సర్వీసెస్ రాయడానికి ఎన్ని attempts ఉంటాయనే ప్రాథమిక సమాచారం డిగ్రీ లో తెలిసింది అంటే నేను ఎంత వెనుకబడి ఉండేవాడినో అర్థం చేసుకోండి.
- వీలైనంత వరకు పెద్ద నగరాల్లో చదివే ప్రయత్నం చేయండి. అప్పుడే మన చుట్టూతా ఎన్ని అవకాశాలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. అందుకే అరిస్టాటిల్ 'City is the greatest school' అన్నాడు.
- నేను అప్పుడప్పుడు బెంగళూరు వెళ్లేవాడిని. నేను హాజరైన మొదటి ఇంటర్వ్యూ medical representative ఉద్యోగం కోసం బెంగళూరు లోని Gate way Hotel లో జరిగింది. రిసెప్షన్ లో ఉన్న యువతి అడిగినదానికి సరైన సమాధానం ఇవ్వలేకపోయాను. నేను వేసుకున్న షర్ట్ చాలా వదులుగా ఉండడంతో ఆమె షర్ట్ వైపు తేరిపార చూసేసరికి నేను తెగ ఇబ్బంది పడ్డాను. Dress code ప్రాధాన్యత నాకు అప్పుడు తెలిసివచ్చింది. అందుకే మీరు ఆహార్యం ఎబ్బెట్టుగా కాక దర్జాగా ఉండేలా చూసుకోండి. సందర్భానికి తగ్గ దుస్తులను ధరించాలి.
- నేను బయట పనులు చేసేవాడిని కాదు. కార్య దక్షత నాలో ఉండేది కాదు. చిన్నప్పుడే మీ వ్యవహార దక్షత ను పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇంటికి కావాల్సిన సరుకులు, గట్రా మీరే పట్రాండి. నేను చిన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టింది కూడా లేదు. వ్యవహార దక్షత చిన్నతనం లో అలవరుచుకోవాలంటే తండ్రి మీద ఆధారపడడం తగ్గించాలి.
- డిగ్రీ లో కూడా నాకు లక్ష్యం పట్ల క్లారిటీ లేకపోవడం వలన నేను అనుకున్నది సాధించలేక పోయాను. మీరు అనుకునేది ఏదైనా సరే బలంగా అనుకోండి. సంకల్పానికి సాధన తోడైతే విజయం వెన్నంటి వస్తుంది. ఒక వేళ ఏదైనా కారణాల వలన విజయం మీతో దోబూచులాడితే , ఓటమి తెచ్చిన అనుభవం నుంచి లబ్ది పొందే ప్రయత్నం చేయండి.
- ఒంటరితనం లేదా ఏకాంతాన్ని అలవాటు చేసుకోండి. నేను డిగ్రీ స్థాయిలో కూడా ఒంటరిగా ప్రయాణించలేదు. ఇంట్లో వాళ్లు అంత కేరింగ్ గా ఉండేవారు. నేను ఒంటరి ప్రయాణాలకు అలవాటు పడడానికి చాలా కాలం పట్టింది. ఒంటరితనం అంటే ఉన్న భయం నా వ్యక్తిత్వం లో ఇప్పటికీ పెద్ద అడ్డంకిగా నిలిచిపోయింది.
- కనీసం మూడు భాషలు వచ్చి ఉండాలి
- ఒంటరి ప్రయాణాలు చేసి ఉండాలి
- డిగ్రీ తరువాత ఉన్న career options పట్ల సాధికారికమైన అవగాహన ఉండాలి
- పోటీ పరీక్షల గురించి అవగాహన ఉండాలి.
- ఇంట్లో వారి మీద ఆధారపడడం తగ్గించాలి.
- డబ్బు విషయం లో పొదుపు పాటించాలి.
Well said sir about goal setting and planning. Very useful for the students if they follow.
ReplyDelete